నెలలు నిండిన నిర్లక్ష్యం!
Published Tue, Dec 17 2013 4:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
నెలలు నిండిన ఆమెకు ప్రసవ వేదన కంటే.. సమయానికి వైద్యం అందలేదన్న వేదనే ఎక్కువైంది. ఎక్కడో మారుమూల పల్లె నుంచి కాన్పు కోసం మధ్యాహ్నమనగా వచ్చిన ఆమెకు సాయంత్రం వరకు ఈ వేదన తప్ప లేదు.అదే సమయంలో డ్యూటీలో ఉండాల్సిన వైద్యురాలు.. పేద రోగులను గాలికొదిలేసి తన సొంత క్లినిక్‌లో బిజీగా ఉండిపోయారు. ఇదేమిటని ప్రశ్నించిన ‘న్యూస్‌లైన్’పైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రుబాబు చూపారు. డ్యూటీని నిర్లక్ష్యం చేసిన వైద్యురాలిని మందలించాల్సిన డెరైక్టరూ ఆమెకే కొమ్ము కాస్తూ.. ‘మీరే దేశాన్ని ఉద్ధరించేస్తున్నారా’ అంటూ చిందులు తొక్కారు. ఆస్పత్రి సందర్శనకు వెళ్లినప్పుడు జరిగిన ఈ మొత్తం తతంగాన్ని మీరూ చదవండి..
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: పాలకొండ మండలం మల్లివీడు గ్రామానికి చెందిన పైల నాగమణి అనే గర్భిణీకి నెలలు నిండాయి. నొప్పులు మొదలవడంతో కుటుంబ సభ్యులు ఆమెను సోమవారం ఉదయం 9.30 ప్రాంతంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. దానికి ముందు అనస్థీషియా ఇవ్వాల్సిన వైద్యుడు లేరని, ఆయన వచ్చేసరికి సాయంత్రం అవుతుందని అంటూ శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఆ మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగమణిని రిమ్స్‌కు తీసుకొచ్చారు. అక్కడి వైద్య సిబ్బంది ఆమెను నామమాత్రంగా పరీక్షించి, వైద్యులు వచ్చి చూస్తారని చెప్పి ఊరుకున్నారు. కనీసం పడక కూడా కేటాయించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే నొప్పులు ఎక్కువ కావడంతో నాగమణి నరకయాతన పడింది. వైద్యులను వెంటనే పిలిపించాలని ఆమె బంధువులు ఎంత వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. సాయంత్రం వరకు వైద్యులు వచ్చి ఆమెను చూసిన పాపాన కూడా పోలేదు.
బంధువుల ఆందోళన
సాయంత్రం ఆరు గంటల సమయంలో ‘న్యూస్‌లైన్’ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసింది. దాంతో గైనిక్ వార్డుకు వెళ్లి విషయమేమిటని బాధితురాలి భర్త సత్యంనాయుడిని ఆరా తీయగా.. ఉదయం నుంచి గూడు కట్టుకున్న ఆందోళన, ఆవేదనను వెళ్లగక్కారు. జరిగిన విషయమంతా వివరించారు. దీంతో ‘న్యూస్‌లైన్’ చొరవ తీసుకొని వైద్యుల గురించి అక్కడున్న సిబ్బందిని ఆరా తీసింది. డ్యూటీ డాక్టర్ పార్వతి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారని, రెండు కేసులు చూసి ఇప్పుడే బయటకు వెళ్లారని, కొద్దిసేపట్లో వచ్చేస్తారని వారు చెప్పారు. వైద్యురాలు పార్వతిని ఫోనులో సంప్రదించగా టీ కోసం బయటకు వెళ్లాను.. 8 గంటలకు వస్తానని’ బదులిచ్చారు. ఇదేమిటి డ్యూటీ సమయంలో బయటకు వెళ్లడమే కాకుండా.. 8 గంటలకు వస్తాననటం సమంజసమా అని ప్రశ్నించగా ‘ఇంత వరకు నేను డ్యూటీలోనే ఉన్నాను.. ఇప్పుడే బయటకు వస్తే నన్ను ప్రశ్నిస్తారేంటి? మీపై రిమ్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను’ అంటూ దబాయించారు. దాంతో ‘న్యూస్‌లైన్’ రిమ్స్ సూపరింటెండెంట్ అరవింద్‌కు ఫోన్ చేయగా ఆమె ఎక్కడికో బయటకు వెళ్లారని, తాను వచ్చి కేసు చూస్తానని చెప్పి కొద్ది సేపట్లో ఆస్పత్రికి వచ్చారు.
సొంత క్లినిక్‌లో వైద్యురాలు
కాగా డాక్టర్ పార్వతి ఎక్కడున్నారని మరికొందరిని ఆరా తీయగా ఆ సమయంలో ఆమె తన సొంత క్లినిక్‌లో ఉన్నట్టు తెలిసింది. క్లినిక్ వద్దకు వెళ్లి చూడగా అది నిజమేనని తేలింది. సాయంత్రం 6.18 గంటల సమయంలో ఆమె క్లీనిక్‌లో ఉన్న దృశ్యాన్ని ‘న్యూస్‌లైన్’ చిత్రీకరించింది. దీన్ని గమనించిన ఆమె వెంటనే రిమ్స్‌కు పరుగులు తీశారు. అయితే ఆమె కన్నా ముందే అక్కడికి చేరుకొని గైనిక్ విభాగం వద్ద మాటు వేసిన ‘న్యూస్‌లైన్’ను గమనించిన వైద్యురాలు గైనిక్ విభాగంలోకి వస్తూ వెంటనే వెనుదిరిగి పక్కనే ఉన్న డెరైక్టర్ క్వార్టర్స్‌లోకి వెళ్లిపోయారు. తిరిగి 6.50 గంటలకు ఆస్పత్రి డెరైక్టర్ జయరాజ్‌తో కలిసి గైనిక్ విభాగానికి వచ్చారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న సూపరింటెండెంట్ అరవింద్ గర్భిణి నాగమణికి వైద్యసేవలు అందించారు.
మీరేమైనా దేశోద్ధారకులా..?!
మీరే దేశాన్ని ఉద్ధరిస్తున్నారా?.. మేం ఏమీ చేయటం లేదా.. మీరే నీతిమంతులు.. మేమంతా తప్పులు చేసేవారమా?? అంటూ రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ ‘న్యూస్‌లైన్’పై చిందులు వేశారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యురాలు ప్రైవేటు క్లినిక్‌లో సేవలందించటంపై వివరణ కోరినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. ఏమైనా ఉంటే తాము విచారణ జరిపిస్తామని.. ఇలా ఆస్పత్రిలోకి వచ్చి కెమెరాతో చిత్రీకరించవద్దని అన్నారు. జరిగిన దాని గురించి మాట్లాడక పోగా ‘మీరు మాకు చెప్పక్కర్లేదు.. ఏం చేయాలో తెలుసు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
కనీసం పట్టించుకోలేదు
వైద్యులు మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శస్త్రచికిత్స అవసరమవుతుందని పాలకొండలో చెప్పడం వల్లే ఇక్కడికి తీసుకువచ్చాం. మీడియా వచ్చిన తర్వాతే వైద్యులు వచ్చి నా భార్యను లోపలకు తీసుకువెళ్లి వైద్యసేవలందించారు.
-పి.సత్యంనాయుడు, బాధితురాలి భర్త
ఉదయం నుంచి బాధ పడుతున్నారు
ఉదయం వచ్చినప్పటి నుంచి వారు బాధపడుతున్నారు. ఎవరూ పట్టిం చుకోలేదు. పాపం ఆ అమ్మాయి నొప్పులంటూ ఎంత ఎడుస్తున్నా వైద్యురాలు రాలేదు. రిమ్స్‌లో పరి స్థితి మరీ ఇంత దారుణంగా ఉండ టం చూస్తే భయమేస్తోంది.
-పసుపురెడ్డి సుశీల, తోటి రోగి బంధువు
Advertisement
Advertisement