Carry Bags
-
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లకు చెక్.. అమల్లోకి నిషేధం
సాక్షి, అమరావతి: ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ సంచుల తయారీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా 120 మైక్రాన్లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆదేశాలు డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగ్‌లు తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు 75 మైక్రాన్ల మందం గల క్యారీ బ్యాగులను వినియోగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇకపై పునర్ వినియోగానికి అవకాశమున్న 120 మైక్రాన్ల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలతో పాటు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల అమలు, పర్యవేక్షణను వార్డు శానిటేషన్ కార్యదర్శులు చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. కాగా, వీధుల్లో ఏర్పాటు చేసే ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధం కూడా ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. నిబంధనల అమలును తనిఖీ చేసేందుకు ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ విభాగాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో తనిఖీలు చేయనున్నాయి. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
ప్లాస్టిక్‌పై మరో సమరం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై పురపాలక శాఖ యుద్ధం ప్రకటించింది. 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు, వినియోగంపై గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో నిషేధాన్ని విధించింది. ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ నిషేధం అమలుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. వచ్చే ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం విధించనుంది. నిషేధం అమల్లోభాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు గడువులను ప్రకటిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికలు కూడా నోటిఫికేషన్ జారీ చేశాయి. ఇప్పటివరకు 50 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం ఉంది. గత సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్లలోపు, వచ్చే ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, పోలీసు కానిస్టేబుల్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అన్ని పురపాలికల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 22 నుంచి వారంపాటు దాడులు జరిపి నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై జరిమానా విధించనుంది. 25 నుంచి నెలకోసారి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పెద్ద సముదాయాలపై దాడులు నిర్వహించనుంది. ఆలోగా నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక చెత్త వేస్తే జరిమానా పురపాలికల్లోని వాణిజ్య ప్రాంతాలను ఈనెల 31 నుంచి చెత్తరహిత ప్రాంతాలుగా పురపాలికలు ప్రకటించనున్నాయి. ఆ తర్వాత వాణిజ్య ప్రాంతాల్లోని రోడ్లపై చెత్తను పడేసే వారిపై జరిమానా విధించనున్నాయి. రోజుకు 100 కిలోలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, కూరగాయాల మార్కెట్లు ఇకపై ఆన్సైట్ కంపోస్టింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో నవంబర్ 10 నుంచి జరిమానా విధించనున్నారు. కాలనీలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్లు సైతం విధిగా తడి, పొడి చెత్తను వేరుగా నిర్వహించాలి. ఆన్సైట్లో కంపోస్టింగ్ చేపట్టని పక్షంలో నవంబర్ 28 నుంచి వీటిపై సైతం జరిమానా విధించనున్నారు. నవంబర్ 28 నుంచి గుర్తించిన కాలనీలను చెత్తరహిత ప్రాంతాలుగా ప్రకటించి, చెత్త పడేసే వారిపై జరిమానా వడ్డించనున్నారు. -
ఎక్కువగా ఏడిస్తే కళ్ల కింద క్యారీ బ్యాగులే..
పెరి ఆర్బిటల్ పఫ్ఫినెస్.. అంటే చటుక్కున అర్థం కాదు. కానీ కళ్ల కింద క్యారీ బ్యాగులనగానే వెంటనే తెలిసిపోతుంది. కళ్ల చుట్టూ ఉండే కండరాల్లో (ఆర్బిట్స్ అంటారు)వచ్చే వాపును శాస్త్రీయంగా పెరి ఆర్బిటల్ పఫ్ఫినెస్ అని, ఈ టిష్యూలో ఫ్లూయిడ్స్ పేరుకుపోవడం వల్ల వచ్చే వాపును పెరి ఆర్బిటాల్ ఎడిమా అనీ అంటారు. వయసు వచ్చే కొద్దీ కంటి దిగువ పెరిగే కొవ్వు కారణంగా ఏర్పడే సమస్యని సబ్ఆర్బిక్యులారిస్ ఆక్యులి ఫ్యాట్ అంటారు. ఈ సమస్య చిన్నపెద్దా తేడా లేకుండా అందరిలో కనిపిస్తుంది. కామన్ గా వీటిని ఐబ్యాగ్స్ అంటారు. చిన్నవయసువారి లో కనిపించే బ్యాగ్స్ కొంత జాగ్రత్త తీసుకుంటే కనిపించకుండా పోతాయి. పెద్దవారిలో వచ్చేవి ఎంత యత్నించినా కొన్నిసార్లు దాచలేము. ఇవి పెద్దగా సీరియస్ కండిషన్ కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే కొన్నిమార్లు ఇబ్బందులు పెరుగుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు వీటి నివారణకు యత్నించడం మేలు. కారణాలనేకం : ఐబ్యాగ్స్ పేరుకుపోవడానికి కారణాలనేకం ఉన్నాయి. వయసు, తిండి, హార్మోన్స్, వ్యాధులు, మెడిసిన్స్ వాడకం, మానసిక స్థితి.. ఇలా అనేక అంశాలు క్యారీబ్యాగ్స్కు కారణమవుతుంటాయి. వయసు వయసు పెరిగేకొద్దీ కళ్ల కింద చర్మం పలచబడి వేలాడుతుంటుంది. ఈ ఖాళీల్లోకి ఫ్లూయిడ్స్ చేరుతుంటాయి. దీంతో ఇవి క్రమంగా విస్తరించి పర్మినెంట్‌గా ఉండిపోతాయి. వయసుతోపాటు టియర్గ్లాండ్స్ సరిగా పనిచేయక లూబ్రికేషన్స్ తేడాలు వచ్చి కళ్ల కింద వాపు వస్తుంది. ఏడుపు, నిద్రలేమి ఎక్కువగా ఏడ్చేవాళ్లకు కన్నీళ్లలో ఉండే సాల్ట్ కారణంగా ఐబ్యాగ్స్ వస్తుంటాయి. అదేవిధంగా కలత నిద్ర పోయేవారిలో కంటి లూబ్రికేషన్స్ లో వ్యత్యాసాలు వస్తాయి. ఇవి క్రమంగా కంటికింద బ్యాగులకు దారితీస్తుంటాయి. అలాగే రాత్రి పడుకొని పొద్దున లేచాక కంటి చుట్టూ ఫ్లూయిడ్ బాలెన్స్ సరిగా జరగక ఉబ్బుతుంటాయి. థైరాయిడ్ సమస్యలు థైరాయిడ్ సమస్యల కారణంగా శరీరద్రావకాల్లో మ్యూకోపాలీసాఖరైడ్స్ తదితర రసాయనాల ఫిల్టరేషన్ సరిగా జరగదు. దీంతో ఇవన్నీ కణజాలాల మధ్య ఖాళీల్లోకి ఆస్మాసిస్ ద్వారా ప్రవహించి పేరుకుపోతుంటాయి. వ్యాధులు పెరిఆర్బిటాల్ సెల్యులైటిస్, బ్లిఫారో కెలాసిస్, చాగస్ డిసీజ్, మోనో న్యూక్లియోసిస్ లాంటి కండీషన్ల కారణంగా కంటి చుట్టూ వలయాల్లో ఫ్యాట్ లేదా ఫ్లూయిడ్స్ నిల్వ చేరుతుంటాయి. ఇవి క్రమంగా ఐ పఫ్ఫీనెస్కు దారితీస్తాయి. కొన్ని రకాల అలెర్జీలు, చర్మవ్యాధులు కూడా ఇందుకు కారణమవుతుంటాయి. ఆహారం సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో పఫ్ఫీ ఐస్ వచ్చే అవకాశం అధికం. పొగాకు, ఆల్కహాల్ ఈ రెండూ వాడేవారు స్ట్రెస్, హార్మోన్స్ మార్పులు, అలసట, నిద్రలేమికి తొందరగా గురవుతారు. అందువల్ల వీరిలో ఈ ఐబ్యాగ్స్ కామన్‌గా వస్తాయి. ఏం చేయాలి? ఇది సాధారణ సమస్యేకానీ బయటకు కనిపించేందుకు ఇబ్బందిపెడుతుంది. కొందరిలో మాత్రం ఇది తీవ్ర సమస్యగా మారి సర్జరీ వరకు దారితీస్తుంది. క్యారీబ్యాగులు వచ్చి పోవడం వేరు, కంటి కింద పర్మినెంట్‌గా ఉండడం వేరు. ఇలా పర్మినెంట్‌గా ఈ బ్యాగ్స్ ఉండిపోతే మెడికల్ డిజార్డర్ ఏదో ఉందని డాక్టర్‌ను సంప్రదించాలి. సర్వసాధారణంగా వచ్చే వాపునకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ♦ ఆహారంలో ఉప్పు తగ్గించడం, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, ఏ, సీ, ఈ విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, అధికంగా నీరు తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు. ♦ నిద్రలో తల కింద కాస్త ఎత్తు ఉంచుకోవడం, కళ్లకు కోల్డ్ కంప్రెస్ ట్రీట్మెంట్(కళ్ల మీద, చుట్టూ ఐస్ రుద్దుకోవడం) ద్వారా ఫ్లూయిడ్ అసమతుల్యతను తాత్కాలికంగా సరిచేయవచ్చు. ♦ మందులు వాడాల్సివస్తే డాక్టర్ సలహా ప్రకారం కార్టికోస్టీరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, యాంటీ హిస్టమిన్స్, అడ్రినలిన్ లేదా ఎపినెఫ్రిన్ , యాంటిబయాటిక్స్ తదితరాలు వాడాలి. క్యారీ బ్యాగులు రాకుండా లేదా వచ్చినవి తగ్గించడానికి కొన్ని వంటింటి చిట్కాలు బాగా పనిచేస్తుంటాయి... ♦ ఉల్లిపాయని పిండి ఆ రసంలో కొద్దిగా ఉప్పు కలపండి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని క్యారీబ్యాగ్స్‌పై పూయాలి(కంటికి తగలనీయకండి, మండిపోతుంది). మరుసటి రోజు పొద్దున్నే చల్లటి నీటితో కడగండి. ఉల్లిపాయలో ఉండే కెమికల్స్ కళ్ల చుట్టూ కొవ్వు పేరుకుపోవటాన్ని ఆపుతాయి. ♦ కాటన్ బాల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి కంటి కింద అప్లై చేయండి. తీవ్రమైన ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ ఐబ్యాగ్స్ను, వాటి మచ్చలను తొలగిస్తుంది. శరీరంలో చెడు కొవ్వు స్థాయిలను తగ్గించడానికి గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగవచ్చు. ♦ ఆముదం నూనెలో ఉండే ’రిసినోఎలిక్ ఆసిడ్’ పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది. కాటన్ బాల్‌ను ఆముదంలో ముంచి ఐబ్యాగ్స్పై అద్దండి. మంచి రిజల్ట్స్ కోసం కొన్ని రోజులు దీన్ని కొనసాగించాలి. ♦ ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతులు నానబెట్టి, మరుసటిరోజు ఉదయం పరగడుపున(ఖాళీ కడుపుతో) తాగండి. మెంతులు బాడ్ కొలెస్ట్రాల్‌ను, పేరుకుపోయిన ఫ్యాట్‌ను తొలగిస్తాయి. ♦ వెల్లుల్లిని దంచి వచ్చే పేస్ట్‌ను ఐబ్యాగ్స్పై అప్లై చేయాలి. ఆవిధంగా అరగంట పాటుంచి చల్లటి నీళ్లతో కడగాలి. ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఎక్కువ సమయం ఈ పేస్ట్‌ను చర్మంపై ఉంచకండి. వెల్లుల్లిలో ఉండే ఎంజైమ్ ఫ్లూయిడ్స్ లో కొవ్వుల స్థాయిని తగ్గిస్తుంది. -
రోజంతా గోదావరి ఒడ్డున విజిల్ ఊదుతూ..
ఇష్టమైంది తిని, ఇష్టమొచ్చినట్లు బతికి, ఏదో ఒక రోజు వెళ్లిపోదాం అన్నట్లే ఉంటున్నారు మనుషులు. మంచి చెబితే అస్సలు సహించలేక పోతున్నారు. ‘మీరూ మనుషులే కదా, మీది మానవ జాతి కాదన్నట్లు మాకు మంచి చెబుతున్నారెందుకు?’ అన్నట్లే చూస్తున్నారు! ఇద్దరు చికాగో సిస్టర్స్ ఈమధ్య ఒక షూస్ స్టోర్ లో.. ‘మాస్క్ పెట్టుకోండమ్మా’ అని మంచి చెప్పిన సెక్యూరిటీ గార్డుని కసాబిసా 27 సార్లు కత్తితో పొడిచేశారు. ‘సాక్షి: టీవీ గరం గరం వార్తల్లో ఊరంతా తిరుగుతూ మొత్తుకుంటుండే ‘గోపి సర్’ గారి చిత్తూరు యాసలో చెప్పాలంటే ఆ కసాబిసా సిస్టర్స్‌లో ఒక పాపకు 21 ఏళ్లు, ఇంకొక పాపకు 18. గోపీ సర్ అందర్నీ ‘పాప’ అనే అంటాడు. వయసు చూసుకోబళ్ళా.. అది లేదు సర్ దగ్గర. ఆయనా అంతే. మంచి చెప్పబోయి ఈ నడుమ ఎవరితోనో అమాంతం పైకి లేపించుకున్నాడు. సర్ని కాలర్ పట్టి లేపి నేలకు కాళ్లందకుండా చేశాడు సర్ చేత మంచి చెప్పించుకున్న ఆ మనిషి. గోపీ సర్ లానే నాసిక్‌లో చంద్ర కిషోర్ పాటిల్ అనే ఒక మంచాయన ఒక రోజంతా గోదావరి నది బ్రిడ్జి మీద నిలబడి నదిలో చెత్త పారేయడానికి క్యారీ బ్యాగుల్ని మోసుకొచ్చేవాళ్లను అడ్డుకున్నాడు. (చదవండి: ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?!) చెత్త విసిరేయబోతుంటే పెద్దగా విజిల్ ఊదేవాడు. వాళ్లు వింతగా, విడ్డూరంగా చూసేవాళ్లు. ఇతడు వెళ్లి మంచి చెప్పేవాడు. నదిలోకి చెత్త విసరొద్దనే వాడు. విసిరితే నది కలుషితం అవుతుందని చెప్పేవాడు. విసిరిన చెత్తవల్ల ప్రవాహ వేగం తగ్గుతుందని దిగులుగా ముఖం పెట్టేవాడు. ‘నువ్వేమైనా మోదీవా? చెత్త గురించి స్పీచ్ ఇస్తున్నావ్’ అని వాళ్లు. ఎలాగో కన్విన్స్ చేసి బ్రిడ్జి పైనే ఓ పక్కకి చెత్త పెట్టించేవాడు.. నదిలోకి విసరకుండా. ఒక రోజంతా ఇలా గడిచింది. రెండో రోజు గోపీ సర్.. అదే.. చంద్ర కిశోర్ పాటిల్ సర్ కనిపించలేదు! ఏమైందో తెలీదు. తర్వాత ఒక రోజు ట్విట్టర్లో కనిపించాడు. ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ శ్వేత.. బ్రిడ్జి మీద ఉండగా ఎవరో తీసిన అతడి ఫొటోను టాగ్ చేస్తూ.. ‘ఇతడు రోజంతా గోదావరి బ్రిడ్జి పై విజిల్ ఊదుతూ నిలబడి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు’ అని ట్వీట్ చేశారు. ప్రజలకేమైనా పిచ్చా.. సాటి పౌరుడొకడు వచ్చి చెబితే చైతన్యవంతులు అవడానికి!! చంద్ర కిషోర్ పాటిల్ అనే ఆ మంచివాడు ఇప్పుడు ఏ నది ఒడ్డున ఉన్నాడో! నైస్ గై పాపం. -
నిద్రపోలేదు.. పనిచేస్తున్నా..
బంజారాహిల్స్: హోటళ్లలో క్యారీ బ్యాగ్‌లు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన సరిగ్గా అమలు కావడం లేదంటూ ఓ వ్యక్తి ట్విట్టర్లో పెట్టిన పోస్టుపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ స్పందించారు. బేగంపేట ప్యారడైజ్ రెస్టారెంట్ ‘ప్యాకింగ్ చార్జి’ పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తోందంటూ వినియోగదారుల కోర్టులో కేసు వేసిన సోషల్ యాక్టివిస్ట్ విజయ్‌గోపాల్.. విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. హోటల్లో దర్జాగా ప్యాకింగ్ చార్జిగా వసూలు చేస్తున్నా ఈవీడీఎం డైరెక్టర్ నిద్రపోతున్నారంటూ కామెంట్‌తో విశ్వజిత్‌ను ట్యాగ్ చేశారు. ‘మీ పనితీరును గౌరవిస్తున్నా. ఈ విషయాన్ని సంబంధిత విభాగానికి పంపించాను. ప్రక్రియ కొనసాగుతోంది’ అంటూ చెబుతూ తాను నిద్రపోవడం లేదని, పనిచేస్తున్నాని విశ్వజిత్ రీట్వీట్ చేశారు. -
క్యారీ బ్యాగ్‌కు రూ.5 వసూలు.. షాపింగ్ మాల్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: షాపింగ్‌మాల్స్ తమ సంస్థ లోగోతో ముద్రించిన క్యారీబ్యాగ్‌లను వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం ఆదేశించింది. షాపర్స్ స్టాప్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను రూ.5కు విక్రయించడంపై హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఉచితంగా ఇవ్వాలని, లేదంటే అది విక్రయించడం ద్వారా వినియోగదారుని డబ్బుతో సంస్థ ప్రచారం చేసుకోవడం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంస్థ లోగో ఉన్న బ్యాగులను ఉచితంగా ఇవ్వాలని గతంలో చండీగఢ్ వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. దీని ఆధారంగా అధికారులు షాపర్స్ స్టాప్‌కు నోటీసులు జారీ చేసి రూ.7 వేలు జరిమానా విధించారు. దుకాణదారులతో ఎటువంటి వివాదాలు తలెత్తినా, వినియోగదారులు అన్ని ప్రభుత్వ పనిదినాల్లోనూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వినియోగ వ్యవహారాల కమిషనర్ తెలిపారు. ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో నేరుగా లేదా 1800425 00333 టోల్‌ఫ్రీ నంబరుకు సంప్రదించి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. -
ప్లాస్టిక్‌పై స్పెషల్ డ్రైవ్
► పలు దుకాణాల్లో తనిఖీలు.. క్యారీబ్యాగులు సీజ్ ► ఇద్దరు వ్యాపారులకు రూ.5 వేల చొప్పున జరిమానా కోల్‌సిటీ : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధంపై సోమవారం శానిటేషన్ విభాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్థానిక లక్ష్మినగర్, మేదరిబస్తా, కళ్యాణ్‌నగర్, తిరుమల్‌నగర్ తదితర ప్రాంతాలలోని దుకాణాలను శానిటరీ ఇన్స్పెక్టర్లు పవన్‌కుమార్, రవీందర్‌తోపాటు సిబ్బంది ఆడేపు శ్రీనివాస్, ఈసూబ్, రాజు, సుగుణాకర్, తిరుపతి, మల్లేష్ తనిఖీలు నిర్వహించారు. లక్ష్మినగర్‌లోని జయశ్రీ కిరాణంలో లభించిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను సీజ్ చేసి, యజమాని రాజేందర్‌కు రూ.5వేల జరిమానా విధించా రు. తిరుమల్‌నగర్‌లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు విక్రరుుంచే మరో గోదాంలో ఉన్న బ్యాగులను సీజ్ చేశారు. దుకాణం యజమాని భాస్కర్‌కు రూ.5వేలు జరిమానా విధించారు. సీజ్ చేసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ క్యారీబ్యాగులను వినియోగించడం నిషేధమన్నారు. ప్లాస్టిక్ వస్తువులను విక్రరుుంచాలంటే ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యాపారస్తులు నెలనెలా లెసైన్‌స ఫీజు చెల్లించి రెన్యువల్ చేరుుంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ విక్రయాల నిషేధంపై నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే వ్యాపారస్తులందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు తీసుకున్న వ్యాపారస్తులు వాటిని ఉల్లంఘించి విక్రయాలు జరుపుతుండడంతో జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ విక్రయాలు నిలుపుదల చేయకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ప్లాస్టిక్ మహా సముద్రాలు
మనం కొన్ని నిమిషాలు వాడి పారేసే క్యారీ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? సుమారుగా వెయ్యి సంవత్సరాలు! భూమిపైనే కాదు.. సముద్రాల్లోనూ ప్లాస్టిక్ వేల ఏళ్లపాటు చెక్కుచెదరదు. అయితే, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇలాగే వదులుతూ పోతే.. భవిష్యత్తులో ఇక ప్లాస్టిక్ మహాసముద్రాలు అని పిలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2010 నాటి గణాంకాల ప్రకారమే.. ఏటా దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోంది. ఇదిలాగే సాగితే.. ఇక సముద్రాలన్నీ ప్లాస్టిక్‌మయమే! ఇటీవల ‘అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్’ సదస్సులో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా శాస్త్రవేత్త డాక్టర్ జెన్నా జాంబెక్ బృందం ఈ మేరకు తమ అధ్యయన వివరాలను వెల్లడించింది. వాటిలో కొన్ని ఆసక్తికర సంగతులు... సముద్ర ప్లాస్టిక్‌లో చైనా వదులుతున్న చెత్తే అధికం. మూడో వంతున అంటే.. ఏటా 35లక్షల మెట్రిక్‌టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా నుంచే సముద్రాన్ని చేరుతున్నాయి. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంక కూడా మొదటి వరుసలోనే ఉన్నాయి. మరో 20 వర్ధమాన దేశాలూ సముద్ర చెత్తకు కారణమవుతున్నాయి. సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల్లో అమెరికా వాటా 1 శాతమే కావడం విశేషం. ఏటా 77 వేల టన్నుల ప్లాస్టిక్‌ను వదులుతున్న ఆ దేశం 20వ స్థానంలో ఉంది. సముద్రాల్లోని ప్లాస్టిక్నంతా తీరప్రాంతాల్లో పరిస్తే.. ప్రతి అడుగు స్థలంలో ప్లాస్టిక్ చెత్తను నింపిన ఐదు క్యారీబ్యాగులను ఉంచాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోనే ఏటా ఒక్కో వ్యక్తి సగటున 150 క్యారీబ్యాగులను వాడి పారేస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే 2025 నాటికి ఏటా 15.5 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాలను ముంచెత్తుతుంది. అప్పుడు ప్రతి అడుగు తీరప్రాంతంలో వంద క్యారీబ్యాగులను పేర్చినంత చెత్త పోగవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు తిని సముద్రపక్షులు, చేపలు, తాబేళ్లు సహా 690 జాతులకు చెందిన లక్షలాది జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ తిన్న సముద్ర చేపల్ని తినడం వల్ల మనుషులూ అనారోగ్యం బారినపడుతున్నారు. చైనా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంకలే 50 శాతం సముద్ర ప్లాస్టిక్ చెత్తకు కారణమవుతున్నాయి. ఈ ఐదు దేశాలూ సరైన మౌలిక వసతులు ఏర్పాటుచేసుకుని, ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తే సమస్య మూడో వంతు వరకూ పరిష్కారమైపోతుంది. - సెంట్రల్ డెస్క్ -
ప్లాస్టిక్ నిషేధం పేరిట ఏటా రూ.4.32 కోట్ల దోపిడీ
దాదాపు ఐదేళ్లుగా ముషీరాబాద్ ‘స్పెన్సర్’లో సుబ్బారావు కుటుంబం సరుకులు కొనుగోలు చేస్తోంది. రెండేళ్ల క్రితం వరకు క్యారీబ్యాగులకు ఎలాంటి సొమ్ము చెల్లించేది కాదు. రెండేళ్ల నుంచి వెళ్లిన ప్రతిసారీ క్యారీబ్యాగులకూ సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. నెలకు మూడు నాలుగు పర్యాయాలు స్పెన్సర్‌కు వెళ్తున్న ఆ కుటుంబం తాము కొనుగోలు చేసే సరుకుల కోసం క్యారీబ్యాగుల సైజుల్ని బట్టి ఒక్కో పర్యాయం ఆరు నుంచి ఏడు రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఈ సమస్య ఎదుర్కొంటోంది సుబ్బారావు కుటుంబం మాత్రమే కాదండోయ్..! నగరంలో రోజూ సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సందర్శిస్తున్నవారందరిదీ. ఇలా నగరవాసి క్యారీ బాగుల కోసం ఏడాదికి వెచ్చిస్తున్న కనీస మొత్తం ఎంతో తెలుసా..! అక్షరాలా రూ.4.32 కోట్లు. దీని కారణం జీహెచ్ఎంసీ. - సాక్షి, సిటీబ్యూరో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ క్యారీబ్యాగుల్ని జీహెచ్ఎంసీ నిషేధించింది. 40 మైక్రాన్లు మించిన ప్లాస్టిక్ క్యారీబ్యాగులకు వాటి సైజును బట్టి ధరలు వసూలు చేయాలని సెలవిచ్చింది. దాంతో, పేరెన్నికగన్న దుకాణాలు క్యారీబ్యాగుల ధరల్ని ప్రజల సరుకుల బిల్లుల్లో వడ్డించడం మొదలు పెట్టాయి. (నిషేధానికి ముందు ఏ సైజు క్యారీబాగునైనా ఉచితంగానే అందజేసేవి.) ఇదే అంశాన్ని పలుమార్లు నగరవాసులు జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించి ఇంటినుంచి క్లాత్, జ్యూట్ బ్యాగులు తెచ్చుకునేవారికి సరుకుల బిల్లులో ఆ మేరకు తగ్గింపు నివ్వాలని జీహెచ్ఎంసీ దుకాణాల వారికి సూచించింది. ఎవరూ పట్టించుకోలేదు. గత నెల ఒకటి నుంచి క్లాత్ బ్యాగ్‌లు తీసుకువచ్చేవారికి ఈ రాయితీని కచ్చితంగా వర్తింపజేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. విక్రయదారులు పదిహేను రోజులు గడువుకోరారు. గడువు ముగిసి నేటికి దాదాపు నెల గడుస్తున్నా అమలు కావడం లేదు. ఈ రాయితీ సంగతి తెలిసిన వారు మాల్స్ నిర్వాహకుల్ని అడిగితే వారు స్పందించడం లేదు. క్యారీ బ్యాగుల పేరిట ప్రజల్ని దోచుకునేందుకు దుకాణదారులకి అనుమతినిచ్చిన ప్రభుత్వం ఇలాంటి రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం విశేషం. ఇదీ సంగతి: నగరంలో పెద్ద దుకాణాలెన్నో ఉన్నప్పటికీ, దాదాపు 200 సంస్థలు(షాపింగ్‌మాల్స్, ట్రేడ్సెంటర్స్, సూపర్మార్కెట్లు తదితరమైనవి) వినియోగదారులకు అందిస్తున్న 40 మైక్రాన్లు మించిన క్యారీబ్యాగులకు జనం నుంచి సొమ్ము వసూలు చేస్తున్నాయి. బ్యాగుల సైజుల్ని బట్టి రూ.1 నుంచి రూ. 5 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో షాప్ రోజుకు సగటున 300 క్యారీబ్యాగుల్ని విక్రయిస్తోంది. ఈ లెక్కన రోజుకు విక్రయించే క్యారీబ్యాగుల సంఖ్య 60,000. ఒక్కో క్యారీబ్యాగు సగటున రూ.2 అనుకున్నా రోజుకు రూ.1.2 లక్షలు. నెలకు రూ.36 లక్షలు.. సంవత్సరానికి రూ. 4.32 కోట్లు జనం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇది కనీస మొత్తం మాత్రమే. జీహెచ్ఎంసీ 50 వేల దుకాణాల నుంచి వసూలు చేస్తున్న ట్రేడ్ లెసైన్సు ఫీజు ఏటా రూ.16 కోట్లకు అటూ ఇటూగా ఉంటోంది. అంటే.. జీహెచ్ఎంసీ వసూలు చేస్తున్న ట్రేడ్ లెసైన్సుల ఫీజులో 25 శాతం సొమ్మును 200 దుకాణాలు జనం నుంచి క్యారీబ్యాగుల కోసం వసూలు చేస్తున్నాయన్నమాట. ఎందుకంత ప్రేమ.. ? క్యారీబ్యాగుల పేరిట జనం నెత్తిన టోపీ పెడుతూ సొమ్ము కాజేస్తున్న వ్యాపార సంస్థలు సదరు బ్యాగులపై తమ దుకాణం పేరును ప్రచారం చేసుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ చట్టం మేరకు.. సంస్థ పేరును ఏ రకంగా ప్రచారానికి వాడుకున్నా.. ప్రకటనల ఫీజు చెల్లించాలి. కానీ..వారు చెల్లించడం లేదు. జీహెచ్ఎంసీ వసూలు చేయడం లేదు. స్వచ్ఛందసంస్థలే నయం... ప్లాస్టిక్ నిషేధం.. క్లాత్, జ్యూట్బ్యాగులపై స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న పాటి ప్రచారం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి కూడా జీహెచ్ఎంసీ చేయడం లేదు. కొద్దిరోజుల క్రితం ఓ స్వచ్ఛందసంస్థ ‘సంచే బంగారం’ పేరిట కూకట్పల్లి రైతుబజార్‌కు క్లాత్, జ్యూట్‌బ్యాగులు తెచ్చుకునేవారికి కూపన్లు ఇచ్చి, డ్రా ద్వారా లక్ష రూపాయల విలువైన బంగారాన్ని ముగ్గురు విజేతలకు బహమతిగా అందజేసింది. ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తోన్న జీహెచ్ఎంసీ.. వివిధ కార్యక్రమాల పేరిట నిధుల్ని దుబారా చేస్తోందే తప్ప ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల జోలికి మాత్రం పోవడం లేదు. జీహెచ్ఎంసీ పంపిణీ చేయాలి... ప్రజల్లో క్లాత్, జ్యూట్బ్యాగులపై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ వాటిని ప్రజలకు పంపిణీ చేయాలి. మేం ఇటీవల అధ్యయనయాత్ర చేసిన అహ్మదాబాద్‌లో అక్కడి కార్పొరేషనే ప్రజలకు క్లాత్, జ్యూట్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. స్థానిక కార్పొరేటర్ పేరిట వాటిని ప్రజలకు అందజేస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో కార్పొరేటర్‌కు రూ. 2 లక్షల బడ్జెట్ కేటాయిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కూడా ఆ విధానాన్ని అమలు చేస్తే, ప్రజలకు అవగాహన కలుగుతుంది. - దిడ్డి రాంబాబు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఏవేవో నిర్ణయాలు... జీహెచ్ఎంసీ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. సరుకులు కొన్న ప్రతిసారీ రూ.3 చెల్లించి క్యారీబ్యాగును కొనుగోలు చేస్తున్నాం. ఇంటి నుంచి క్లాత్ బ్యాగులు తీసుకెళ్లినా ఎటువంటి రాయితీ ఇవ్వడం లేదు. - గిరి, కొనుగోలుదారుడు, రామంతాపూర్ నిషేధం మాటేమిటో...! 40 మైక్రాన్లలోపు పాలథీన్ వినియోగంపై జీహెచ్ఎంసీ విధించిన నిషేధం పక్కాగా అమలవుతోందా..! అంటే అదీ లేదు. నగరంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా వీటి వినియోగం కనబడుతోంది. పట్టించుకోవాల్సిన యంత్రాంగం తనిఖీల పేరిట దండుకుంటోంది. రాయితీపై ప్రచారం చేయాలి... మేమే క్లాత్‌బ్యాగులు తెచ్చుకుంటే ఆ మేరకు బిల్లులో రాయితీ ఇస్తారన్న విషయమే తెలియదు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గానీ, షాప్ నిర్వాహకులు గానీ తెలియపరచడం లేదు. ఇది సరికాదు. - రాజారాం, కొనుగోలుదారుడు. సర్కార్ విఫలమైంది... 40 మైక్రాన్లలోపు క్యారీబ్యాగుల నిషేధంపై ప్రచారార్భాటాలు చేసిన జీహెచ్ఎంసీ.. దానిని అమలు చేయడంలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమైంది. - వి.అనిల్‌రెడ్డి, రాష్ట్ర ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు