
సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూర్ మండల కేంద్రంలోని రామమందిరంలో దసరా పర్వదినం రోజు రావణుడి బొమ్మను దహనం చేయకూడదంటూ ఆదివాసులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ఉట్నూర్ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం హిందూ ఉత్సవ సమితి, గోండు ధరమ్ సభ్యులతో శాంతి చర్చలు జరిపారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా దసర పండుగ ఉత్సవాలు నిర్వహించుకోవాలని, అందుకు ఇరువర్గాల సహకారం అవసరమని అధికారులు సూచించారు. దీంతో ఇరువర్గాల ఆందోళనకారులు శాంతించి తమ అంగీకారం తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ డేవిడ్, ఆర్డీఓ వినోద్ కుమార్, హిందూ ఉత్సవ సమితి, గోండు ధరమ్ సభ్యులు హాజరైనారు.