Right to privacy
-
దాపరికంపైనా దాడేనా?
నీ సమాచారం మేం తీసుకుంటాం, నువ్వే సమాచారం అడిగినా ఇవ్వం. ఇదీ ప్రభువుల ఉవాచ. తస్మాత్ జాగ్రత్త. పది పోలీసు నిఘా విభాగాలు ప్రజల కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని పర్యవేక్షించి, జోక్యం చేసుకుని డీక్రిప్ట్ చేయవచ్చునని కేంద్ర ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 69(1) కింద, 2009 నియమాల్లో నాలుగో నియమం ప్రకారం, ఇంటెలిజెన్స్బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి జెన్స్, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, కేబినెట్ సెక్రటేరియట్ (రా), జమ్మూకశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసులు పౌరుల కంప్యూటర్లలోకి తొంగి చూడవచ్చు. జోక్యం చేసుకోవచ్చు. దోచేయవచ్చు. పాలకుల దుర్మార్గ లక్షణాలలో ముఖ్యమైంది పౌరుల సమాచారాన్ని సేకరించడం. తన దగ్గరున్న సమాచారాన్ని ప్రజలకు ఏం చేసినా ఇవ్వకపోవడం. ఒకవైపు ఆర్టీఐని బలహీనం చేస్తూ, మరోవైపు పౌరుల ప్రైవసీని హరించే ప్రకటనలు చేస్తున్నది. మనం ఉత్తరాలు రాసుకుంటే కవర్లు తెరిచి చూసే అధికారం తనకు తాను ఇచ్చుకున్నది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ అధికారాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాలకులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడుకుంటూ వస్తున్నారు. టెలిగ్రాఫ్ చట్టంలో కూడా పౌర సమాచార తస్కరణ అధికారాలను రాసుకున్నది బ్రిటిష్ సర్కార్. ఇప్పుడు కంప్యూటర్లలో జనం సమాచారాన్ని కైవసం చేసే అధికారదాహంతో ఉంది. ఇప్పుడు ఉత్తరాలు రాసుకునేవారు తక్కువ. టెలిగ్రాముల కథ ఏనాడో ముగిసిపోయింది. ఈమెయిల్స్ ఇచ్చుకోవడం, సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసుకోవడం జరుగుతూ ఉన్నది. బ్లాగుల ద్వారా ప్రతిపౌరుడూ ఒక స్వయం జర్నలిస్టుగా మారాడు. సెల్‌ఫోన్ పట్టుకున్న ప్రతివాడూ ఇన్‌స్టాగ్రామ్‌లో పౌర పత్రికా ఫొటోగ్రాఫర్‌గా మారాడు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అని ఆలోచనలను వాక్యాలుగా మలచగల ప్రతి పౌరుడూ తన వాక్ స్వాతంత్య్రాన్ని వినియోగించుకుంటున్నాడు. ప్రింట్ చేయాల్సిన పని లేకుండానే వేలాది మంది ప్రజలకు చేరువయ్యే టెక్నాలజీ సామాన్య మానవుడిని పక్కవాడి భావజాలాన్ని ప్రభావితం చేసే ప్రభావశాలిగా మార్చేసింది. కంప్యూటర్ మాధ్యమాన్ని విరివిగా వాడుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో నిశితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా కోపతాపాలు బయటపెట్టుకుంటూ హద్దులు మీరి తీవ్ర పదజాలాన్ని కూడా వాడుతున్నారు. టెలిగ్రాములు, ఉత్తరాలు తెరచి తరచి చూసే అధికారం సొంతం చేసుకున్న ప్రభుత్వం రహస్యంగా టెలిఫోన్ భాషణలను కూడా వింటున్నది. వ్యక్తుల ఆలోచనా విధానాలను, వారి వ్యక్తీకరణను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఇంకా అధికారం కావాలంటున్నది. జనం స్వేచ్ఛను ఎంత తాగేసినా ప్రభువుల అధికార దాహం తీరడం లేదు. ఇప్పుడు మన సెల్ఫోన్లో సిల్లీ కబుర్లు వింటారట, చూస్తారట. బ్లాగ్లు, వెబ్సైట్లు వెతుకుతారట. పౌరులు వాడుకునే ఆధునిక సంచారఫోన్లు కూడా కంప్యూటర్లే. ఫేస్బుక్ అందరికీ కనిపించేదే. వాట్సాప్ సమాచారం గ్రూప్ సభ్యులకే పరిమితం. ఇప్పుడీ పది సంస్థలు వాటిని కూడా చూడవచ్చు. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో జరిగే జాతి వ్యతిరేక కార్యక్రమాలను పసిగట్టడానికి ఈ అధికారం అవసరమట. కానీ టోకున పౌరులందరి కంప్యూటర్లు చూస్తాననటం. సమాచారం తీస్తాను అనడమంటే అపారమైన అధికారాన్ని సొంతం చేసుకోవడమే. వేల కేసుల్లో రహస్యంగా టెలిఫోన్లు వింటూనే ఉన్నారని కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అధికార వర్గాల్లో వినబడుతూంటాయి. పై స్థాయిలో ఉన్న అధికారులు కూడా ట్యాపింగ్ జరుగుతుందని భయపడుతూ ఉంటారు. అందుకే ఎన్క్రిప్టెడ్ (అంటే తొంగి చూడడానికి వీల్లేని) సేవలందించే వాట్సాప్ వంటి వాటి ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరూ వినలేరనే నమ్మకంతో. ఈ ఉత్తర్వుతో వాట్సాప్ మాత్రమే కాదు మరే ఇతర ఎన్క్రిప్టెడ్ సమాచార ప్రసారాలనయినా డీక్రిప్ట్ చేసి తెలుసుకోవచ్చు. ప్రజల మెదళ్లమీద నియంత్రణకు అధికారం వాడడం, వారి ఆలోచనలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. పౌరుల స్వేచ్ఛకు భంగకరమైన అధికార దుర్వినియోగానికి ఇవి దారి తీస్తాయి. ఇది ఏకపక్ష నియంతృత్వ చర్య. 2017 ఆగస్టు 24న సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో ప్రైవసీని ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ, వెంటనే దానికి సంబంధించిన చట్టం చేయాలని సూచించింది. కానీ ప్రైవసీని నిర్వచించి చట్టం చేయవలసిన ప్రభుత్వానికి పార్లమెంటుకు తీరికే లేదు. ప్రైవసీ పేరుమీద ప్రజలకు ప్రభుత్వాధికారుల సమాచారాన్ని ఇవ్వకుండా తీవ్రంగా ప్రతిఘటించే ప్రభు త్వం, ప్రజల ప్రైవసీ మీద చేయదలచుకున్న మూకుమ్మడి దాడికి ఈ ప్రకటన నాంది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆ ‘వైరస్’ పేరు ప్రభుత్వం!
కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం పది దర్యాప్తు సంస్థలు నేరుగా మీ పర్సనల్ కంప్యూటర్లోకి చొరబడవచ్చు. ఇక పౌరుల గోప్యత హక్కు ప్రభుత్వం దయాభిక్ష మాత్రమే. తాను తలిస్తే ఎవరి కంప్యూటర్లో అయినా, ఏ సమయంలో నైనా సమాచారం కోసం ఎలాంటి అనుమతులు లేకుండానే బలవంతంగా తీసుకోవచ్చు. సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం వ్యక్తిగత గోప్యతని ప్రాథమిక హక్కుగా గుర్తించి, ప్రకటించి ఏడాది నిండకుండానే ఈ వైపరీత్యానికి ప్రభుత్వం పాల్పడింది. పౌరుని జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కులలో అంతర్భాగమే గోప్యత అని చాటిన ధర్మాసనం తీర్పును అనుసరించి ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాకుండా పోయింది. ఇప్పుడు పది దర్యాప్తు సంస్థలు ఎవరికీ జవాబుదారీగా ఉండకుండానే ఏకాఏకీ ఎవరి కంప్యూటర్ డేటా నైనా పొందవచ్చు అనేది సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధం. పోనీ ఈ ప్రభుత్వాలకు పౌరుల హక్కుల్ని పవిత్రంగా చూసే అలవాటు ఉందా అంటే అదీ లేదు. అందుకు ఎన్నో ఉదాహరణలు. మణిపూర్‌లో ఒక జర్నలిస్ట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించాడన్న సాకుతో ఆయన్ని దేశ ద్రోహ నేరం క్రింద జాతీయ దర్యాప్తు సంస్థ జైల్లో పెట్టింది. పోనీ దేశ భద్రతకు భంగం అనుకున్నప్పుడు ఆయా కేసుల్లో కోర్టు అనుమతి తీసుకొని చర్యలు తీసుకోవచ్చు. లేదా అన్ని కోణాల్లో ఆలోచించి, పార్లమెంట్లో సరైన చట్టం తీసుకువచ్చి, ఆ చట్టం పరిధిలో దర్యాప్తు జరపొచ్చు. మిగతా ప్రజాస్వామ్య దేశాలు పాటిస్తున్న పద్ధతులివి. పౌరుల హక్కుల్ని గౌరవించడంలో అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మన దేశం అందుకు విరుద్ధంగా ఇలాంటి ఆదేశాలు జారీ చెయ్యడం అన్యాయం. రాజ్యాంగ విరుద్ధం. ఎవరింట్లోకైనా తలుపు బద్దలుకొట్టి వెళ్లడం ఎంత అక్రమమో, ఎవరి వివరాలనైనా లాక్కోవడం అంతే అక్రమం. దేశ భద్రతను కాపాడే పేరుతో నిఘా రాజ్యం తేవడం సమంజసం కాదు. పౌరుల హక్కుల ఉల్లంఘన ఉదంతాలను చూస్తుంటే భారతీయ రాజ్యవ్యవస్థ ఇప్పుడు ఎంతమాత్రం ‘సాప్ట్ స్టేట్’గా లేదని అది ‘బ్రూటల్ స్టేట్’గా అడుగడుగునా నిరూపించుకుంటోందని శేఖర్‌గుప్తా వంటి సీనియర్ పాత్రికేయులు చెబుతున్నది అక్షరసత్యమేనని భావించాల్సి ఉంటుంది. వ్యాసకర్త: డా‘‘ డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ -
‘గోప్యత’పై ఎందుకీ విరగబాటు?
దేశ పౌరుల పర్సనల్ కంప్యూటర్లలోకి, ఇతర సమాచార మాధ్యమాలలోకి చొరబyì , తనిఖీలను య«థేచ్ఛగా సాగించి వ్యక్తిగత సంభాషణలను, సందేశాలను, ఇతరత్రా వ్యక్తుల మధ్య బట్వాడా అవుతున్న సమాచారాన్ని సేకరించి పాలకులకు అందచేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోని 10 సాధికార కూపీ సంస్థలకు సంపూర్ణ అధికారాలను దఖలు పర్చింది. నెట్లోకి, ‘నట్టింటి’లోకీ, పర్సనల్ సెల్ ఫోన్లలోకి ‘దొంగల్లా’ తొంగిచూసే హక్కు నిఘా సంస్థలకు ధారాదత్తం చేసింది దారితప్పిన కేంద్రం. ఇది గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత అంతటి స్థాయిలో తీసుకున్న ప్రమాదకర నిర్ణయం. ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి. ‘తీర్పరులైన న్యాయమూర్తులు (లా మెన్) నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోతే ఆ పరి స్థితి – అమాయకులు పాల్పడే హింస కన్నా వీరి వల్ల సమాజానికి జరిగే హానీ, చెరుపే ఎక్కువ. న్యాయమూర్తులు రాజ్యాం గపరమైన కనికరం, దయార్ద్ర మనస్సుతో, మానవత్వంతో వ్యవహరిం చాలి. న్యాయస్థానం చూపాల్సిన కనికరం లేదా దయ అన్నది న్యాయ మూర్తి చూపే దాతృత్వమో లేదా భిక్షో కాదు సుమా! అది రాజ్యాంగ ధర్మాసనం (కాన్స్టిట్యూషనల్ కోర్టు) విధిగా నిర్వర్తించాల్సిన బాధ్యత అని మర్చిపోరాదు’ – ముగ్గురు సుప్రీం ప్రధాన న్యాయమూర్తులలో ఒకరుగా ఉండి ఇటీవలే రిటైరైన సుప్రసిద్ధ జస్టిస్ కురియన్ జోసఫ్ ఉవాచ (29–11–08) ఈ మాటల్ని, హెచ్చరికను జస్టిస్ కురియన్ జోసఫ్ ఇప్పుడు ఎందుకు హెచ్చరికగా చెప్పవలసి వచ్చింది? నేడు దేశంలో న్యాయస్థానాలను, రాజ్యాంగ ధర్మాసనాన్ని, పలు రిపబ్లిక్ రాజ్యాంగ సంస్థలన్నీ, ప్రజా స్వామ్య విలువలను, స్థిరపడి పురోగమిస్తున్న పలు విద్యావిధానాలను, శాస్త్ర సాంకేతిక వ్యవస్థల నిర్ణయాలను నర్మగర్భంగానూ, బాహాటం గానూ, రాజకీయ పాలనా వ్యవస్థలోని ‘పెద్దలు’ ఉల్లంఘిస్తూ వస్తున్న సమయంలో దేశప్రజలకు ఈ రకంగా విన్నవించవలసి వచ్చింది. కానీ జస్టిస్ జోసఫ్ ప్రకటన పట్టుమని నెలరోజులు కూడా ముగియకుండానే నేటి పాలకులు పార్లమెంటులో చర్చించి అనుమతి పొందకుండానే దేశ ప్రజల సమాచార స్వేచ్ఛను, పౌర స్వేచ్ఛను దెబ్బతీసే మరొక ప్రమా దకరమైన ఉత్తర్వును అకస్మాత్తుగా విడుదల చేశారు. కురియన్ వీడ్కోలు సందర్భంగా నేటి ప్రధాన న్యాయమూర్తి, కొలది మాసాల క్రితం నాటి నలుగురు సీనియర్ న్యాయమూర్తులలో ఒకరుగా దేశంలో ప్రజాస్వామ్య వాదులకు హెచ్చరికగా న్యాయస్థానంలో కొన్ని సందర్భాల్లో పాలకుల ఒత్తిడి వల్ల కలత చెందుతూనే న్యాయవ్యవస్థకు, రాజ్యాంగ బద్ధతకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయో ప్రజల్ని జాగరూ కులను చేస్తూ చరిత్రాత్మక నిర్ణయాలు చేయడం అందరికీ తెలుసు. అయినా సరే ఏదో ఒక మిషతో ప్రజాశ్రేయస్సుకు విరుద్ధమైన నిర్ణయాలను స్వార్ధ ప్రయోజనాలతో చేస్తూ ఉండటం కాంగ్రెస్, బీజేపీ పాలనా వ్యవస్థలకు సమానమైన దురలవాటుగా పరిణమించడం దేశ ప్రజల అనుభవం కనుకనే ఈ రెండు రకాల పాలకవర్గాలు (కాంగ్రెస్, బీజేపీ) తాము తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలకు ఆకస్మిక ఉత్తర్వు లకు, నిరంకుశ ఆర్డినెన్సులకూ ‘త్వం’ అంటే ‘త్వం’ అంటూ పరస్పరం నిందించుకుంటూ ప్రజల్ని వెర్రివెంగళప్పలుగా చేస్తున్నారు. ఇందుకు తాజాగా బీజేపీ పాలకులు.. గతంలో ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత అంతటి స్థాయిలో (21–12–2018) తీసుకున్న ప్రమాదకర నిర్ణయం. ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి. దేశపౌరుల పర్సనల్ కంప్యూటర్లలోకి, ఇతర సమాచార మాధ్యమాలలోకి చొరబడి, (ఈ అవకాశం లేకుండా బంధించిన ఎన్క్రిప్షన్ని బద్దలు కొట్టి) తనిఖీలను యథేచ్ఛగా సాగించి వ్యక్తిగత సంభాషణలను, సందేశాలను, ఇతరత్రా వ్యక్తుల మధ్య బట్వాడా అవుతున్న సమాచారాన్ని సేకరించి పాలకులకు అందచేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని 10 సాధికార కూపీ సంస్థలకు (కేంద్ర గూఢచార సంస్థ, ఎన్సీబీ, ఈడీ, సీబీఐ తదితర కేంద్ర నిఘాసంస్థలు) సంపూర్ణ అధికారాలను వాటి హక్కుగా దఖలు పర్చింది. ప్రభుత్వంతో కూడా నిమిత్తం లేకుండా, నెట్లోకి, ‘నట్టింటి’ లోకీ, పర్సనల్ సెల్ ఫోన్లలోకి ‘దొంగల్లా’ తొంగిచూసే హక్కు నిఘా సంస్థలకు ధారాదత్తం చేసింది దారితప్పిన కేంద్రం. తన నిరంకుశ నిర్ణయానికి సమర్థనగా ఎవరిని ‘అరువు’ తెచ్చు కుంది? తనలాంటి కాంగ్రెస్ పాలకుల్నే– వారు 2009లో తెచ్చిన టెలి గ్రాఫ్ చట్టాన్ని, 2000 నాటి ఐటీ చట్టాన్ని. రెండు పాలక పక్షాలు, ‘దేశ భద్రతతో చెలగాటమాడుతోంద’ని పరస్పరం నిందించుకున్న పాలక పక్షాలే. అంటే భారత పౌర సమాజమే దేశ భద్రతా ప్రయోజనాల్ని ఉల్లం ఘిస్తున్నట్లుగా ‘ఊహ’కు నిచ్చెన వేసి ఎదురు బొంకుగా ‘ప్రతిపక్షాలే తమ పార్టీ భద్రత కోసం అధికార పాలకపక్షాన్ని నిందిస్తున్నద’ని ఆరో పించుకోవటం ఆనవాయితీ అయిపోయింది. అయితే తాజాగా మోదీ ప్రభుత్వం ఆర్డినెన్సుతో చివరికి బీజేపీ పాలక సభ్యులైన పార్లమెంటు సభ్యులు కొందరు సహితం విభేదిస్తున్నారని వార్తలు వింటున్నాం. ఇంతకీ కేంద్ర నిఘా సంస్థలన్నీ మన దేశంలో అంత ‘స్వతంత్రం’గా నిష్పాక్షికంగా వ్యవహరించగల సంస్థలా అంటే అదీ అబద్ధమే అవు తుంది. అక్కడికీ పీవీ నరసింహారావు (కాంగ్రెస్) ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో అడ్వాణీ (బీజేపీ) ప్రభృతులకు సంబంధం ఉందన్న ‘జైన్ హవాలా’ కేసు దేశంలో సంచలన కేసుగా మారి, ఆ కేసు విచారణను నానా రకాలుగా తిప్పుతున్న సీబీఐ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు అనేక మార్లు ప్రశ్నించవలసి వచ్చిందని మరచిపోరాదు. ఆ సమయంలో ఆ కేసు విచారణలో పొంతనలేని వాదనలు వింటూ వచ్చిన సుప్రీం న్యాయ స్థానం ‘సీబీఐ ప్రధానమంత్రి ఆదేశాలకే కట్టుబడి విచారణ జరుపు తున్నట్టు వ్యవహరిస్తోంది. దీనికి అంగీకరించబోము. సీబీఐ సుప్రీం కోర్టుకి సహితం బద్ధురాలుగా ఉండాల’ని కోర్టు హెచ్చరించి, ఆ కేసును కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కి కూడా నివేదించాల్సి వచ్చింది. ఇలా, వలస పాలకుల కనుసన్నల్లో రూపొందిన నాటి ఢిల్లీ పోలీ సులు ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం కాంగ్రెస్ పాలకులు ఏర్పాటు చేసిన సీబీఐ సంస్థను ఇప్పటి బీజేపీ పాలకుల మాదిరే తమ పలుకులనే పలికే ‘చిలక’గా అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలపైన ప్రయోగించి లబ్ధి పొందుతూ రావటం నిత్యానుభవం. ఆ మార్గాన్నే బీజేపీ పాలకులూ ప్రజా వ్యతిరేక రాజకీయ ‘బ్రతుకుతెరువు’ కోసం వాటంగా వాడుకొం టున్నారు. బహుశా అందుకే సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) నిర్వాహకులపైన చర్యలకు కాలు దువ్వడానికి ముందు ఈ ఆర్డినెన్స్ ఉత్తర్వు అనే అసాధారణ నిర్ణయానికి ప్రభుత్వం’ పూనుకుం దని కొందరు బీజేపీ నేతలే వాపోయారు. నిజానికి ‘కూపీ’ చర్యల్లో భాగమైన ‘ఆధార్’ చట్టం (దీనికి పునాది రూ. 7,000 కోట్లకు పడగ లెత్తిన సమాచార సాంకేతిక నిపుణుడైన నీత్కాన్) చాటున దేశ పౌరుల వ్యక్తిగత గోప్యతకే చేటు తెచ్చింది కాబట్టి అది చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్న స్పృహను కూడా బీజేపీ పాలకులు కోల్పోయి, చివరి కిప్పుడు బాహాటంగా 10 రకాల నిఘా సంస్థలను పౌర స్వేచ్ఛకు, పలు ఎలెక్ట్రానిక్, మీడియా సమాచార మాధ్యమాలకు వ్యతిరేకంగా ఉపయో గించబోవటం– ఇక మనం ‘ప్రజాస్వామ్యం’ గురించి, పౌర స్వేచ్ఛ గురించి సామాజికులు చెప్పుకునే ‘గొప్ప’లు కట్టిపెట్టి క్రియాశీలమైన చైతన్యం వైపు ప్రయాణించడం అవసరమనిపించడం లేదా? అట్టే చూస్తే కేంద్ర పాలకులు సుప్రీంకోర్టు పౌరుల ‘గోప్యతా హక్కు’ను పరిరక్షిస్తూ చేసిన చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తుంగలో తొక్కి దేశ సమున్నత న్యాయస్థానాన్ని సహితం అవమానించినట్టే అయింది. ఇటీవల కాలంలో కోర్టు పరిధుల్ని గుర్తు చేస్తూ, ‘రాజ్యాంగం పాలకమండలి, శాసన వేదిక, న్యాయస్థానాల పేరిట విభజించి ఉంది కాబట్టి, ఆ పరిధి దాటకుండా మూడు విభాగాలూ కట్టుబాటులో ఉండా లని పాలకులు భావిస్తున్నారు. కానీ మిగతా రెండు విభాగాలకు (పాలనా వ్యవస్థ, శాసనవేదికలు) లేని ప్రత్యేక హక్కును భాష్యం చెప్పి వ్యాఖ్యానించి పాలనా వ్యవస్థను, శాసన వేదికను శాసించి మార్గ నిర్దేశం చేసే హక్కును రాజ్యాంగం న్యాయవ్యవస్థకు కల్పించిందని మరవరాదు. ఆ రాజ్యాంగ ఆదేశాన్ని ‘తూ.నా బొడ్డు’ అని కాంగ్రెస్, బీజేపీ పాలకులు తోసి వేయబట్టే ‘పిడుక్కి, బిచ్చానికీ’ ఒకే మంత్రంలాగా భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పాలకులు సమాచార ధారాస్రవంతిపైన, ‘ప్రపంచం నలుమూలలనుంచి వచ్చే భావాలను భారతదేశం స్వీకరించి’ ఎంపిక చేసుకునే స్వేచ్ఛను దేశ పౌరులకు వదలాలన్న ఋగ్వేద, గీతా సందే శాన్ని పాలకులు మరవరాదు. బహుశా ఇంత గందరగోళానికి దేశ పాలకులు కారకులు కావడానికి ఏది కారణం అయి ఉంటుంది? తమ నీడను తాము చూసుకుని భీతిల్లే విధంగా కళ్లముందే జరిగిన ‘ఎమర్జెన్సీ’ రోజులా? లేక గుజరాత్ ఊచకోతల ఫలితమా? ఢిల్లీలో పాతికేళ్లనాడు సిక్కులపై జరిగిన హరకిరా? పాలకులైనా, పాలితులైనా ‘యంబ్రహ్మ’గా అవతారమెత్తేదెప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోగల్గితే సమా ధానం అందకపోదు? ‘అయ్యకు రెండు గుణాలు తక్కువట– తనకు తోచదు ఇంకొకరు హితవు చెబితే వినడ’ట. అధికారం అనే ‘కైపు’లో ఉన్నవాళ్లకి ‘మంచి’ చెడుగా కన్పిస్తుంది. అసలివేమీ కాదు, నోట్ల రద్దువల్ల రైతులు, సామాన్య ప్రజలు, చిన్న, మధ్యతరగతి వర్తక వ్యాపార వర్గాలు బ్యాంకులతో నిత్య లావా దేవీలు జరుపుకునేవారు, విద్యాసంస్థలూ, విద్యార్థులూ డబ్బులు డ్రా చేసుకోవడానికి పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులతో పాటు ఏటీఎంలు కూడా ఖాళీ అయినందున తమ డబ్బుకోసం పడి గాపులు పడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, దేశ ఆర్థిక వ్యవస్థ లావాదేవీలే ఛిన్నాభిన్నమైనందున ఎదురైన తీవ్ర పరిస్థితివల్ల 2019 ఎన్నికల్లో పాలక పార్టీ ఓటమి అవకాశాన్ని ఊహించినందున ‘దింపు డుకళ్లం’ ఆశగా సోషల్ మీడియాపైన ఈ తాజా నిరంకుశ నిర్ణయానికి ఒడిగట్టిందా? రోగం పాలకులది, బాధ మాత్రం ప్రజలది!! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు, abkprasad2006@yahoo.co.in -
‘వ్యక్తిగత స్వేచ్ఛ’పై రాద్దాంతం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటర్ నుంచి వచ్చే ఏ సమాచారంపైనైనా నిఘా కొనసాగించి, దాన్ని మధ్యలో అడ్డుకోవడంతోపాటు సదరు సమాచారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేశంలోని పది ప్రభుత్వ సంస్థలకు అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర హోం శాఖ గురువారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌పైనా శుక్రవారం నాడు పార్లమెంట్లో తుపానే చెలరేగింది. స్వేచ్చా వ్యవస్థ స్వరూపమే సర్వ నాశనం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించగా, సుప్రీం కోర్టు సమర్థించిన రాజ్యాంగబద్ధ వ్యక్తిగత స్వేచ్ఛను ఈ నోటిఫికేషన్ హరిస్తోందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఘాటుగా విమర్శించారు. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొడవ చేయడంతో పార్లమెంట్ సమావేశం కూడా పలు సార్లు వాయిదా పడింది. (సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు) ఇక పార్లమెంట్ వెలుపల ఈ నోటిఫికేషన్‌ను పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, సైబర్ భద్రతా నిపుణులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కంప్యూటర్లోని ఎవరి సమాచారమైనా, అది ఎలాంటి సమాచారమైన నిఘావేసి, అడ్డుకొని, తస్కరించే అధికారాలు అధికారులకు ఇప్పటికే ఉన్నాయన్న విషయాన్ని మరచిపోతున్నారు. 2000 నాటి సమాచార సాంకేతిక చట్టంలోనే ఈ ప్రత్యేకాధికారాలను సంస్థలు లేదా అధికారులకు కల్పిస్తూ 2008లో అప్పటి యూపీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. నాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సీపీఎం అప్పుడు మౌనం వహించి ఇప్పుడు గోల చేయడం విడ్డూరమే. సమాచార సాంకేతిక చట్టంలోని 69 (1) సెక్షన్ ప్రకారం ‘దేశ సార్వభౌమా«ధికారానికి లేదా దేశ రక్షణకు లేదా రాష్ట్ర భద్రతకు ముప్పుందని భావించినట్లయితే, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం లేదా పాలనాపరమైన సంబంధాల కోసం అవసరమైతే, ఎలాంటి నేరాన్నైనా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని భావించినట్లయితే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిగల అధికారులు ఎవరి కంప్యూటర్ సమాచారంపైనైనా నిఘా పెట్టవచ్చు. ఆ సమాచారాన్ని మధ్యలోనే అడ్డుకొని, స్వాధీనం చేసుకోవచ్చు. అయితే దర్యాప్తు అధికారులు ఏ కారణంతోని సమాచారాన్ని సేకరిస్తున్నారో మాత్రం లిఖితపూర్వకంగా స్పష్టం చేయాల్సి ఉంటుంది’ అని చెబుతోంది చట్టం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం లేదా? మాటి మాటికి లేదా కేసుబై కేసుకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర హోం మంత్రి అరుణ్ జైట్లీ దేశంలోని ‘ది ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, క్యాబినెట్ సెక్రటేరియట్, జమ్మూ కశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసు కమిషనర్’లకు అధికారాలను కట్టబెట్టారు. ఈ సంస్థలకు చెందిన అధికారులకు సమాచారాన్ని సేకరించడంలో సహకరించడానికి ఎవరు నిరాకరించినా చట్ట ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారన్న హెచ్చరిక కూడా ఉంది. సమాచార సాంకేతిక చట్టంలోనే దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని సేకరించే వెసులుబాటు లేకపోయినట్లయితే నేడు అరుణ్ జైట్లీ జారీ చేసిన నోటిఫికేషనే చెల్లేదికాదు. ఇదంతా తెలిసే కాంగ్రెస్, సీపీఎం పార్టీలు రాద్ధాంతం చేయడం ఎందుకు? నిజంగా ఆ పార్టీలకు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా ‘వ్యక్తిగత గోప్యత’ భద్రతకు చట్టం తీసుకురావాలి. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది. అప్పుడు దొడ్డి దారిన కూడా వ్యక్తిగత గోప్యతకు ఎవరూ ఎసరు పెట్టలేరు! -
నిజనిర్ధారణ కూడా రహస్యమేనా?
