సాక్షి, అమరావతి: ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ సంచుల తయారీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా 120 మైక్రాన్లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆదేశాలు డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగ్‌లు తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటారు.
ఇప్పటివరకు 75 మైక్రాన్ల మందం గల క్యారీ బ్యాగులను వినియోగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇకపై పునర్ వినియోగానికి అవకాశమున్న 120 మైక్రాన్ల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలతో పాటు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల అమలు, పర్యవేక్షణను వార్డు శానిటేషన్ కార్యదర్శులు చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
దీంతో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. కాగా, వీధుల్లో ఏర్పాటు చేసే ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధం కూడా ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. నిబంధనల అమలును తనిఖీ చేసేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్ విభాగాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో తనిఖీలు చేయనున్నాయి.
ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment