నిండు గర్భిణికి నరకం చూపిన వైద్యురాలు
సీహెచ్‌సీలో అందని వైద్యం
రిమ్స్‌లోనూ చుక్కెదురు..
ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవం.. మగశిశువు జననం
ఉట్నూర్: వైద్యులు దైవంతో సమానం అంటారు.. కానీ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సామాజిక ఆస్పత్రిలో వైద్యురాలు నిండు గర్భిణికి ప్రత్యక్ష నరకం చూపింది. ఇటు జిల్లాకు పెద్దదిక్కయిన రిమ్స్‌లోనూ వైద్యం అందని ద్రాక్షగా మారింది. దీంతో గత్యం తరం లేక గర్భిణిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు శస్త్రచికిత్స చేయగా, ఆమె పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. జిల్లాలోని నార్నూర్ మండలం భీంపూర్‌కు చెందిన రాథోడ్ మాయవతికి నెలలు నిండడంతో ఆస్పత్రికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 11 రోజుల క్రితం ఉట్నూర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమెకు పురిటినొప్పులు రావడంతో వరుసకు అత్తమామలైన రాథోడ్ రవీందర్, సుమితబాయి, వదిన చంద్రకళలు ఉట్నూర్ సామాజిక ఆస్పత్రి(సీహెచ్‌సీ)కి తీసుకెళ్లారు. తమ కోడలికి వైద్యం అందించాలని విధుల్లో ఉన్న వైద్యురాలు రాజ్యలక్ష్మిని సుమితబాయి వేడుకుంది. శరీరం చల్లబడిపోతోందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని చెప్పగా.. వైద్యురాలు ‘నొప్పులు వచ్చాయి కదా.. డెలివరీ కాదా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కనీసం బీపీ అయినా చూడాలని కోరగా.. ‘బీపీ చూస్తే ఏమవుతుంది.. మీకు ఏం తెలుస్తుంది..’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. రిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేయాలని కోరగా.. ఆగ్రహంతో ఊగిపోతూ ‘మీ ఇష్టమున్నకాడ చెప్పుకోండి.. ఇక్కడ ఉంటే ఉండండి.. లేకుంటే తీసుకెళ్లండి..’ అంటూ వెళ్లిపోయింది. చివరికి విషయం ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన అంబులెన్సు సౌకర్యం కల్పించి రిమ్స్‌కు తరలించారు. అక్కడ మాయవతి రిపోర్టులు పరిశీలించిన వైద్యులు ‘ప్రసవానికి సమయం ఉంది, తీసుకెళ్లండి’ అంటూ సలహా ఇచ్చారు. మాయవతి అప్పటికే ప్రసవవేదన పడుతుండడంతో ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు శస్త్ర చికిత్స చేయగా, మధ్యాహ్నం 1.30 గంటలకు మగ శిశువు జన్మించింది. కాగా, సీహెచ్‌సీ వైద్యురాలు రాజ్యలక్ష్మిని సంప్రదించగా.. ప్రసవానికి సమయం పడుతుందని చెప్పినా వినలేదని అన్నారు. రిమ్స్‌కు ఎందుకు రెఫర్ చేయలేదని ప్రశ్నించగా.. ఫోన్ కట్ చేశారు.