ఉట్నూర్ రూరల్, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలు కావడం లేదు. కవర్లు వాడకూడదంటూ అప్పుడప్పుడు హడావుడిగా ప్రచారం చేసే అధికారులు తరువాత పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గకుండా పోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే వీటి ప్రభావం పర్యావరణంపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.
ఇదీ పరిస్థితి
దాదాపు ప్రతి చోట ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. ఏ చిన్న వస్తువు కొన్నా కవర్‌లో పెట్టి ఇవ్వండి అంటూ చెబుతున్న మాటలే వీటికి నిదర్శనం. ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎక్కువగా వాడితే అనారోగ్యాలతో పాటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తరచూ వైద్యులు హెచ్చరిస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ప్లాస్టిక్ ఉత్పత్తులు వేల సంవత్సరాలు భూమి పొరల్లో ఉండిపోవడంతో పాటు కరగక పోవడంతో భవిష్యత్తులో విపత్కరమైన పరిస్థితులు మానవాళి ఎదుర్కోబోతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూ వస్తున్నారు.
అదేవిధంగా ప్లాస్టిక్ కాల్చడం ద్వారా దాని నుంచి విషపూరిత వాయువు వెలువడి ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. టీ, జ్యూస్ ఇతర ఆహార పదార్థాల ప్లేట్లు, గ్లాసులో పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కారణంగా పశువులకు సైతం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. జీర్ణకోశ వ్యాధులతో పశువులు వ్యాధి బారిన పడి మరణించిన సంఘటనలు సైతం విపరీతంగాపెరిగిపోతున్నాయి.
చర్యలు తీసుకుంటేనే...
ప్లాస్టిక్ వాడకాన్ని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిషేధిస్తున్నట్లు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న కవర్లను మాత్రమే వాడాలని హెచ్చరిస్తోంది. దీనికి తోడు కాటన్, జనపనారలతో తయారు చేసే ఉత్పత్తులకు రాయితీ సౌకర్యం ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం అధికారులు ప్లాస్టిక్ సమస్యను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే ప్లాస్టిక్ భూతం నుంచి మానవాళి తనను తాను రక్షించుకోగలుగుతుంది.
తగ్గని ప్లాస్టిక్ వాడకం
Published Wed, May 14 2014 2:02 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM
Advertisement