ఎట్టకేలకు ‘మెయింటెనెన్స్’కు మోక్షం!
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల నిర్వహణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరో రెండు రోజుల్లో పనులను ప్రారంభించనున్నట్లు ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ డ్యాం వద్ద మొత్తం 42 వరద గే ట్లు ఉన్నాయి. అలాగే కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు నాలుగు, లక్ష్మీ కాలువ గేట్లు రెండు, సరస్వతి కాలువ గేట్లు రెండు వీటన్నింటితో పాటు ప్రస్తుత సంవత్సరం వ రద కాలువ ఆరు గేట్లకు ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రాజెక్ట్ అధికారులు నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపడతారు.
దీనికి సుమారు 10 లక్షల బడ్జెట్ అవసరం ఉండగా, గేట్లకు గ్రీస్, గేట్ల రోప్‌కు ఆయిల్, ప్యూజ్‌లు తదితర పనులు చేయాల్సి ఉంటుంది. అయితే మే 20 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో గేట్ల నిర్వహణ పనులకు ఏఎంఏ ( ఏన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్) మంజూరు కాలేదు. రెండు రోజుల క్రితం గేట్ల నిర్వహణకు బడ్జెట్ మంజూరు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రాజెక్ట్ ఈఈ రామారావు తెలిపారు. గతేడాది చేపట్టిన నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో ప్రస్తుత సంవత్సరం పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో గేట్ల ‘నిర్వహణ’ ఆలస్యమైంది.
ప్రభుత్వాల నిర్లక్ష్యం
ప్రాజెక్ట్‌పై డ్యాం నిర్వహణకు ఏఎంఏ మంజూరుకు ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంవల్ల వేసవి కాలంలో చేపట్టాల్సిన నిర్వహణ పనులను వర్షకాలంలో చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. వర్ష కాలంలో పనులు చేపట్టిన వెంటనే వర్షం కురిస్తే ప్రయోజనం శూన్యమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పనులు చేపట్టకుంటే గేట్ల పరిస్థితిని ఊహించడం కష్టంగానే ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వారే వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఏఎంఏ మంజూరు చేసి ఉంటే ఇప్పటి వరకు నిర్వహణ పూర్తయ్యేదని రైతులు అంటున్నారు. ప్రాజెక్ట్ నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చి ప్రాజెక్ట్ నిండు కుండలా మారితే వరద గేట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది వరకే ప్రాజెక్ట్ వరద గేట్లు (18, 19 ) టన్‌బక్కెల్ చెడిపోయి పని చేయడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
ప్రతి ఏటా సీజన్‌కు ముందు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు జూన్ మధ్యలో నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతాయి. నీటి మట్టం ఆధారంగా ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వా రా నీటి విడుదలను అధికారులు గోదావరిలోకి విడుదల చేపడతారు. ప్రతి ఏట సీజన్‌కు ముందు గేట్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడతారు. సీజన్‌లో అత్యవసరంగా గేట్లను ఎత్తి నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకుండా గేట్ల మెయింటెనెన్స్ చేపడుతారు. అంతేకాకుండా గేట్లను ఎత్తడానికి ఉప యోగించే క్రేన్ రోప్ కు కూడా మెయింటెనెన్స్ చేపడతారు. ఇవన్నీ ప్రస్తుత సంవత్సరం సీజన్‌లో జరిగే అవకాశం ఉంది.