ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారతీయులు గోప్యతను పట్టించుకోరు. పేద వారికి గోప్యత అవసరం లేదు’ అనే హేతుబద్ధంగా కనిపించే వాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది సుప్రీం కోర్టు సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు. గోప్యత కూడా ఓ ప్రాథమిక హక్కే అంటూ సుప్రీం కోర్టులోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తీర్పును జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వెలువరించారు. అయినప్పటికీ దేశంలో మూక హత్యలకు కారణమవుతున్న నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వాట్సాప్‌కు కళ్లెం వేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వాట్సాప్ సీఈవోతో మంగళవారం సమావేశమైన ఏ వార్తను ఎవరు పుట్టించారో తమకు తెలియాలని, అందుకు వీలు కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందజేయాలని కోరారు. ఆలోచించుకొని చెబుతామన్న వాట్సాప్ సీఈవో ప్రభుత్వ విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నట్లు గురువారం ప్రకటించడం ముదాహం.
సోషల్ మీడియాలో డేటా సెక్యూరిటీకి సంబంధించి శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ బిల్–2018’ ముసాయిదాను గత జూలై నెలలో ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే అది ప్రజల గోప్యతా హక్కును పటిష్టం చేయడానికి బదులు ‘ఆధార్ కార్డు’ను పరిరక్షించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆధార్ కార్డుల వల్ల వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతింటుందని ఆరోపిస్తూ ఆరేళ్ల క్రితం ఓ పిటిషన్ దాఖలు చేయడం, ఈ ఆరేళ్ల కాలంలో 30 పిటిషన్లు దాఖలవడం, వాటన్నింటిని కలిపి సుప్రీం కోర్టు విచారించి తీర్పును వాయిదా వేయడం తెల్సిందే. ఆ తీర్పు కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు సానుకూలంగానే వస్తుందని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు.
సోషల్ మీడియాలో విధిగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసేలా చట్టం తీసుకరావాలని, నకిలీ వార్తలకు ఆ ఫిర్యాదుల విభాగం అధికారినే బాధ్యులను చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. నేడు దేశంలో నకిలీ వార్తలు మూక హత్యలకు కారణం అవడం దురదృష్టకరమని, అంత మాత్రాన ఆ పేరుతో ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించాల్సిన అవసరం లేదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మూక హత్యలకు పాల్పడుతున్న వారిని పాలకపక్ష నాయకులే ఓ పక్క ప్రోత్సహిస్తూ మరోపక్క మూక హత్యలకు కారణమవుతున్న నకిలీ వార్తల సృష్టికర్తలను పట్టుకునేందుకు తమ ప్రయత్నమంతా అని వాదించడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమేనని వారు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment