జలకళ
- నిండుకుండలా జలాశయాలు
- కోస్తా, మలెనాడులో జనజీవనం అస్తవ్యస్తం
- జలదిగ్బంధంలో దక్షిణ కన్నడ జిల్లాలోని పలు గ్రామాలు
- తుంగభద్ర 10 గేట్లు ఎత్తివేత
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నైరుతి రుతు పవనాలు కాస్త ఆలస్యమైనప్పటికీ వరుణుడు కరుణించాడు. రాష్ర్ట వ్యాప్తంగా గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన జలాశయాలన్నీ దాదాపుగా నిండిపోయాయి. కోస్తా, మలెనాడు జిల్లాల్లో భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆ జిల్లాల్లోని నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రహహిస్తున్నాయి. కర్ణాటకతో పాటు రాయలసీమ జిల్లాల జీవనాడిగా భావించే తుంగభద్ర నది పూర్తిగా నిండిపోయింది.
శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తుంగా నది ఉరకలెత్తింది. దీని ప్రభావం వల్ల తుంగభద్రలో ఇన్‌ఫ్లో మరింతగా పెరగనుంది. బీజాపుర జిల్లాలోని ఆల్మట్టి, హాసన జిల్లాలోని హేమావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండ్య జిల్లాలోని కేఆర్‌ఎస్ జలాశయం గరిష్ట మట్టానికి చేరువలో ఉంది. కృష్ణా నదిలో కూడా వరద ఉధృతి సాగుతోంది.
స్వల్ప విరామం అనంతరం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణాతో పాటు దాని ఉప నదులు ఉరకలెత్తాయి. మలెనాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన జలాశయాల్లో ఇన్‌ఫ్లో పెరిగింది. అనేక గ్రామాల్లో పడవల ద్వారా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దక్షిణ కన్నడ జిల్లాలో కుండపోత
భారీ వర్షాల కారణంగా దక్షిణ కన్నడ జిల్లాలో అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధర్మస్థలకు 17 కిలోమీటర్ల దూరంలోని కొక్కడ గ్రామంలో ఉన్న పురాతన ఆలయ సముదాయం నీట మునిగింది. విద్యానాథేశ్వర విష్ణుమూర్తి ఆలయ సముదాయంలోని శివుని గర్భ గుడి ద్వారం వరకు మునిగిపోయింది. నాగ పంచమిని పురస్కరించుకుని శుక్రవారం అనేక మంది భక్తులు అక్కడే ఉన్న నాగ దేవతల విగ్రహాలకు నీరు, పాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. శివుని గర్భ గుడి జల దిగ్బంధంలో ఉన్నందున దూరం నుంచే స్వామిని పూజించుకున్నారు.
తుంగభద్ర 10 గేట్లు ఎత్తివేత
సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర పరిధిలోని పలు జిల్లాలకు తాగు, సాగునీరిందిందే ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాం నిండుకుండలా పొంగిపొర్లుతోంది. శుక్రవారం సాయంత్రానికి తుంగభధ్రలో లక్ష క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రావడంతో డ్యాంకు ఉన్న 33 గేట్లులో 10 గేట్లును ఎత్తివేసి నదికి వదిలారు. డ్యాం నుంచి దిగువకు ప్రారంభంలో 3 గేట్లును ఎత్తి వదిలిన అధికారులు సాయంత్రం 10 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 1633 అడుగులు కాగా, డ్యాంలో 1632 అడుగులు పెట్టుకుని మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు.