సాక్షి, న్యూఢిల్లీ : భారత ఉపఖండం నుంచి సాధారణంగా రుతు పవనాలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వెనక్కి పోతాయి. ఈ సారి నెల పది రోజులు ఆలస్యంగా అక్టోబర్ పదవ తేదీ నుంచి వెనక్కి మళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధన శాఖ అంచనా వేసింది. ఈసారి సాధారణ వర్షపాతాలే ఉంటాయని గత ఏప్రిల్ నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి రుతు పవనాల సీజన్ పూర్తి అనూహ్యంగా కొనసాగింది. మొట్టమొదట కేరళలోని వారం రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. మూడు వారాల అనంతరం ముంబైకి చేరుకున్నాయి.
రుతుపవనాల ఆలస్యం వల్ల జూన్ నెలలో 33 శాతం లోటు వర్షపాతం నమోదయింది. సీజన్ ముగిసే సమయానికి సాధారణ వర్షపాతం కన్నా పది శాతం ఎక్కువ కురిసింది. అనతి కాలంలోనే భారీ వర్షాలు కురియడం మరో విశేషం. దీని వల్లనే అధిక వర్షపాతం నమోదయింది. ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి. మొదట్లో కర్ణాటక వరదల్లో 80 మంది మరణించారు. బీహార్‌లో సెప్టెంబర్ నెలలో వరదలు సంభవించి అంతే మంది మరణించారు. 1951 నుంచి 2000 వరకు 50 సంవత్సరాల్లో జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు సరాసరిన 88 శాతం వర్షపాతం నమోదయింది. ఈ ఒక్క ఏడాదే రుతుపవనాల కాలంలో 97 శాతం వర్షపాతం కురిసింది. సీజన్ పూర్తి కాలానికి అంటే అక్టోబర్ మొదటి వారానికి సరాసరి తీసుకున్నట్లయితే 110 శాతం వర్షపాతం నమోదయింది.
జూన్ మొదటి వారంలో వర్షపాతం లోటు సెప్టెంబర్ మూడోవారంలో వర్షపాతం లోటు
సీజన్‌లో మొదటి మూడు వారాలపాటు అతి తక్కువ వర్షపాతం కురిసి, ఆ తర్వాత వెనువెంటనే భారీ వర్షాలు కురిశాయి. ఈసారి వర్షపాతం ఇలా కొనసాగడం అన్నది ఓ ప్రత్యేకమైనదని, వచ్చే ఏడాది ఇది పునరావృతం అవుతుందని భావించడం తప్పని పుణెకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ తెలిపారు. ఈసారి మధ్య, దక్షిణ ప్రాంతాల్లో అధిక వర్షపాతం కురిసింది. ఈ రెండు ప్రాంతాల్లో గతేడాది తక్కువ వర్షపాతం నమోదయింది. ఇప్పటికీ ఈశాన్య ప్రాంతాల్లో, ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురిసింది. గతేడాది కూడా ఈ ప్రాంతాల్లో 24 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. గతేడాది 9 శాతం తక్కువ వర్షపాతం నమోదుకాగా, ఈసారి 110 శాతం నమోదవడం విశేషం.ఆలస్యంగా వర్షాలు కురవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడం వాస్తవమే అయినా అధిక వర్షపాతం వల్ల దేశంలోని పలు రిజర్వాయర్లు నిండడం, భూగర్భ జలాలు పెరగడం హర్షించతగ్గ పరిణామం. అల్ప పీడనాల వల్లనే ఈసారి అధిక వర్షం కురిసినట్లు డీఎస్ పాయ్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment