సాక్షి, నెట్‌వర్క్: భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో 2.23 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా వికారాబాద్‌లో 5.6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రాంతంవారీగా.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో అత్యధికంగా 20.85 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా మంబాలో 15.3 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 12.8 సెం.మీ., జగిత్యాల జిల్లా వెల్గటూరులో 12.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 15 మండలాల్లో పది సెంటీమీటర్లకు మించి వర్షం కురిసింది. రాష్ట్రంలో నైరుతి సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 22.64 సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.31 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కందనెల్లి బ్రిడ్జి వద్ద తాండూరు–హైదరాబాద్ రోడ్డు కొట్టుకుపోయింది. దోర్నాల్ సమీపంలోని కాగ్నా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన తెగిపోయింది.
కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన వేలాది ఎకరాలు
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్, నిజాంసాగర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. బిచ్కుంద మండలంలోని మెక్క, గుండె కల్లూర్, ఖద్‌గాం, రాజుల్లా, మిషన్‌కల్లాలి, కందార్‌పల్లి, గుండె కల్లూర్, జుక్కల్ మండలంలోని గుల్లా, లడేగాం, నాగల్‌గాం, మద్నూర్ మండలంలోని చిన్న టాక్లీ, పెద్ద టాక్లీ, సిర్పూర్, దోతి, ఇలేగావ్, కుర్లా తదితర గ్రామాల పరిధిలోని వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల పంటచేలు నీట మునిగిపోయాయి.
నిజామాబాద్ జిల్లాలో చెరువులకు జలకళ
నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు నీటమునిగాయి. జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలిలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చర జలపాతాల వద్ద వరద నీరు పోటెత్తుతోంది. కుంటాల జలపాతం వద్ద నీరు పైనుంచి ఎగిసి పడుతుండటంతో సందర్శకులను వ్యూ పాయింట్ వరకే అనుమతిస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని వర్షాలకు ప్రాణహిత ఉప్పొంగడంతో భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో కలుస్తోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి, చెన్నూరు, భీమిని మండలాల్లో వాగులు పొంగిపొర్లడంతో దాదాపు 33 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మామడ మండలంలోని అనంతపేట్-టెంబుర్ని గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. నర్సాపూర్(జి) మండలకేంద్రం నుంచి దేవునిచెరువు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. కడెం మండలంలోని అటవీ గ్రామం ఇస్లాంపూర్‌కు వెళ్లే మార్గంలో నాలుగు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
భద్రాద్రి జిల్లాలో రాకపోకలకు ఇబ్బందులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని నుంచి ఉల్వనూరు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతిన్నది. దీంతో వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదురయ్యాయి. సుజాతనగర్ మండలంలోని నరసింహసాగర్, సర్వారం గ్రామాల మధ్య రైల్వే వంతెనను వరదనీరు ముంచెత్తింది. వరదపోటుతో నరసింహసాగర్, అంజనాపురం, బేతంపూడి, గద్దెలబోరు తదితర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. టేకులపల్లి మండలంలో సంపత్‌నగర్, అనిశెట్టిపల్లి మధ్య వాగు ప్రవహిస్తుండగా రాకపోకలు స్తంభించాయి.
నేడూ భారీ వర్షాలు..
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించిందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు (గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment