ఉట్నూరులో వాట్సాప్‌ మంట | Tension over group clash in Utnoor | Sakshi
Sakshi News home page

ఉట్నూరులో వాట్సాప్‌ మంట

Published Mon, May 8 2017 1:40 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

ఉట్నూరులో వాట్సాప్‌ మంట - Sakshi

ఉట్నూరులో వాట్సాప్‌ మంట

ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్టు చేసిన యువకుడు
► చర్యలు తీసుకోవాలంటూ మరో వర్గం ఆందోళన
► ఇరువర్గాల మధ్య రాళ్లదాడులు.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం


ఉట్నూర్‌/ఉట్నూర్‌రూరల్‌ (ఖానాపూర్‌): ఓ వర్గాన్ని కించపరుస్తూ ఓ యువకుడు వాట్సాప్‌లో చేసిన పోస్టు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో మంటపెట్టింది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు, రాళ్ల దాడులకు దారితీసింది. శనివారం రాత్రి నుంచి మొదలైన ఈ ఆందోళన ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

ఆందోళన చేస్తున్న ఇరువర్గాలు దుకాణాలు, వాహనాల ధ్వంసానికీ దిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 144 సెక్షన్‌ విధించారు. సమీపంలోని నాలుగు జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను రప్పించి.. భారీ స్థాయిలో మోహరించారు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

లాఠీచార్జి.. రబ్బరు బులెట్ల ప్రయోగం
ఉట్నూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వారిని కించపరుస్తూ వాట్సప్‌లో వీడియోను పోస్టు చేశాడు. దీంతో ఆ వర్గానికి చెందిన వారు సదరు యువకుడిని అరెస్టు చేయాలంటూ శనివారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. రహదారి వెంట పలు దుకాణాలను ధ్వంసం చేశారు. ఆదివారం ఉట్నూర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కూడా ఆ యువకుడిని అరెస్టు చేయాలంటూ పోలీసుస్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు.

అయితే బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓ దుకాణ సముదాయం వద్ద చోటు చేసుకున్న ఘర్షణ.. ఇరువర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దుకాణా లు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు పలుసార్లు లాఠీచార్జీ చేశారు. బాష్పవాయు గోళాలను, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. ఎక్కడిక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాళ్ల దాడిలో ఎస్పీ శ్రీనివాస్, ఉట్నూర్‌ ఇన్‌చార్జి డీఎస్పీ లక్ష్మీనారా యణ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు.

శాంతి చర్యలు చేపట్టిన కలెక్టర్‌
కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ రవివర్మ, కలెక్టర్‌ జ్యోతి బుద్దప్రకాశ్, జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి, అధికారులు ఉట్నూర్‌ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. తరతరాలుగా కలసి మెలసి జీవిస్తున్నవారంతా ఓ వ్యక్తి చేసిన అనుచిత పని కారణంగా ఘర్షణలకు దిగడం సరికాదని సూచించారు.

వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఇరువర్గాల పెద్దలు కోరారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఓ వర్గం వారు డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రతి ఆదివారం ఉట్నూర్‌ మండల కేంద్రంలో వార సంత కొనసాగుతంది. దీంతో ఆదివారం పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి చేరుకున్నారు. ఘర్షణలు చెలరేగడంతో భయాందోళనతో తిరుగుముఖం పట్టారు.

నాలుగు జిల్లాల నుంచి పోలీసులు
ఉట్నూరులో ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆదిలాబా ద్‌తో పాటు కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోని సమీప మండలాల నుంచి పోలీసు సిబ్బందిని.. ఏపీఎస్పీ బెటాలియన్‌ ప్రత్యేక బృందాన్ని హుటాహుటిన ఉట్నూరు రప్పించారు. సుమారు 500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఐదు కేసులు నమోదు
వాట్సప్‌లో అనుచిత వాఖ్యలు చేస్తూ పోస్టు చేసిన యువకుడిపై కేసులు నమోదు చేశామని కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ రవివర్మ తెలిపారు. సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణ సముదాయాలను ధ్వంసం చేసిన వారిపై, ఆందోళనకారులపై ఐదు కేసులు నమోదు చేశామని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, 144 సెక్షన్‌ కొనసాగుతుందని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement