Own building
-
జాగా.. ఎక్కడా..!
సాక్షి, నర్సాపూర్ : మండల కేంద్రమైన శివ్వంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని ఉన్నత పాఠశాల భవనంలో ప్రస్తుతం కాలేజీ కొనసాగుతుండడంతో అందులో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఫీజు రాయితీ పథకాన్ని సైతం అమలు చేస్తున్నా మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల చేరిక పడిపోతుంది. 2008లో శివ్వంపేటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది. ఎనిమిదేళ్లపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో కాలేజీ కొనసాగింది. ఆ భవనం సైతం శిథిలావస్థకు చేరడంతో భవనాన్ని ఖాళీచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి శివ్వంపేటలోని ఓ అద్దెభవనంలో కాలేజీ నిర్వహించారు. నెలవారి అద్దె చెల్లించకపోవడంతో ఆ భవనం సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల భవనంలో.. ప్రస్తుతం కాలేజీని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతుంది. కేవలం నాలుగు గదులు మాత్రమే కేటాయించడంతో విద్యార్థులకు సరిపోని పరిస్థితి నెలకొంది. సరిపడా గదులు లేకపోవడంతో పాటు విద్యార్థుల ప్రాక్టికల్స్ చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత భవనం లేకపోవడంతోనే విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వెనుకడుగు వేస్తున్నారు. శివ్వంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు అనుకూలంగా కాలేజీ ఉన్నా సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులను కళాశాలలో బోధిస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో 55 మంది విద్యార్థులు ఉండగా మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. స్థానికంగా వసతులు లేకపోవడంతో విద్యార్థులు తూప్రాన్, నర్సాపూర్ ప్రాంతాల్లోని ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2018–2019 విద్యా సంవత్సరానికి సంబంధించి 544 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. శివ్వంపేట, చెండి, చిన్నగొట్టిముక్కల్ల, దొంతి గ్రామాలకు సంబంధించి ఇంటర్ చదివేందుకు శివ్వంపేట కాలేజీ అనుకూలంగా ఉంటుంది. ఆయా పాఠశాలల్లో 200 మంది విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులు మాత్రమే శివ్వంపేట ప్రభుత్వ కాలేజీలో పేర్లు నమోదు చేసుకున్నారు. స్థలం లేక వృథాగా నిధులు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంతభవనం నిర్మాణానికి 8 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం 40లక్షల నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు జరగకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. 6 సంవత్సరాల క్రితం మరోమారు నాబార్డు నుంచి ఆధునిక జూనియర్ కళాశాల భవననిర్మాణానికి 10కోట్లు మంజూరయ్యాయి. నిధులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ భూమి కేటాయింపు చేపట్టకపోవడంతో ఆ నిధులు సైతం వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. భవన నిర్మాణానికి భూమిని కేటాయిస్తే అన్ని హంగులతో విద్యార్థులకు పూర్తి వసతులతో భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. భూమి కేటాయించకపోవడంతో కాలేజీ భవన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కాలేజీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని పలుమార్లు అప్పటి మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలేజీ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. -
చల్లార్చేదెలా?
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ఉట్నూర్ అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా ఆస్తులు బుగ్గిపాలు కావాల్సిందే. అలాగని అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యమో.. పట్టింపులేని ధోరణి అనుకుంటే పొరపాటే. మంటలు ఆర్పడానికి అవసరమైన నీటి సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్య. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం వస్తే చాలు ఫైరింజన్ తీసుకుని నీటి కోసం చెరువు బాట పట్టాల్సిందే. నీటి సమస్య ఒక్కటే కాదు.. అగ్నిమాపక కేంద్రానికి సొంత భవనం లేక, సిబ్బందికి మౌలిక వసతులు కరువై ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రెండు సార్లు నిధులు విడుదల చేసినా స్థల సమస్య కారణంగా వెనక్కి వెళ్లాయి. చెరువే దిక్కు.. అగ్నిమాపక కేంద్రం ఉన్న ప్రాంతంలో ఎలాంటి నీటి వసతులు లేవు. దీంతో ఎక్కడైన ప్రమాదం జరిగిందనే సమాచారం రాగానే నీటి కోసం వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మంటలు ఆర్పడానికి వెళ్లే క్రమంలో ఫైరింజన్ తిరుగు ప్రయాణంలో చెరువు కనిపిస్తే నీటిని నింపాల్సిన దుస్థితి నెలకుంటోంది. 4500 లీటర్ల సామర్థ్యం గల ఫైరింజన్లో నీటిని నింపడానికి సిబ్బంది పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలో సిబ్బంది గాయాల పాలైన సంఘటనలూ ఉన్నాయి. చెరువు నీరు ఫైరింజన్లో నింపే క్రమంలో బురద రాకుండా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్యాలయం వద్ద ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాన రహదారి వెంట చేతిపంపు నీటితో అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. కేంద్రంలో కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలల ఉపయోగం కోసం కూడా నీటి సౌకర్యం లేదు. అగ్నిమాపక సిబ్బంది తిప్పలు సొంత భవనం లేక తిప్పలు.. సమస్యాత్మక మండలాలైన ఉట్నూర్, నార్నూర్, జైనూ ర్, ఇంద్రవెల్లి, సిర్పూర్(యు) మండలాల్లో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం 2004లో ఏజెన్సీ కేంద్రంగా కుమురం భీం ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కేంద్రాన్ని ఎంపీడీవో కార్యాలయం అధీనంలోని క్వార్టర్స్‌కు మార్చింది. నాటి నుంచి ఐదు మండలాల్లో ఎక్కడ ఏ అగ్నిప్రమా దం జరిగినా ఇక్కడి నుంచి ఫైరింజన్ వెళ్లాల్సిందే. తర్వాత కాలంలో సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలం కోర్టు కేసులో ఉండడంతో అగ్నిమాపక కేంద్రం నిర్మా ణం మరుగునపడింది. క్వార్టర్ శిథిలావస్థకు చేరిందని, అది వెంటనే ఖాళీ చేయాలని ఐదేళ్లుగా ఎంపీడీవో కార్యాలయం నోటీసులు జారీ చేస్తూనే ఉంది. మరోమార్గం లేక కార్యాలయం అందులోనే కొనసాగిస్తున్నారు. ఫైర్ సామగ్రి భద్రపర్చడం, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పూర్తి స్థాయి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై కప్పు సరిగా లేక కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో వర్షం వస్తే ఉరువకుండా ఉండడానికి కవర్లు కప్పారు. నిధులు మంజూరు అవుతున్నా.. అగ్నిమాపక కేంద్రం నిర్మాణం కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ.35లక్షలు విడుదల చేసింది. గతంలో ఎంపీడీవో కార్యాలయ మైదానంలో కేటాయించిన స్థలం కోర్టు కేసులో ఉండడం, ఇతర చోట్ల స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు విఫలం కావడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. అదీగాక 2015–16 ఆర్థిక సంవత్సరంలో మరోసారి ప్రభుత్వం రూ.70 లక్షలు అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి మంజూరు చేసింది. స్థల సేకరణలో భాగంగా ఉట్నూర్ ఆర్డీవో మండల కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో ఎకరం స్థలం గుర్తించారు. ఆ స్థలాన్ని అగ్నిమాపక కేంద్రానికి కేటాయించాలని ఫిబ్రవరి 2015లో కలెక్టర్‌కు అధికారులు నివేదించారు. ఐబీ ప్రాంతంలో ఉన్న స్థలం ఆర్అండ్బీ శాఖకు చెందినదని, ఆ స్థల కేటాయింపు కలెక్టర్ పరిధిలో ఉండదని తేలడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో మంజూరైన రూ.70లక్షలు మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అగ్నిమాపక కార్యాలయ నిర్మాణానికి స్థలం ఎక్కడన్నది తేలకపోవడంతో బోర్‌వెల్స్ వేయడం, ట్యాంకుల నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరైనా ఖర్చు చేయలేని స్థితిలో కేంద్రం అధికారులు ఉన్నారు. వేసవి కాలం కావడంతో అగ్నిమాపక అధికారుల తిప్పలు నిత్యకృత్యం కానున్నాయి. స్థలం లేక నిధులు వెనక్కి.. ఇప్పటికి అగ్నిమాపక కార్యాలయం నిర్మాణానికి రెండుసార్లు నిధులు మంజురైనా స్థలం లేక వెనక్కి వెళ్తున్నాయి. ఫైరింజన్‌కు కావాల్సిన నీటి కోసం ప్రతి సారి ఎక్కడ నీటి వనరులు ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే. నూతన కేంద్రం నిర్మాణానికి ఇటీవల ఐబీ ప్రాంతంలో ఆర్డీవోతో కలిసి ఎకరం స్థలం గుర్తించినా ఫలితం లేకుండాపోయింది. ఎక్కడైనా ఎకరం స్థలం లభిస్తే నూతన భవన నిర్మాణానికి అవకాశం ఉంది. నీటి సమస్య పరిష్కారానికి రూ.10 లక్షలు మంజూరైనా సొంత భవనం లేక ఖర్చు చేయలేకపోతున్నాం. – టి.పరమేశ్వర్, అగ్నిమాపక అధికారి ఉట్నూర్ -
ఈ పోలీసుస్టేషన్‌కు సొంత భవనమేదీ?
అద్దె భవనంలోనే కొత్తపేట పీఎస్ స్థల పరిశీలన అయినా కార్యరూపం దాల్చని వైనం చిట్టినగర్ : కొత్తపేట పోలీస్ స్టేషన్ సొంత భవనం కల ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్టేషన్‌కు సొంత భవనం నిమిత్తం పలు దఫాలుగా స్థల పరిశీలన జరిగినా ఇంత వరకు స్టేషన్ నిర్మాణం కార్యాచరణలోకి రాకపోవడంతో అద్దె భవనంలోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నగరంలోని అత్యధిక కేసులు నమోదయ్యే స్టేషన్ల క్రమంలో కొత్తపేట పీఎస్‌కు ఏళ్ల తరబడి రికార్డు ఉంది. అయితే గతంలో కేసుల సంఖ్య, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే ప్రభుత్వం అద్దె భవనాలలో ఉన్న పీఎస్‌లకు సొంత భవనాలను నిర్మించి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తపేట స్టేషన్ పరిధి రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉండటంతోపాటు జక్కంపూడి వైఎస్సార్ కాలనీ నిర్మాణం, నగరంలోని పలు ప్రాంతాల నుంచి పేదలను కాలనీకి తరలించడంతో కాలనీలో పోలీస్‌స్టేషన్ నిర్మాణం తథ్యమని పోలీసులు భావించారు. పలు దఫాలుగా స్థల పరిశీలన వైఎస్సార్ కాలనీతోపాటు పాలప్రాజెక్టు క్వార్టర్స్ స్థలాన్ని స్టేషన్ నిర్మాణం కోసం పోలీసు ఉన్నతాధికారులు స్థల పరిశీలన చేసినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. రెండేళ్ల కిందట అప్పటి పోలీసు శాఖ కార్యదర్శి డీపీ దాస్, అప్పటి నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్‌తోపాటు పలువురు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో కాలనీలో పీఎస్ భవన నిర్మాణానికి అవసర మైన స్థలాన్ని ఇచ్చేందకు కార్పొరేషన్ ముందుకు రాగా ప్రస్తుతం భవన నిర్మాణానికి 750 గజాల స్థలం అవసరం ఉంది. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు భవన నిర్మాణ తధ్యమని భావించారు. అయితే గతంలో నిధులు విడుదల కాగా స్థలాన్ని గుర్తించడంలో ఆలస్యం కావడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. ఈ దఫా స్థల పరిశీలన అయినా భవన నిర్మాణం మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. దశాబ్దాలుగా.. ప్రస్తుతం కొత్తపేట వాగు సెంటర్లోని ఓ అద్దె భవనంలో పోలీస్ స్టేషన్‌ను నిర్వహిస్తుండగా నిర్వహణ కింద భారీగానే ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి క్రైం విభాగం ఎత్తి వేసినప్పటికీ ఎస్.ఐలు అందరూ ఒకే గదిలో కేసులను విచారిస్తుండటంతో వాటి పురోగతిపై ఏ మేరకు ముందుకు సాగుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.