ప్రణాళిక తో పరుగులు
ప్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు తక్కువ సమయంలో అధిక రాబడిని అందుకోవడానికి పరుగులు పెట్టకూడదు. ఇది అన్ని వేళలా మెరుగైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. వీలైతే కనీసం ఐదేళ్ల పాటు ఆయా పెట్టుబడిపై రాబడిని ఆశించకూడదు. ఆ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. ప్రస్తుతం తక్కువ రేటుకు కొనేసి ఐదేళ్లయ్యాక అధిక రేటుకు అమ్ముకునేలా ప్రణాళికలుండాలి. అయితే స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రస్తుత పరిస్థితులపై చక్కటి అవగాహన పెంచుకోవాలి. తర్వాత పరిస్థితి ఎలా మారడానికి అవకాశముందో అంచనా వేయాలి.
మరి, ఏయే సందర్భాల్లో స్థలాలపై అధిక రాబడి అందుకోవడానికి అవకాశముందో ఓసారి చూద్దామా..
అభివృద్ధి చెందుతుందా?
అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ప్రాంతాల్లోనే స్థలాన్ని కొనాలి. ఒకవేళ ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కొందామంటే.. రేటు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. అయినా అక్కడే కొనాలన్న నిర్ణయానికొస్తే విస్తీర్ణం తక్కువ గల స్థలం లేదా ఇంటితో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశమేమిటంటే.. ఇదివరకే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మనం ఊహించినంత వేగంగా రేట్లు పెరగకపోవచ్చు. అంతేకాదు కొంతకాలం అయ్యాక ధరలు అక్కడే స్థిరపడొచ్చు కూడా. అందుకే అభివృద్ధికి ఆస్కారమున్న చోట కొన్నారనుకోండి ఊహించిన దానికంటే అధిక రాబడి గిట్టుబాటవుతుంది.
మౌలిక సదుపాయాలు..
మనం కొనాలని భావించే స్థలానికి చేరువలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా లేదా అనే విషయాన్ని చూడాలి. ఉదాహరణకు స్థలానికి చేరువలో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్, ఉద్యానవనాలు, స్విమ్మింగ్‌పూల్ వంటి సదుపాయాలున్నాయనుకోండి.. అక్కడ నివసించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఫలితంగా భవిష్యత్తులో ధరలూ పెరుగుతాయి. ప్రస్తుతం అలాంటి సదుపాయాలు లేకపోయినా రానున్న రోజుల్లో వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వపరంగా చర్యలేమైనా తీసుకుంటారా? లేదా ప్రైవేటు సంస్థలు అలాంటి సదుపాయాల్ని పొందుపరుస్తాయా? వంటి అంశాల్ని కనుక్కోవాలి. ఏదేమైనా కొన్నాళ్ల తర్వాత ఆయా ప్రాంతం అభివృద్ధి చెందుతున్న నమ్మకం ఏర్పడాలి. కొన్ని స్థిరాస్తి సంస్థలు చెప్పే కబుర్లకు బోల్తాపడి మీ సొమ్మును పెట్టుబడిగా పెట్టకండి. వాస్తవాల్ని గమనించాకే అడుగు ముందుకేయాలి.
ప్రజా రవాణా వ్యవస్థ..
మనం తీసుకునే స్థలం దాకా ప్రజా రవాణా వ్యవస్థ సదుపాయం లేకున్నా పర్వాలేదు. కనీసం రానున్న రోజుల్లో అయినా అట్టి సౌకర్యం అందుబాటులోకి వస్తుందా? ఈ అంశాన్ని పరిశీలించాలి. అప్పుడే భవిష్యత్తులో ధర పెరిగే అవకాశముంటుంది. దగ్గర్లో రైల్లే స్టేషన్ లేకున్నా పర్వాలేదు. బస్‌డిపో లేకపోయినా పర్వాలేదు. నిత్యం రాకపోకలు సాగించడానికి బస్టాండ్ ఉంటే సరిపోతుంది.
ఇదే అంశం ఆధారంగా చాలామంది ప్లాట్లను కొంటుంటారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ప్లాట్ల ధరలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం.. మెట్రో రైలే. యమజోరుగా జరుగుతోన్న మెట్రో పనుల్ని చూసి ప్లాట్లను అమ్ముకోవడానికి ఎవరూ సాహసించట్లేదు. అయితే నగరంలో ఖాళీ స్థలాలు పెద్దగా లేవు కాబట్టి రానున్న రోజుల్లో ధరలు తగ్గే అవకాశమే లేదు. కాబట్టి స్థలాలు కొనేవారెవరైనా అభివృద్ధి చెందడానికి ఆస్కారముండి, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి మరి.
పాఠశాలలు, ఆసుపత్రులు..
స్థలం కొనేముందు, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయా అనే అంశాన్ని గమనించాలి. ఇప్పుడే కాకపోయినా ఓ ఐదేళ్ల తర్వాతైనా అవి ఏర్పాటవ్వడానికి వీలుంటుందా అనే విషయాన్ని గమనించాలి. పేరు ప్రఖ్యాతలున్న పాఠశాలలుంటే భవిష్యత్తులో రేటు పెరగొచ్చు కూడా.
బడా కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల్ని విస్తరించడానికి అవకాశముందనే విషయాన్ని వీలైతే తెలుసుకోండి. ఏదేని కొత్త ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల్ని కల్పించే సంస్థ ఏర్పాటైతే.. అక్కడి స్థలాల ధరలు పెరుగుతాయి. కొన్నిసార్లు సహజంగా పెరగకపోయినా.. మధ్యవర్తులు, రియల్టర్లు ఉంటారు కదా రేట్లు పెంచడానికి. అలా చేయడం వల్లే ప్రస్తుతం శంషాబాద్, మహేశ్వరం చుట్టుపక్కల స్థలాల్ని కొనేవారే కరువయ్యారు. కాబట్టి ప్లాట్ల రేట్లు సహజంగా తప్ప కృత్రిమంగా కాదు.