అరచేతిలో ఆస్తులు | Assets in Tablet PC details | Sakshi
Sakshi News home page

అరచేతిలో ఆస్తులు

Published Sun, Sep 6 2015 12:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

అరచేతిలో ఆస్తులు - Sakshi

అరచేతిలో ఆస్తులు

- కబ్జా కాకుండా జీహెచ్‌ఎంసీ చర్యలు
- టాబ్లెట్ పీసీల్లో వివరాలు
- అభివృద్ధి పథకాల సమాచారం నిక్షిప్తం
సాక్షి, సిటీబ్యూరో:
కోట్లాది రూపాయల ఆస్తులున్నా... వివరాలు లేవు. ఏయే ప్రాంతాల్లో..  ఏయే షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఎవరు ఉంటున్నారో తెలియదు. ఎన్ని ఖాళీ స్థలాలు?... ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో... ఎంత మేరకు లీజులో ఉన్నాయో తెలియదు. ఏ పార్కు కబ్జాకు గురైందో సమా చారం లేదు ...
 
ఇదీ ఘనత వహించిన జీహెచ్‌ఎంసీ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాయమైన ఆస్తులను గుర్తించే సంగతి అటుంచి... కనీసం ఉన్న వాటినైనా కాపాడుకునేందుకు .. ప్రస్తుతం చేపడుతున్న వివిధ పనుల వివరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీని కోసం 500 టాబ్లెట్ పీసీలను కొనుగోలు చేస్తున్నారు. ఆస్తుల వివరాలను ఫొటోలతో సహా వీటిలో నిక్షిప్తం చేయనున్నారు. తద్వారా ఏయే ఆస్తులున్నాయి? దేనికోసం వినియోగిస్తున్నారు? ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉందన్న సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా కబ్జాకు గురైనా... ఇతర అవసరాలకు దారి మళ్లించినా తెలుసుకునే వీలుంటుంది. దీంతోపాటు జీహెచ్‌ఎంసీ చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు సైతం వీటిలో పొందుపరిచే యోచనలో ఉన్నారు.
 
సామర్థ్యాన్ని పరిశీలించేందుకు...
ఇటీవల జీహెచ్‌ఎంసీ వివిధ పనులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. వీటిలో మోడల్ మార్కెట్లు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబీలు), బస్‌బేలు, శ్మశాన వాటికలు, చెరువుల సుందరీకరణ, కొత్త పార్కులు ఉన్నాయి. హరిత హారంలో భాగంగా యాభై లక్షల మొక్కలు నాటనున్నారు. ఈ వివరాలు అందుబాటులో ఉండేందుకు టాబ్లెట్ పీసీలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా వాటి పనితీరును పరిశీలించేందుకు.. జీహెచ్‌ఎంసీ అవసరాలకు వాటి సామర్ధ్యం సరిపోతుందో లేదో తెలుసుకునేందుకు తొలుత 30 టాబ్లెట్లను తీసుకున్నారు. పనితీరును బట్టి మిగతావి తీసుకుంటారు.
 
స్థలాలపై సర్వే

నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీకి అత్యంత విలువైన ఆస్తులెన్నో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, రికార్డులు గల్లంతు కావడం వంటి కారణాలతో జీహెచ్‌ఎంసీ వద్ద ప్రస్తుతం ఆ వివరాలు లేవు. గతంలో ఈ దిశగా కొంత కసరత్తు చేసిన అధికారులు  నానా తంటాలు పడి 272 ఆస్తులు లీజులో ఉన్నట్లు గుర్తించారు. వాటిలోనూ 104 ఆస్తుల (1.20 లక్షల చదరపు గజాలు) సమాచారమే రికార్డుల్లో ఉంది. మిగతా వాటికి సంబంధించిన వివరాల్లేవు. వాస్తవంగా ఇప్పుడవి ఎవరి అజమాయిషీలో ఉన్నాయో... ఏ అవసరాలకు వినియోగిస్తున్నారో తెలియదు. అధికారుల అంచనాల మేరకుజీహెచ్‌ఎంసీ ఆస్తులు 1500 దాకా ఉంటాయి. కానీ.. అవి ఎక్కడున్నాయో.. ఎవరి అధీనంలో ఉన్నాయో తెలియడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలపై సర్వే చివరి దశలో ఉంది. వీటి చుట్టూ ప్రహరీలు నిర్మించనున్నారు. ఆ వివరాలు టాబ్లెట్ పీసీల్లో ఉంచాలని భావిస్తున్నారు. స్థల పరిమాణాన్ని బట్టి వాటిలో వివిధ సదుపాయాలు కల్పించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement