సాక్షి, హైదరాబాద్: వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజుల దోపిడీకి ప్రభుత్వం కళ్లెం వేసింది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగర, పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఫీజుల వసూళ్లపై నియంత్రణలు విధిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. ఎవరికైనా తొలి అర్ధగంట పాటు వాహనాల పార్కింగ్ బేషరతుగా ఉచితం. ఏవైనా కొనుగోళ్లు జరిపినట్లు బిల్లు చూపిస్తే అర్ధ గంట నుంచి గంట వ్యవధిలోపు పార్కింగ్ ఉచితమే. అయితే ఎలాంటి కొనుగోళ్లు జరపకపోతే నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పార్కింగ్ సమయం గంటకు మించితే ఆ వ్యవధికి చెల్లించాల్సిన పార్కింగ్ ఫీజు కంటే అధిక వ్యయం కొనుగోళ్లు జరిపినట్లు బిల్లు లేదా సినిమా టికెట్ చూపి ఉచిత పార్కింగ్ సదుపాయం పొందొచ్చు. ఈ కేటగిరీ కింద పార్కింగ్ ఫీజు కంటే షాపింగ్ వ్యయం తక్కువగా ఉంటే మాత్రం మొత్తం పార్కింగ్ సమయానికి నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ ఉత్తర్వులను వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని, లేకపోతే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక మాల్‌లో పార్కింగ్ ఫీజు తొలి రెండు గంటలు రూ.30, ఆ తర్వాత గంటకు రూ.20 అయితే మూడు గంటలకు వెరసి రూ.50 అవుతుంది. రూ.50లకు మించి వస్తువులు కొనుగోలు చేసినా, సినిమా టికెట్ రూ.50 కంటే ఎక్కువున్నా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో పార్కింగ్ ఫీజుల నియంత్రణ విషయంలో ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునే అధికారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఉంటుందని పేర్కొంది.
పార్కింగ్ నియంత్రణకు ఎస్పీవీ!
హైదరాబాద్‌లో అస్తవ్యస్తంగా మారిన వాహనాల పార్కింగ్‌ను నియంత్రించడంతో పాటు విడివిడిగా పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పార్కింగ్ పాలసీ అమలు బాధ్యతలను ప్రభుత్వం ఎస్పీవీకి అప్పగించనుందని రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment