ప్లాస్టిక్ నిషేధం పేరిట ఏటా రూ.4.32 కోట్ల దోపిడీ | Annual 4.32 crores luti on account of Plastic bags ban | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ నిషేధం పేరిట ఏటా రూ.4.32 కోట్ల దోపిడీ

Published Wed, Aug 14 2013 2:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

ప్లాస్టిక్ నిషేధం పేరిట  ఏటా  రూ.4.32 కోట్ల దోపిడీ - Sakshi

ప్లాస్టిక్ నిషేధం పేరిట ఏటా రూ.4.32 కోట్ల దోపిడీ

దాదాపు ఐదేళ్లుగా ముషీరాబాద్ ‘స్పెన్సర్’లో సుబ్బారావు కుటుంబం సరుకులు కొనుగోలు చేస్తోంది. రెండేళ్ల క్రితం వరకు క్యారీబ్యాగులకు ఎలాంటి సొమ్ము చెల్లించేది కాదు. రెండేళ్ల నుంచి వెళ్లిన ప్రతిసారీ క్యారీబ్యాగులకూ సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. నెలకు మూడు నాలుగు పర్యాయాలు స్పెన్సర్‌కు వెళ్తున్న ఆ కుటుంబం తాము కొనుగోలు చేసే సరుకుల కోసం క్యారీబ్యాగుల సైజుల్ని బట్టి ఒక్కో పర్యాయం ఆరు నుంచి ఏడు రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఈ సమస్య ఎదుర్కొంటోంది సుబ్బారావు కుటుంబం మాత్రమే కాదండోయ్..! నగరంలో రోజూ సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సందర్శిస్తున్నవారందరిదీ. ఇలా నగరవాసి క్యారీ బాగుల కోసం ఏడాదికి వెచ్చిస్తున్న కనీస మొత్తం ఎంతో తెలుసా..!

అక్షరాలా రూ.4.32 కోట్లు. దీని కారణం జీహెచ్‌ఎంసీ. - సాక్షి, సిటీబ్యూరో
 
కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ క్యారీబ్యాగుల్ని జీహెచ్‌ఎంసీ నిషేధించింది. 40 మైక్రాన్లు మించిన ప్లాస్టిక్ క్యారీబ్యాగులకు వాటి సైజును బట్టి ధరలు వసూలు చేయాలని సెలవిచ్చింది. దాంతో, పేరెన్నికగన్న దుకాణాలు క్యారీబ్యాగుల ధరల్ని ప్రజల సరుకుల బిల్లుల్లో వడ్డించడం మొదలు పెట్టాయి. (నిషేధానికి ముందు ఏ సైజు క్యారీబాగునైనా ఉచితంగానే అందజేసేవి.) ఇదే అంశాన్ని పలుమార్లు నగరవాసులు జీహెచ్‌ఎంసీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించి ఇంటినుంచి క్లాత్, జ్యూట్ బ్యాగులు తెచ్చుకునేవారికి సరుకుల బిల్లులో ఆ మేరకు తగ్గింపు నివ్వాలని జీహెచ్‌ఎంసీ దుకాణాల వారికి సూచించింది. ఎవరూ పట్టించుకోలేదు.

గత నెల ఒకటి నుంచి క్లాత్ బ్యాగ్‌లు తీసుకువచ్చేవారికి ఈ రాయితీని కచ్చితంగా వర్తింపజేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. విక్రయదారులు పదిహేను రోజులు గడువుకోరారు. గడువు ముగిసి నేటికి దాదాపు నెల గడుస్తున్నా అమలు కావడం లేదు. ఈ రాయితీ సంగతి తెలిసిన వారు మాల్స్ నిర్వాహకుల్ని అడిగితే వారు స్పందించడం లేదు. క్యారీ బ్యాగుల పేరిట ప్రజల్ని దోచుకునేందుకు దుకాణదారులకి అనుమతినిచ్చిన ప్రభుత్వం ఇలాంటి రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం విశేషం.       
 
ఇదీ సంగతి: నగరంలో పెద్ద దుకాణాలెన్నో ఉన్నప్పటికీ, దాదాపు 200 సంస్థలు(షాపింగ్‌మాల్స్, ట్రేడ్‌సెంటర్స్, సూపర్‌మార్కెట్లు తదితరమైనవి) వినియోగదారులకు అందిస్తున్న 40 మైక్రాన్లు మించిన క్యారీబ్యాగులకు జనం నుంచి సొమ్ము వసూలు చేస్తున్నాయి.
బ్యాగుల సైజుల్ని బట్టి రూ.1 నుంచి రూ. 5 వరకు విక్రయిస్తున్నారు.
ఒక్కో షాప్ రోజుకు సగటున  300 క్యారీబ్యాగుల్ని విక్రయిస్తోంది.
ఈ లెక్కన రోజుకు విక్రయించే  క్యారీబ్యాగుల సంఖ్య 60,000.
ఒక్కో క్యారీబ్యాగు సగటున రూ.2 అనుకున్నా రోజుకు రూ.1.2 లక్షలు. నెలకు రూ.36 లక్షలు.. సంవత్సరానికి రూ. 4.32 కోట్లు జనం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇది కనీస మొత్తం మాత్రమే.  
జీహెచ్‌ఎంసీ 50 వేల దుకాణాల నుంచి వసూలు చేస్తున్న ట్రేడ్ లెసైన్సు ఫీజు ఏటా రూ.16 కోట్లకు అటూ ఇటూగా ఉంటోంది. అంటే.. జీహెచ్‌ఎంసీ వసూలు చేస్తున్న ట్రేడ్ లెసైన్సుల ఫీజులో 25 శాతం సొమ్మును 200 దుకాణాలు జనం నుంచి క్యారీబ్యాగుల కోసం వసూలు చేస్తున్నాయన్నమాట.
 
ఎందుకంత ప్రేమ.. ?
క్యారీబ్యాగుల పేరిట జనం నెత్తిన టోపీ పెడుతూ సొమ్ము కాజేస్తున్న వ్యాపార సంస్థలు సదరు బ్యాగులపై తమ దుకాణం పేరును ప్రచారం చేసుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు.. సంస్థ పేరును ఏ రకంగా ప్రచారానికి వాడుకున్నా.. ప్రకటనల ఫీజు చెల్లించాలి. కానీ..వారు చెల్లించడం లేదు. జీహెచ్‌ఎంసీ వసూలు చేయడం లేదు.
 
స్వచ్ఛందసంస్థలే నయం...  
ప్లాస్టిక్ నిషేధం.. క్లాత్, జ్యూట్‌బ్యాగులపై స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న పాటి ప్రచారం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి కూడా జీహెచ్‌ఎంసీ చేయడం లేదు. కొద్దిరోజుల క్రితం ఓ స్వచ్ఛందసంస్థ ‘సంచే బంగారం’ పేరిట కూకట్‌పల్లి రైతుబజార్‌కు క్లాత్, జ్యూట్‌బ్యాగులు తెచ్చుకునేవారికి కూపన్లు ఇచ్చి, డ్రా ద్వారా  లక్ష రూపాయల విలువైన బంగారాన్ని ముగ్గురు విజేతలకు బహమతిగా అందజేసింది. ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తోన్న జీహెచ్‌ఎంసీ.. వివిధ కార్యక్రమాల పేరిట నిధుల్ని దుబారా చేస్తోందే తప్ప ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల జోలికి మాత్రం పోవడం లేదు.
 
జీహెచ్‌ఎంసీ పంపిణీ చేయాలి...
ప్రజల్లో క్లాత్, జ్యూట్‌బ్యాగులపై అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ వాటిని ప్రజలకు పంపిణీ చేయాలి. మేం ఇటీవల అధ్యయనయాత్ర చేసిన అహ్మదాబాద్‌లో అక్కడి కార్పొరేషనే ప్రజలకు క్లాత్, జ్యూట్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. స్థానిక కార్పొరేటర్ పేరిట వాటిని ప్రజలకు అందజేస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో కార్పొరేటర్‌కు రూ. 2 లక్షల బడ్జెట్ కేటాయిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో కూడా ఆ విధానాన్ని అమలు చేస్తే, ప్రజలకు అవగాహన కలుగుతుంది.  - దిడ్డి రాంబాబు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్
 
ఏవేవో నిర్ణయాలు...
జీహెచ్‌ఎంసీ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. సరుకులు కొన్న ప్రతిసారీ రూ.3 చెల్లించి  క్యారీబ్యాగును కొనుగోలు చేస్తున్నాం. ఇంటి నుంచి క్లాత్ బ్యాగులు తీసుకెళ్లినా ఎటువంటి రాయితీ ఇవ్వడం లేదు. - గిరి, కొనుగోలుదారుడు, రామంతాపూర్
 
నిషేధం మాటేమిటో...!
40 మైక్రాన్లలోపు పాలథీన్ వినియోగంపై జీహెచ్‌ఎంసీ విధించిన నిషేధం పక్కాగా అమలవుతోందా..! అంటే అదీ లేదు. నగరంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా వీటి వినియోగం కనబడుతోంది. పట్టించుకోవాల్సిన యంత్రాంగం తనిఖీల పేరిట దండుకుంటోంది.
 
రాయితీపై ప్రచారం చేయాలి... మేమే క్లాత్‌బ్యాగులు
తెచ్చుకుంటే ఆ మేరకు బిల్లులో రాయితీ ఇస్తారన్న విషయమే తెలియదు. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు గానీ, షాప్ నిర్వాహకులు గానీ తెలియపరచడం లేదు. ఇది సరికాదు.  - రాజారాం, కొనుగోలుదారుడు.
 
సర్కార్ విఫలమైంది...
40 మైక్రాన్లలోపు క్యారీబ్యాగుల నిషేధంపై ప్రచారార్భాటాలు చేసిన జీహెచ్‌ఎంసీ.. దానిని అమలు చేయడంలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమైంది.  - వి.అనిల్‌రెడ్డి, రాష్ట్ర ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement