19 నుంచి వర్షాలు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం/చింతపల్లి( అల్లూరి జిల్లా): ఇటీవల ఫెంగల్ తుపాన్ మాదిరిగానే.. ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా అంచనాలకు అందకుండా తిరుగుతోంది. ప్రస్తుతం ఇది నెల్లూరు, ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమై ఉంది. రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇది తమిళనాడు తీరం వైపు వెళ్తుందా నెల్లూరు వైపు వస్తుందా అనేదానిపై స్పష్టత రావడం లేదని చెబుతున్నారు.
వాయుగుండంగా మారినా సముద్రంలోనే బలహీనపడిన తర్వాత తీరం దాటుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగా ఈనెల 18 రాత్రి నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 19 నుంచి 22 తేదీల మధ్య ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు.
మన్యంను వణికిస్తున్న చలి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. దీంతో మన్యం వాసులు చలికి గజగజలాడుతున్నారు. సోమవారం జి.మాడుగులలో 4.1 డిగ్రీలు, అరకులోయలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, ఉష్ణోగ్రతల విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. చింతపల్లిలో 7.0, జీకే వీధిలో 7.3, హుకుంపేటలో 7.8 ,పెదబయలులో 9.0,అనంతగిరిలో 9.4 ,కొయ్యూరులో 11.6 డిగ్రీల చొçప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment