సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుడి శరీరభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన క్షత్రగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ మీదుగా ఉట్నూరుకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ప్రయాణిస్తున్నారు. అయితే ఉట్నూర్ ఎక్స్ రోడ్ దగ్గర గల పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే బైక్ నుంచి ఒక్క సారిగా పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అంతేకాకుండా ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పేలిన బాంబుతో పాటు బైక్‌లో మరో బాంబు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా పేలుడు సంభవించడానికి గల కారణం నాటు బాంబు లేక గనుల్లో వాడే జిలితెన్ స్టిక్స్ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment