పదేళ్లుగా భారీ మార్పులు
ఖరీఫ్‌కు ఇక కష్టకాలమే
‘వర్షాకాల విస్తరణే’ విలన్
వరద ప్రాంతాల్లో కరువు
కరువు జిల్లాల్లో వరదలు
దేశవ్యాప్తంగా తీవ్ర మార్పులు
పర్యావరణ ఒడిదుడుకుల వల్లే
వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారు. కొన్నేళ్లుగా మన దేశంలో వానాకాలం ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటిదాకా కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అకాలంలో భారీ వానలు, సీజన్ మధ్యలో విపరీతమైన ఎండలు పరిపాటిగా మారాయి. వాతావరణ తీరుతెన్నుల్లో ఈ భారీ మార్పులు భారత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాల సీజన్ తీరుతెన్నులే మారిపోతున్నాయి.
సీజనల్ వానలు సాధారణంగా జూన్ తొలి, లేదా రెండో వారంలో మొదలై సెపె్టంబర్లో తగ్గుముఖం పడతాయి. కానీ ఈ క్రమం కొన్నేళ్లుగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. వానలు ఆలస్యంగా మొదలవడం, సెప్టెంబర్‌ను దాటేసి అక్టోబర్ దాకా కొనసాగడం పరిపాటిగా మారింది. దాంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సరిగ్గా చేతికొచ్చే వేళ వానల కారణంగా దెబ్బ తినిపోతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్ కూడా అక్టోబర్ దాకా కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల తాలూకు విపరిణామమేనని సైంటిస్టులు చెబుతున్నారు...
భారత్‌లో వర్షాకాలం రాకపోకల్లో మార్పులు ఒకట్రెండేళ్లలో మొదలైనవేమీ కాదు. పదేళ్లుగా క్రమంగా చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఏటా పలు రాష్ట్రాల్లో భయానక వరదలకే గాక తీవ్ర పంట నష్టానికీ దారి తీస్తున్నాయి. ఈ ధోరణి దేశ ఆహార భద్రతకు కూడా సవాలుగా పరిణమిస్తోంది. దీన్ని ఎదుర్కోవాలంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం మినహా ప్రస్తుతానికి మరో మార్గాంతరమేదీ లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘‘మన దేశంలో వర్షాలకు ప్రధాన కారణమైన నైరుతీ రుతుపవనాల కదలికలు కొన్నేళ్లుగా బాగా మందగిస్తున్నాయి. వాటి విస్తరణే గాక ఉపసంహరణ కూడా నెమ్మదిస్తూ వస్తోంది. మనం ఒప్పుకోక తప్పని వాతావరణ మార్పులివి. మన సాగు పద్ధతులనూ అందుకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిందే’’ అని చెబుతున్నారు.
అంతా గందరగోళమే...
సీజన్‌లో మార్పుచేర్పుల వల్ల ఉత్తర, పశ్చిమ భారతాల్లో కొన్నేళ్లుగా భారీ వర్షపాతం నమోదవుతోంది. గుజరాత్, రాజస్తాన్‌లలో గత దశాబ్ద కాలంగా సగటున ఏకంగా 30 శాతం అధిక వర్షపాతం నమోదవడమే ఇందుకు తార్కాణం. ఆ ప్రాంతాల్లో గతంలో లేని భారీ వర్షాలు ఇప్పుడు మామూలు దృశ్యంగా మారాయి. ఇక గంగా మైదాన ప్రాంతాల్లో అక్టోబర్ దాకా కొనసాగుతున్న భారీ వానలు ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంటల సీజన్‌నే అతలాకుతలం చేసేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో అక్టోబర్ తొలి వారంలో పంట కోతలు జరుగుతాయి. అదే సమయంలో వానలు విరుచుకుపడుతున్నాయి. ‘‘దాంతో కోతలు ఆలస్యమవడమే గాక పంట నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బ తింటోంది. మొత్తంగా వరి, మొక్కజొన్న, పప్పుల దిగుబడి బాగా తగ్గుతోంది’’ అని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎని్వరాన్‌మెంట్ అండ్ వాటర్‌లో సీనియర్ ప్రోగ్రాం లీడ్ విశ్వాస్ చితాలే అన్నారు.
ఆహార భద్రతకూ ముప్పు
వర్షాలు సీజన్‌ను దాటి కొనసాగడం వల్ల ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. ఈ ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 408.72 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు అక్టోబర్ దాకా కొనసాగుతాయన్న అంచనాలు ఇప్పట్నుంచే గుబులు రేపుతున్నాయి. ఇది తీవ్ర పంట నష్టానికి, తద్వారా దేశవ్యాప్తంగా బియ్యం, పప్పుల కొరతకు దారి తీయడం తప్పకపోవచ్చంటున్నారు.
→ ఇలా సీజన్ దాటాక కొనసాగిన భారీ వర్షాలు, వరదల దెబ్బకు 2016 నుంచి 2022 మధ్యలో దేశవ్యాప్తంగా మొత్తమ్మీద 3.4 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో పంటలు దారుణంగా దెబ్బ తిన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
→ వాతావరణ మార్పుల దెబ్బకు 2022లో భారత్‌లో జీడీపీ వృద్ధిలో 8 శాతం క్షీణత నమోదైంది. 7.5 శాతం సంపద హరించుకుపోయింది.
→ సాధారణంగా సెపె్టంబర్ తర్వాత భారీ వర్షాలు కురవని పశి్చమ భారతదేశం ఈ మార్పులకు తాళలేకపోతోంది. అక్కడి నీటి నిర్వహణ వ్యవస్థ ఈ వరదలను తట్టుకోలేకపోతోంది.
→ ఈ సరికొత్త వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పద్ధతులు అవలంబించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
→ డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, ఇటు వరదలను, అటు కరువు పరిస్థితులను సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తేవడం, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం తప్పదంటున్నారు.
మన నిర్వాకమే...!
మనిషి నిర్వాకం వల్ల తీవ్ర రూపు దాలుస్తున్న వాతావరణ మార్పులే వానల సీజన్‌లో తీవ్ర హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతున్నారు.
→ సముద్రాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతోంది. భారీ వర్షాలు, వరదలకు దారి తీస్తోంది.
→ ఎల్ నినో, లా నినా వంటివి పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి.
→ ఎల్ నినోతో వర్షాకాలం కుంచించుకుపోయి పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది.
→ లా నినా వల్ల వర్షాలు సుదీర్ఘకాలం కొనసాగి వరదలు పోటెత్తుతున్నాయి.
→ సాగు, నీటి నిర్వహణతో పాటు దేశంలో సాధారణ జన జీవనమే తీవ్రంగా ప్రభావితమవుతోంది.
85 శాతం జిల్లాలపై ప్రభావం
మన దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు గత పదిహేనేళ్లలో ఏకంగా ఐదు రెట్లు పెరిగిపోయాయి. ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఏకంగా 85 శాతం పై చిలుకు జిల్లాలను ప్రభావితం చేస్తోంది. వరదలు, తుఫాన్లు, కరువులు, తీవ్ర వడగాడ్పులతో కిందామీదా పడుతున్నట్టు ఐపీఈ–గ్లోబల్, ఎస్రి–ఇండియా సంయుక్త అధ్యయనం తేలి్చంది. అయితే వీటిలో సగానికి పైగా జిల్లాల్లో గతంలో తరచూ వరద బారిన పడేవేమో కొన్నేళ్లుగా కరువుతో అల్లాడుతున్నాయి. కరువు బారిన పడే జిల్లాలు ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతున్నాయి! గత 50 ఏళ్ల వాతావరణ గణాంకాలను లోతుగా విశ్లేíÙంచిన మీదట ఈ మేరకు వెల్లడైంది. వాతావరణ మార్పుల వల్ల దేశానికి ఎదురవుతున్న ముప్పును ఇవి కళ్లకు కడుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇంకా ఏం చెప్పిందంటే...
→ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2036 నాటికి ఏకంగా 147 కోట్ల మంది భారతీయులు తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు.
→ దేశంలోని తూర్పు, ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర వరదలు పరిపాటిగా మారతాయి.
→ ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటకల్లో కరువు పరిస్థితులు పెరిగిపోతాయి. శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, కటక్ (ఒడిశా) వంటి జిల్లాల్లో ఈ మార్పులు కొట్టొచి్చనట్టు కని్పస్తున్నాయి.
→ ఏపీతో పాటు ఒడిశా, బిహార్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, యూపీల్లో 60 శాతానికి పైగా జిల్లాలు తరచూ ఇటు కరువు, అటు వరదలతో కూడిన తీవ్ర వాతారణ పరిస్థితుల బారిన పడుతున్నాయి.
→ త్రిపుర, కేరళ, బిహార్, పంజాబ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కరువు ప్రాంతాల్లో వరదలు, వరద ప్రాంతాల్లో కరువులు పరిపాటిగా మారతాయి.
→ బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, పటా్న, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాలు, వాటి పరిసర ప్రాంతాలు ఈ ‘కరువు–వరద’ ట్రెండుతో అతలాకుతలమవుతున్నాయి.
→ గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 0.6 డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగిపోవడమే ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణం.
ఏం చేయాలి?
→ వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ సాగు తీరుతెన్నులను కూడా తదనుగుణంగా మార్చుకోవడం ఇకపై తప్పనిసరి.
→ ఇందుకోసం సమీకృత క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్‌ఓ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్లైమేట్ ఫండ్ (ఐసీఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి.
→ ప్రతి సీజన్లోనూ వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా పంటలను మార్చుకుంటూ వెళ్లాలి.
→ జాతీయ, రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలను మార్చుకోవాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment