- బీబీఎంపీని రెండుగా చీల్చే యోచన
- సాధక బాధకాలను సమీక్షిస్తాం
- ఈ సారి బడ్జెట్‌లో ప్రకటన
- రాజ కాలువలకు ఇరువైపులా ఆర్‌సీసీ గోడ
- కాలువలపై 77 చోట్ల ఫ్లైఓవర్లు
- సీఎం సిద్ధరామయ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను రెండుగా విభజించే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) పూర్తి చేసిన, చేపట్టనున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన బీబీఎంపీని విభజించాలనే ప్రతిపాదన పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందన్నారు. దీనిపై సాధక బాధకాలను సమీక్షించిన తర్వాత ఈ నెల 14న శాసన సభలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో ప్రకటిస్తామని వెల్లడించారు.
నగరంలో వాన నీటి ముంపును అరికట్టడానికి రూ.85 కోట్ల వ్యయంతో రాజ కాలువలకు ఇరువైపులా ఆర్‌సీసీ గోడల నిర్మాణానికి ఆమోదం తెలిపామని చెప్పారు. రాజ కాలువలున్న 77 చోట్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తామని తెలిపారు. ఓకలీపురం జంక్షన్ నుంచి ఫౌంటెన్ సర్కిల్ వరకు ఎనిమిది బాటల సొరంగ మార్గం నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపామని వెల్లడించారు.
భూ సేకరణకు ఇప్పటికే రూ.77 కోట్లు విడుదలైందని, ఈ ప్రాజెక్టుకు రూ.187 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. కాగా నగరంలోని రెసిడెన్సీ రోడ్డు, విశ్వ మాన్య రోడ్డు, మ్యూజియం రోడ్డు, కన్నింగ్‌హాం రోడ్డు, సిద్ధయ్య పురాణిక్ రోడ్డు, జేసీ రోడ్డు, నృపతుంగ రోడ్డు సహా 12 రోడ్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.