న్యూఢిల్లీ: వదంతులు, బూటకపు వార్తలు వ్యాప్తిచెందకుండా తగిన పరిష్కార మార్గాలు కనుగొనాలని కేంద్రం వాట్సాప్‌ను మరోసారి కోరింది. లేబలింగ్ ఫార్వర్డ్స్(ఫార్వర్డ్ చేసిన సందేశాలను గుర్తించే విధానం)ని మించిన మరింత ప్రభావశీల చర్యలతో ముందుకు రావాలని ఆదేశిస్తూ గురువారం లేఖ రాసింది. వదంతుల ప్రచారానికి ఉపయోగపడుతున్న వేదికలను కూడా ప్రేరేపకాలుగానే భావిస్తామని, అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘కొందరు పోకిరీలు వదంతులను ప్రచారం చేస్తున్నారు.
అందుకు వారు వాడుతున్న సాధనాలు తమ బాధ్యత, జవాబుదారీతనం నుంచి తప్పించుకోజాలవు. ప్రేక్షకులుగా మిగిలిపోయే అలాంటి వేదికలను ప్రేరేపకాలుగా భావిస్తూ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని సమాచార, సాంకేతిక శాఖ వాట్సాప్‌ను హెచ్చరించింది. నకిలీ వార్తలను గుర్తించి, అవి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న లేబలింగ్ ఫార్వర్డ్స్ కన్నా మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. సోషల్ మీడియా దుర్వినియోగంపై రాజకీయ పార్టీలు సహా అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించి తగిన విధానాలు రూపొందిస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment