
ఉత్తరాంధ్ర, ఒడిశాపై ప్రభావం ఉండే అవకాశం
పూరీ వద్ద తీరం దాటిన ప్రస్తుత వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చినా ఆ తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడవచ్చని, అది ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
అలాగే, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది.
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..
మరోవైపు.. తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది.
అనకాపల్లి జిల్లా గోలుగుండలో 11.2, విజయనగరం పూసపాటిరేగలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురలో 6.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment