చెరువు వద్ద ఫైరింజన్‌లో నీటిని నింపుతోన్న సిబ్బంది
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ఉట్నూర్ అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా ఆస్తులు బుగ్గిపాలు కావాల్సిందే. అలాగని అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యమో.. పట్టింపులేని ధోరణి అనుకుంటే పొరపాటే. మంటలు ఆర్పడానికి అవసరమైన నీటి సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్య. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం వస్తే చాలు ఫైరింజన్ తీసుకుని నీటి కోసం చెరువు బాట పట్టాల్సిందే. నీటి సమస్య ఒక్కటే కాదు.. అగ్నిమాపక కేంద్రానికి సొంత భవనం లేక, సిబ్బందికి మౌలిక వసతులు కరువై ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రెండు సార్లు నిధులు విడుదల చేసినా స్థల సమస్య కారణంగా వెనక్కి వెళ్లాయి.
చెరువే దిక్కు..
అగ్నిమాపక కేంద్రం ఉన్న ప్రాంతంలో ఎలాంటి నీటి వసతులు లేవు. దీంతో ఎక్కడైన ప్రమాదం జరిగిందనే సమాచారం రాగానే నీటి కోసం వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మంటలు ఆర్పడానికి వెళ్లే క్రమంలో ఫైరింజన్ తిరుగు ప్రయాణంలో చెరువు కనిపిస్తే నీటిని నింపాల్సిన దుస్థితి నెలకుంటోంది. 4500 లీటర్ల సామర్థ్యం గల ఫైరింజన్‌లో నీటిని నింపడానికి సిబ్బంది పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలో సిబ్బంది గాయాల పాలైన సంఘటనలూ ఉన్నాయి. చెరువు నీరు ఫైరింజన్‌లో నింపే క్రమంలో బురద రాకుండా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్యాలయం వద్ద ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన రహదారి వెంట చేతిపంపు నీటితో అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. కేంద్రంలో కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలల ఉపయోగం కోసం కూడా నీటి సౌకర్యం లేదు.
అగ్నిమాపక సిబ్బంది తిప్పలు
సొంత భవనం లేక తిప్పలు..
సమస్యాత్మక మండలాలైన ఉట్నూర్, నార్నూర్, జైనూ ర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు) మండలాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం 2004లో ఏజెన్సీ కేంద్రంగా కుమురం భీం ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కేంద్రాన్ని ఎంపీడీవో కార్యాలయం అధీనంలోని క్వార్టర్స్‌కు మార్చింది. నాటి నుంచి ఐదు మండలాల్లో ఎక్కడ ఏ అగ్నిప్రమా దం జరిగినా ఇక్కడి నుంచి ఫైరింజన్ వెళ్లాల్సిందే. తర్వాత కాలంలో సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది.
ఆ స్థలం కోర్టు కేసులో ఉండడంతో అగ్నిమాపక కేంద్రం నిర్మా ణం మరుగునపడింది. క్వార్టర్ శిథిలావస్థకు చేరిందని, అది వెంటనే ఖాళీ చేయాలని ఐదేళ్లుగా ఎంపీడీవో కార్యాలయం నోటీసులు జారీ చేస్తూనే ఉంది. మరోమార్గం లేక కార్యాలయం అందులోనే కొనసాగిస్తున్నారు.
ఫైర్ సామగ్రి భద్రపర్చడం, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పూర్తి స్థాయి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై కప్పు సరిగా లేక కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో వర్షం వస్తే ఉరువకుండా ఉండడానికి కవర్లు కప్పారు.
నిధులు మంజూరు అవుతున్నా..
అగ్నిమాపక కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ.35లక్షలు విడుదల చేసింది. గతంలో ఎంపీడీవో కార్యాలయ మైదానంలో కేటాయించిన స్థలం కోర్టు కేసులో ఉండడం, ఇతర చోట్ల స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు విఫలం కావడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. అదీగాక 2015–16 ఆర్థిక సంవత్సరంలో మరోసారి ప్రభుత్వం రూ.70 లక్షలు అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి మంజూరు చేసింది. స్థల సేకరణలో భాగంగా ఉట్నూర్ ఆర్డీవో మండల కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో ఎకరం స్థలం గుర్తించారు.
ఆ స్థలాన్ని అగ్నిమాపక కేంద్రానికి కేటాయించాలని ఫిబ్రవరి 2015లో కలెక్టర్‌కు అధికారులు నివేదించారు. ఐబీ ప్రాంతంలో ఉన్న స్థలం ఆర్‌అండ్‌బీ శాఖకు చెందినదని, ఆ స్థల కేటాయింపు కలెక్టర్ పరిధిలో ఉండదని తేలడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో మంజూరైన రూ.70లక్షలు మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి స్థలం ఎక్కడన్నది తేలకపోవడంతో బోర్‌వెల్స్ వేయడం, ట్యాంకుల నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరైనా ఖర్చు చేయలేని స్థితిలో కేంద్రం అధికారులు ఉన్నారు. వేసవి కాలం కావడంతో అగ్నిమాపక అధికారుల తిప్పలు నిత్యకృత్యం కానున్నాయి.
స్థలం లేక నిధులు వెనక్కి..
ఇప్పటికి అగ్నిమాపక కార్యాలయం నిర్మాణానికి రెండుసార్లు నిధులు మంజురైనా స్థలం లేక వెనక్కి వెళ్తున్నాయి. ఫైరింజన్‌కు కావాల్సిన నీటి కోసం ప్రతి సారి ఎక్కడ నీటి వనరులు ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే. నూతన కేంద్రం నిర్మాణానికి ఇటీవల ఐబీ ప్రాంతంలో ఆర్డీవోతో కలిసి ఎకరం స్థలం గుర్తించినా ఫలితం లేకుండాపోయింది. ఎక్కడైనా ఎకరం స్థలం లభిస్తే నూతన భవన నిర్మాణానికి అవకాశం ఉంది. నీటి సమస్య పరిష్కారానికి రూ.10 లక్షలు మంజూరైనా సొంత భవనం లేక ఖర్చు చేయలేకపోతున్నాం.
– టి.పరమేశ్వర్, అగ్నిమాపక అధికారి ఉట్నూర్
Comments
Please login to add a commentAdd a comment