తన భర్తను అన్యాయంగా బదిలీ చేశారనీ, సీఈఎల్ (సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్)లో అనేక అన్యా యాలు జరుగుతున్నాయని సుప్రియాకుమారి నాటి మంత్రి వైఎస్ చౌదరికి వినతిపత్రం సమర్పిం చారు. దానిపై ఏ చర్యలు తీసుకుకున్నదీ చెప్పాలని నిజనిర్ధారణ కమిటీ నివే దిక ప్రతి కావాలని, దానిపై వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా విభాగం తీసుకున్న చర్యలు వివరించా లని ఆమె అడిగారు. నివేదిక ప్రతిని, వివరాలను ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆర్టీఐ కింద అడిగితే ఈ నివేదిక ఇవ్వవలసి ఉంటుందని సీపీఐఓ సలహా ఇచ్చారు. ఆ నివేదిక ప్రతికి సంబం ధించిన దస్తావేజులున్న మరో శాస్త్రవేత్త ఇవ్వడానికి నిరాకరించారు. దానికి ఆయన ఎంచుకున్న మిష ప్రైవేటు సమాచారం అని. ఎవరి వ్యక్తిగత సమాచా రం? నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇస్తే ఎవరి ప్రైవసీ దెబ్బ తింటుందనే వివరణ లేదు. సీఈ ఎల్లో అవక తవకలపై విచారించిన ఆ కమిటీ ఏం తేల్చిందని అడిగితే, ఆ శాస్త్రవేత్త ఏమీ రుజువు కాలేదని జవా బిచ్చారు. ఇందులో దాచవలసింది ఏమీలేదని, పూర్తి సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారో కార ణాలు వివరించి, సమర్థించుకోవలసిన బాధ్యత ఆ శాస్త్రవేత్తపైన ఉందని మొదటి అప్పీలు అధికారి తన ఆదేశంలో వివరించారు. అయినా ఆ శాస్త్రవేత్త విన లేదు. ఆ దశలో కూడా సీపీఐఓ ఈ సమాచారం ఇవ్వాలని సూచించారు. అయినా శాస్త్రవేత్త ఇవ్వను పొమ్మన్నారు. రెండో అప్పీలును సమాచార కమిషన్ ముందుకు తెచ్చారు. ఈ నిజనిర్ధారణ నివేదికతో పాటు కొన్ని పత్రాలను సీఈఎల్ తమ న్యాయవాదికి ఇచ్చిందని, కనుక ఈ నివేదిక ప్రతి లాయర్ కిచ్చిన ప్రివిలేజ్ ప్రతి అవుతుందని కనుక ఇవ్వడానికి వీల్లే దని అన్నారు. కమిషన్ విచారణలో ఆయన మరో కొత్త కారణం తెరమీదకు తెచ్చారు. ఈ నివేదికలో వ్యాపార రహస్యాలున్నాయని, వాటిని వెల్లడిస్తే తమ సంస్థ పోటీలో దెబ్బతింటుందని, అలాంటి సమాచారం ఇవ్వకూడదని శాస్త్రవేత్త వాదించారు. సీఈఎల్లో అవకతవకలున్నాయని టెలికాం లైవ్ అనే పత్రికలో వ్యాసం వచ్చిందని, సీఏజీ(కాగ్) నివేదికలో కొన్ని అభ్యంతరాల ఆధారంగా ఆ వ్యాసంలో చేసిన విమర్శలు, ఆరోపణలపై విచారణ జరిపించి తీరాలని కోరారు. నిజనిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదిక సమాచార హక్కు చట్టం సెక్షన్ 2(ఎఫ్) కింద సమాచారం అనే నిర్వచనంలోకి ఖచ్చి తంగా వస్తుందని, ఆ నివేదికను దాచిపెట్టడం చట్ట వ్యతిరేకమని విమర్శించారు. ఇదివరకు మరో ఆర్టీఐ అప్పీలులో సీఐసీ ఈ నిజ నిర్ధారణ నివేదికలో కొన్ని భాగాలను దాచి మిగిలిన నివేదిక కాపీలను ఇవ్వ డానికి అనుమతించిందని డీమ్డ్ సీపీఐఓ శాస్త్రవేత్త అన్నారు. ఈ కేసులో కూడా పూర్తి నివేదిక ఇవ్వ నవసరం లేదని ఆయన తెలిపారు. మరోసారి సీపీఐఓ ఈ నివేదిక ఇవ్వాలని ఉత్తరం రాసినా ఈ శాస్త్రవేత్త ఇవ్వనందున ఆయనపై జరిమానా విధిం చాలని కోరారు. ఎవరి వ్యక్తిగత సమాచారం అందులో లేదని, అయినా ఎందుకు దాస్తున్నారని అడిగారు. మొత్తం దస్తావేజులను రాతపూర్వక వాదాలను పరిశీలిస్తే శాస్త్రవేత్త సమాచార నిరాకర ణకు ఏ ఆధారమూ కనిపించడం లేదని కమిషన్ భావించింది. ప్రతిసారి ఏదో ఒక సెక్షన్‌ను ఉదహ రించి సమాచారం ఇవ్వనంటున్నారేగాని అది వర్తి స్తుందో లేదో ఆలోచించడమే లేదని, సీపీఐఓ అధి కారి విచక్షణను ఉపయోగించకుండా నిర్ణయాలు తీసుకోవడం న్యాయంకాదని కమిషన్ వివరించింది. మొత్తం నివేదికను పరిశీలించి వాణిజ్య సంబం ధమైన అంశాలు నిజంగా పోటీని దెబ్బతీస్తే, వాటిని మినహాయించి మిగతా భాగం ఇవ్వాలని ఆదేశిం చింది. తర్వాత ఈ శాస్త్రవేత్త ఆ నివేదికలో చాలా ముఖ్య భాగాలను, మినహాయించి పనికి రాని భాగా లను ఇచ్చారని, అధికారుల పేరు రాగానే దానిపైన నలుపు సిరా పూసేశారని విమర్శించారు. దాంతో కమిషన్ మొత్తం నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. దానిలో వాణిజ్యపరంగా దాచవలసిన అంశాలేవీ కనిపించలేదు. పైగా, మొదటి అప్పీలు ఆధికారి ఆదేశాలను కూడా పాటించకుండా వదిలే యడం చట్ట వ్యతిరేకం. మొదటి అపెల్లేట్ అధికారి స్థానంలో ఉన్న శాస్త్రవేత్త ఈ నివేదిక మళ్లీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. ఆ తర్వాత నివేదిక ప్రతి ఇచ్చారు. ఇన్నాళ్లూ సమా చారం ఇవ్వకుండా అన్యాయంగా దాచినందుకు ఎందుకు శిక్ష విధించకూడదో కారణాలు వివరించా లనే నోటీసు ఇచ్చింది. దానికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో శాస్త్రవేత్తకు రూ. 5 వేల జరిమానా విధించాలని కమిషన్ ఆదేశించింది. (ఇఐఇ/ఈౖ ఐ ఖ/అ/2018/104889 కేసులో 13.9.2018న సీఐసీ ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్,professorsridhar@gmail.com -
ద్వంద్వ ప్రమాణాలొద్దు.. ప్రైవసే ముద్దు
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారతీయులు గోప్యతను పట్టించుకోరు. పేద వారికి గోప్యత అవసరం లేదు’ అనే హేతుబద్ధంగా కనిపించే వాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది సుప్రీం కోర్టు సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు. గోప్యత కూడా ఓ ప్రాథమిక హక్కే అంటూ సుప్రీం కోర్టులోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తీర్పును జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వెలువరించారు. అయినప్పటికీ దేశంలో మూక హత్యలకు కారణమవుతున్న నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వాట్సాప్‌కు కళ్లెం వేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వాట్సాప్ సీఈవోతో మంగళవారం సమావేశమైన ఏ వార్తను ఎవరు పుట్టించారో తమకు తెలియాలని, అందుకు వీలు కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందజేయాలని కోరారు. ఆలోచించుకొని చెబుతామన్న వాట్సాప్ సీఈవో ప్రభుత్వ విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నట్లు గురువారం ప్రకటించడం ముదాహం. సోషల్ మీడియాలో డేటా సెక్యూరిటీకి సంబంధించి శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ బిల్–2018’ ముసాయిదాను గత జూలై నెలలో ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే అది ప్రజల గోప్యతా హక్కును పటిష్టం చేయడానికి బదులు ‘ఆధార్ కార్డు’ను పరిరక్షించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆధార్ కార్డుల వల్ల వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతింటుందని ఆరోపిస్తూ ఆరేళ్ల క్రితం ఓ పిటిషన్ దాఖలు చేయడం, ఈ ఆరేళ్ల కాలంలో 30 పిటిషన్లు దాఖలవడం, వాటన్నింటిని కలిపి సుప్రీం కోర్టు విచారించి తీర్పును వాయిదా వేయడం తెల్సిందే. ఆ తీర్పు కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు సానుకూలంగానే వస్తుందని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో విధిగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసేలా చట్టం తీసుకరావాలని, నకిలీ వార్తలకు ఆ ఫిర్యాదుల విభాగం అధికారినే బాధ్యులను చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. నేడు దేశంలో నకిలీ వార్తలు మూక హత్యలకు కారణం అవడం దురదృష్టకరమని, అంత మాత్రాన ఆ పేరుతో ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించాల్సిన అవసరం లేదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మూక హత్యలకు పాల్పడుతున్న వారిని పాలకపక్ష నాయకులే ఓ పక్క ప్రోత్సహిస్తూ మరోపక్క మూక హత్యలకు కారణమవుతున్న నకిలీ వార్తల సృష్టికర్తలను పట్టుకునేందుకు తమ ప్రయత్నమంతా అని వాదించడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమేనని వారు విమర్శిస్తున్నారు. -
బీఫ్ బ్యాన్పై కూడా తేల్చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని స్పష్టమైన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై కూడా ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు కూడా. అయితే 24 గంటలు గడవక ముందే ఓ కీలక అంశంపై పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్పై సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఈ అంశంపై ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యత తీర్పు ప్రభావం ఉంటుందని చెప్పటం వ్యాఖ్యానించటం విశేషం. ఓ వ్యక్తి ఎలాంటి బట్టలు వేసుకోవాలో. ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని గురువారం తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ గోమాంసం తినటంపై ప్రభుత్వం బ్యాన్ విధించటం సరికాదంటూ ఇందిర వాదన వినిపించారు. వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఏకే సిక్రీ మరియు అశోక్ భూషణ్‌లు ఇది వ్యక్తిగత గోప్యత(ప్రాథమిక హక్కు) కిందకే వస్తుందని చెబుతూ తదుపరి వాదనను రెండు వారాలపాటు వాయిదా వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్ ఆదేశాలను గతేడాది బాంబే హైకోర్టు తప్పుబడుతూ కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది కూడా. -
కోకా సుబ్బారావు అప్పుడే చెప్పారు!
దేశంలో గోప్యత హక్కు అంశం మొదటిసారి 1954లోనే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎంపీ శర్మ వర్సెస్ సతీష్‌చంద్ర కేసుగా రికార్డయిన ఈ కేసులో గోప్యత అంశాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు..అమెరికాలో మాదిరిగా ఇక్కడ గోప్యత హక్కు ప్రసాదించడం కుదరదని తేల్చిచెప్పింది. 1952 జూన్‌లో దివాలాతీసిన దాల్మియా జైన్ ఎయిర్వేస్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన రికార్డులు, ఫైళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ సదరు సంస్థ 1954లో సుప్రీం కోర్టుకెక్కింది. ప్రైవేటు ఆస్తులకు సంబంధించి ఇలాంటి సోదాలు జరిపి, దస్తావేజులు స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని దాల్మియా ఎయిర్వేస్ వాదించింది. కేసును విచారించిన అత్యున్నత ధర్మాసనం అమెరికా రాజ్యాంగంలోని నాలుగో సవరణ మాదిరిగా భారత రాజ్యాంగంలో గోప్యత హక్కుపై ప్రత్యేక నిబంధనలేవీ లేవని తీర్పు ఇచ్చింది. అయితే గోప్యత హక్కు గురించి రాజ్యాంగంలో ప్రత్యేకించి చెప్పనప్పటికీ ఇది వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో అంతర్భాగమని 1964లో ఓ కేసుకు సంబంధించి మెజారిటీ అభిప్రాయంతో విభేదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోకా సుబ్బారావు స్పష్టం చేశారు. తర్వాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సుబ్బారావు ఇలా తొలిసారి ఈ విషయంపై సూటిగా మాట్లాడిన జడ్జీగా చరిత్రకెక్కారు. తాను నేరస్తుడనే అనుమానంతో పోలీసులు ఎప్పుడుపడితే అప్పుడు తనను ఇంటి నుంచి బలవంతంగా తీసుకుపోవడంపై ఖరక్‌సింగ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ పోలీస్ రెగ్యులేషన్ చట్టాన్ని సవాలు చేస్తూ 1963లో సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని ఆరుగురు జడ్జీలు కూడా వ్యక్తిగత గోప్యతను హక్కుగా పరిగణించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా మెజారిటీ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పుతో విభేదించిన జస్టిస్ కోకా సుబ్బారావు గోప్యత హక్కుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
తండ్రి తీర్పును సరిదిద్దిన కుమారుడు
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కుమారుడు గతంలో తన తండ్రి ఇచ్చిన తీర్పునే తప్పుబట్టినట్లయింది. 1975లో అత్యవసర స్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులను పక్కనబెట్టారు. 1976లో సుప్రీంకోర్టు ‘ఏడీఎం జబల్పూర్’ కేసులో తీర్పునిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత ప్రాథమిక హక్కులు కావంది. నాటి ధర్మాసనంలో జస్టిస్ వైవీ చంద్రచూడ్ అనే న్యాయమూర్తి ఉన్నారు. తాజాగా తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఆయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యుడిగా ఉన్నారు. 1976లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తీవ్రమైన దోషాలు ఉన్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ‘ఆ తీర్పు దోషాలతో కూడింది. మానవ హక్కుల నుంచి జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛలను విడదీయలేము. ఏ నాగరిక రాజ్యమూ జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించేలా ఆలోచించదు’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. దీనిపై ఓ సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానిస్తూ...దోషాలతో కూడిన తీర్పును తండ్రి ఇవ్వగా కొడుకు దానిని సరిదిద్దినట్లైందన్నారు. -
ఈ తీర్పు ప్రభావం తీవ్రం..!
పలు చట్టాల మూలాలను స్పృశించే అవకాశం వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పు... దేశంలోని చట్టాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏది గోప్యత... ఏది కాదు అనే దాన్ని విస్పష్టంగా నిర్వచించాల్సి వస్తుంది. ఇప్పటివరకు గోప్యత విషయంలో ప్రభుత్వానికి, పౌరులకు మధ్యే ఎక్కువగా వివాదాలు నెలకొన్నాయి. ఇప్పుడిది ప్రాథమిక హక్కుగా సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పడంతో నేటి డిజిటల్ యుగంలో ప్రైవేటు సంస్థలు, పౌరులకు మధ్య లెక్కకు మిక్కిలి న్యాయ వివాదాలు నెలకొనే ప్రమాదముంది. గోప్యతకు భంగం కలిగిందనే కేసులు పెద్ద సంఖ్యలో వస్తాయి. గురువారం సుప్రీం తీర్పుతో... పెళ్లి, కుటుంబ వివరాలు, లైంగిక ఆసక్తులు... ఇలాంటి వివరాలన్నింటికీ రాజ్యాంగ రక్షణ ఏర్పడింది. క్రెడిట్ కార్డులు, ఖాతాల కోసం బ్యాంకులతో పంచుకున్న వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు సదరు సంస్థలు గోప్యంగా ఉంచాల్సిందే. సామాజిక మాధ్యమాలకు ఇచ్చిన వివరాల విషయంలోనూ ఆ సంస్థలు గోప్యతను పాటించాల్సిందే. వ్యాపారాన్ని పెంచుకోవడానికి డాటాను నమ్ముకుంటున్న కంపెనీలకు, డాటాను అమ్ముకుంటున్న వారికీ ఇది పెద్ద ఎదురుదెబ్బ. తన వివరాలను మీకెవరు ఇచ్చారంటూ... కంపెనీలను కోర్డుకు ఈడ్చే శక్తిని సుప్రీం తీర్పు సామాన్యుడికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పు ప్రధానంగా వేటిపై ప్రభావం చూపుతుందనేది ఓసారి పరిశీలిద్దాం... ఆధార్ కేసు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కోసం వేలిముద్రలు, ఐరిస్ తీసుకోవడం, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్లు తదితర వ్యక్తిగత వివరాలను సేకరించడాన్ని సవాల్ చేస్తూ... పలు కేసులు సుప్రీంకోర్టు ముందున్నాయి. వ్యక్తి శరీరంపై తనకే పూర్తి హక్కులుంటాయని, వేలిముద్రలు, ఐరిస్ ఇవ్వడానికి నిరాకరించే హక్కు పౌరులకు ఉంటుందనేది పిటిషనర్ల వాదన. అలాగే తమ వ్యక్తిగత సమాచారం ఏ మేరకు భద్రమనేది వీరి ఆందోళన. ఐటీ రిటర్న్ సహా పలు ప్రభుత్వ పథకాలకు, సేవలకు ఆధార్‌తో ముడిపెట్టడాన్ని కూడా సవాల్ చేస్తూ పిటిషన్లు ఉన్నాయి. ఆధార్‌కార్డు కోసం సమర్పించిన వివరాలు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతున్నాయని, అవి వాణిజ్య అవసరాల కోసం ఈ వివరాలను వాడుకుంటున్నాయి కాబట్టి... ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని పిటిషనర్ల వాదన. బయోమెట్రిక్ వివరాలు బహిర్గతమైతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని, వేలిముద్రలను కృత్రిమంగా తయారుచేసి... ఆ గ్లవ్స్‌తో నేరాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏమిటని పిటిషనర్లు ప్రశ్నించారు. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా తొమ్మిది మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పినందున... ఆధార్ కేసుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. గోప్యత ఇప్పుడు ప్రాథమిక హక్కు కాబట్టి ఆధార్ విధానం రాజ్యాంగానికి లోబడి ఉందా? లేదా? అనేది ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేలుస్తుంది. సెక్షన్ 377 భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తుంది. గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు తేల్చిచెప్పినందున ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్) గ్రూపులు సెక్షన్ 377ను సవాల్ చేస్తాయి. ఇద్దరు మేజర్ల పరస్పర అంగీకారంతో ఒక గదిలో జరిగేదాన్ని ఎలా నేరంగా పరిగణిస్తారని, ఇది తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని వీరి వాదన. ఎలాంటి లైంగిక వాంఛలు ఉన్నాయనే ఆధారంగా సెక్షన్ 377 సమాజంలోని కొందరి పట్ల వివక్ష చూపుతోందని గతంలోనే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఈ సెక్షన్‌ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ... అది కోర్టు పని కాదని, పార్లమెంటు చేయాలని చెప్పింది. వ్యక్తిగత గోప్యత హక్కుగా మారినపుడు... స్వలింగ సంపర్కనేరానికి ఎవరినైనా అరెస్టు చేసి అభియోగాలు మోపడం కూడా సాధ్యమయ్యే పనికాదు. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని పోలీసులను కోర్టుకీడ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్షన్ 377 నిలబడదని నిపుణుల అభిప్రాయం. మారిటల్ రేప్ భార్య సమ్మతి, ఇష్టం లేకుండా సంభోగానికి పాల్పడితే... పాశ్చాత్య దేశాల్లో దాన్ని రేప్‌గానే పరిగణిస్తున్నారు. అయితే భారత్‌లో మాత్రం ఇది నేరం కాదు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ వచ్చే సోమవారం ఢిల్లీ హైకోర్టు ముందుకు రానుంది. గోప్యత హక్కుకు రాజ్యాంగబద్ధత రావడం... స్త్రీ శరీరంపై ఆమెకే పూర్తి హక్కులుంటాయనే వాదనను బలపరుస్తుందని నిపుణుల అభిప్రాయం. డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు జాతీయ, ప్రాంతీయ స్థాయిలో పౌరుల జన్యు చిత్రపటాల (డీఎన్ఏ)తో డాటా బ్యాంకును ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. పలు కేసుల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. 2007 నుంచి పలుమార్లు ముసాయిదా బిల్లులో మార్పు చేర్పులు చోటుచేసుకున్నాయి. 2017 జూలైలో తాజా ముసాయిదాను లా కమిషన్ రూపొందించింది. గోప్యత, సమాచార భద్రత, శాంపిల్స్ రక్షణ, డీఎన్ఏ సమాచారంలో కచ్చితత్వం, ఎలా ఉపయోగిస్తారు, డీఎన్ఏ సమాచార మార్పిడి ఎలా ఉంటుంది, లోపభూయిష్ట సమాచారాన్ని తొలగించడం... తదితర అంశాలపై బిల్లులో స్పష్టత లేదు. చట్టసభలకే వీటిని వదిలేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అయిన నేపథ్యంలో ప్రతి పౌరుడి జన్యు చిత్రపటాన్ని భద్రపరిచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు అంత సులభంగా వెలుగు చూడకపోవచ్చు. వాట్సాప్ డాటా షేరింగ్ సామాజిక మాధ్యమమైన వాట్సాప్ తమ ఖాతాదారుల (సభ్యులు) వివరాలను మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌తో పంచుకుంటోంది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తాము వాట్సాప్‌కు మాత్రమే తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చామని, మరొకరితో దీన్ని పంచుకోవడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని వాదించారు. దాంతో కొత్త ప్రైవసీ విధానాన్ని తీసుకొస్తామని వాట్సాప్ చెప్పగా హైకోర్టు అంగీకరించింది. దీన్ని పిటిషన్‌దారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గోప్యత ప్రాథమిక హక్కు అయిన నేపథ్యంలో వాట్సాప్‌కు ఇబ్బందులు తప్పవు. అలాగే ఇతర సామాజిక మాధ్యమాలు కూడా గోప్యత విషయంలో భారత చట్టాలకు లోబడి పనిచేయాల్సి వస్తుంది. చాట్ హిస్టరీని సామాజిక మాధ్యమ సంస్థలు స్టోర్ చేయవచ్చా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. సెర్చ్ హిస్టరీ సంగతి? మనం గూగుల్‌లో దేనిగురించైనా వెదికితే మన సెర్చ్ హిస్టరీని గూగుల్ స్టోర్ చేస్తోంది. మన ఆసక్తులేమిటో గుర్తించి మన ఐపీ అడ్రస్‌కు మన అభిరుచులకు తగినట్లుగా యాడ్స్‌ను పోస్ట్ చేస్తోంది. మనం ఏ సైటును ఓపెన్ చేసినా మన ఆసక్తులకు తగ్గట్టు∙యాడ్స్ వస్తాయి. ఇది గూగుల్‌కు అతిపెద్ద ఆదాయవనరు. తన సెర్చ్ హిస్టరీని వాణిజ్య అవసరాలకు వాడుకుంటూ గూగుల్ తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందని ఎవరైనా కోర్టుకు ఎక్కితే? ఇలాంటి లెక్కలేనన్ని ప్రశ్నలకు రేప్పొద్దున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు వెతకాల్సి ఉంటుంది. అబార్షన్ ‘పిండాన్ని మోసి బిడ్డను కనాలా, గర్భస్రావం చేయించుకోవాలా అనేది మహిళకుండాల్సిన స్వేచ్ఛ. ఇది కూడా రైట్ టు ప్రైవసీ కిందకు వస్తుంది’ అని చలమేశ్వర్ అన్నారు. మన ప్రస్తుత చట్టాల ప్రకారం గర్భం దాల్చిన 20 వారాల తర్వాత అబార్షన్‌కు చట్టాలు అంగీకరించవు. సదరు గర్భం వల్ల తల్లి ప్రాణానికి ముప్పుందని డాక్టర్ల బృందం సర్టిఫై చేస్తే మాత్రం మినహాయింపు ఉంటుంది. అత్యాచార బాధితురాళ్లు, పది పన్నెండేళ్ల వయసులో అసలు జరుగుతున్నదేమిటో కూడా తెలియని పసివయసులో ఈ నిబంధన కారణంగా తల్లులు కావాల్సి వస్తోంది. ఇటీవలే ఓ పదేళ్ల అత్యాచార బాధితురాలిని అనారోగ్యం కాబట్టి ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పి తీసుకెళ్లి కాన్పు జరిపించారు. చాలాకాలంగా భారతదేశంలో అబార్షన్ చట్టాలను మార్చాలనే డిమాండ్ ఉంది. జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యలు చట్టంలో మార్పు కోరుతున్న సంస్థల డిమాండ్లకు ఊతమిస్తాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గోప్యత ప్రాథమిక హక్కే
♦ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛలో గోప్యత అంతర్భాగం ♦ ఆర్టికల్ 21, రాజ్యాంగంలోని మూడో భాగం ఇదే చెబుతున్నాయి ♦ 9 మంది సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక, ఏకగ్రీవ తీర్పు ♦ దీనిపై గతంలో వెలువరించిన తీర్పుల రద్దు ♦ సంస్కృతిలో బహుళత్వాన్ని గోప్యత ప్రతిఫలిస్తుందని వ్యాఖ్య ♦ ఆధార్‌పై ప్రత్యేక భద్రతావ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్రానికి సూచన ♦ సుప్రీం తీర్పును స్వాగతించిన కేంద్రం, న్యాయనిపుణులు భారతీయుల మౌలిక జీవన విధానంపై విస్తృత ప్రభావం చూపగల చరిత్రాత్మక తీర్పును గురువారం సుప్రీంకోర్టు వెలువరించింది. వ్యక్తిగత గోప్యత(ప్రైవసీ) ప్రాథమిక హక్కేనని తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో వ్యక్తిగత గోప్యత కూడా విడదీయలేని భాగమేనని.. రాజ్యాంగంలోని 3వ భాగం, ఆర్టికల్ 21ల్లో పేర్కొన్న జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల్లో గోప్యత కూడా అంతర్భాగమని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అయితే, మిగతా ప్రాథమిక హక్కుల్లా.. ఇది నిరపేక్ష హక్కు కాదని, దీనికి పరిమితులు, నియంత్రణలుంటాయని వివరణ ఇచ్చింది. భారతీయుల ఆహార అలవాట్లు, లైంగిక విధానాలు, సామాజిక నిబంధనలు, అమల్లో ఉన్న పలు చట్టాలు, తదితర కీలక అంశాలపై ప్రభావం చూపనున్న ఈ తీర్పును పార్టీలకతీతంగా స్వాగతించారు. న్యూఢిల్లీ: భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచే విషయంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. రాజ్యాంగ నియమాల ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న గోప్యత ప్రాథమిక హక్కు కాదనే నిర్ణయాన్ని కొట్టివేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, మూడో భాగం ప్రకారం గోప్యత అనేది.. ప్రజల జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల్లో అంతర్గతంగా సమ్మిళితమై ఉంటుంది’ అని పేర్కొంది. గోప్యత.. వ్యక్తిగత గౌరవానికి రాజ్యాంగ మూలమని స్పష్టం చేసింది. వివిధ సంక్షేమ పథకాల లాభాలను అందుకునేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 547 పేజీల తీర్పును వెలువరించింది. అయితే.. తాము గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అనే అంశానికే పరిమితమయ్యామని.. ఆధార్ వల్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందా లేదా అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనమే విచారిస్తుందని స్పష్టం చేసింది. ఆధార్ వివరాలను కాపాడేందుకు ప్రత్యేక భద్రతావ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్రానికి సూచించింది. కాగా సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోపాటుగా సోలీ సొరాబ్జీ వంటి న్యాయ నిపుణుల స్వాగతించారు. ‘ఏ ప్రాథమిక హక్కు కూడా సంపూర్ణం కాదు. ప్రతి హక్కూ పరిమితులు, నియంత్రణలతో కూడుకున్నదే’ అని సోరాబ్జీ పేర్కొన్నారు. పాత తీర్పులు రద్దు: సీజేఐ ఖేహర్ తీర్పు అమలు భాగాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ చదివి వినిపించారు. గతంలో ఎంపీ శర్మ (1952), ఖరక్ సింగ్ (1960) కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను రద్దుచేసినట్లు వెల్లడించారు. వ్యక్తిగత గౌరవం, ప్రజల మధ్య సమానత్వం, స్వేచ్ఛగా జీవించాలని కోరుకోవటం భారత రాజ్యాంగ మూల స్తంభాల వంటివి. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలను రాజ్యాంగం సృష్టించలేదు. ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా, అవిభాజ్యంగా ఉండే అంశాలను రాజ్యాంగం గుర్తించింది. గోప్యత రాజ్యాంగం పరిరక్షించే హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించటం, వ్యక్తిగత స్వేచ్ఛనుంచే గోప్యత పుట్టుకొచ్చి ంది. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ, గౌరవంలోనూ గోప్యత అంతర్భాగమే’ అని తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లు ఈ తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో ఉన్నారు. ఈ తొమ్మిది మంది గతంలో సుప్రీంకోర్టు రెండు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ‘గోప్యతను కాపాడటం రాజ్యాంగ బాధ్యత కాద’నే నిర్ణయాన్ని ఏకగ్రీవంగా కొట్టేశారు. కోర్టు హాల్లో ఉత్కంఠ కేసు విచారణ సందర్భంగా మూడు వారాల్లో ఆరు రోజుల పాటు సుప్రీంకోర్టులో గోప్యతకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అనే అంశంపై ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో కోర్టు హాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అరవింద్ దతార్, కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, ఆనంద్ గ్రోవర్, సీఏ సుందరం, రాకేశ్ ద్వివేదీ వంటి సీనియర్ న్యాయవాదులు తీర్పు కోసం ఎదురుచూశారు. పిటిషనర్లలో ఒకరైన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కేఎస్ పుట్టస్వామి, మెగసెసె అవార్డు గ్రహీత శాంతా సిన్హా తదితరులు ఆధార్ ప్రజల గోప్యత హక్కును హరిస్తుందని వాదించిన సంగతి తెలిసిందే. ముందు గోప్యత.. తర్వాత ఆధార్! జూలై 7న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు పిటిషనర్లు ఆధార్‌పై తమ వాదనలు వినిపించారు. అయితే ఆధార్‌పై సమస్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే నిర్ణయం తీసుకుని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తారని నాడు కోర్టు పేర్కొంది. అనంతరం దీనిపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని సీజేఐ ఖేహర్ ఏర్పాటుచేశారు. అయితే, వాదనల సందర్భంగా అసలు గోప్యత రాజ్యాంగ ప్రకారం ప్రాథమిక హక్కేనా కాదా? అనే అంశాన్ని తేల్చేందుకు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలని బెంచ్ సూచించింది. అయితే.. ఖరక్ సింగ్ (1960), ఎంపీ శర్మ (1950) కేసుల్లో ‘గోప్యత’పై సుప్రీంకోర్టు నిర్ణయాలను పున:పరిశీలించాలన్న నిర్ణయంతో సీజేఐ జస్టిస్ ఖేహర్.. 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై విచారణ జరిపిన ఈ ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తూ.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ డొమైన్స్‌లో ఉంచటం ద్వారా ఆ సమాచారం తప్పుగా వినియోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక యుగంలో గోప్యతను కాపాడటం అంత సులువేం కాదని అభిప్రాయపడింది. గోప్యత సంపూర్ణమైన హక్కు కాదని.. దీనిపై కొన్ని న్యాయపరమైన నియంత్రణలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని కేంద్రం తన వాదనలను వినిపించింది. గోప్యత ఎంతమాత్రమూ ప్రాథమిక హక్కు కాదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, పేద ప్రజలకుండే జీవించే హక్కు, కూడు, గూడు హక్కుల కన్నా గోప్యత హక్కు గొప్పదేం కాదని కేంద్రం పేర్కొంది. విచారణ సాగిందిలా.. జూలై 7: ఆధార్‌ను పలు పథకాలకు అనుసంధానించడంపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుందని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. జూలై 12: ఆధార్ గోప్యతపై విచారణకు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్‌ను ఏర్పాటు చేస్తూ సీజేఐ జస్టిస్ ఖేహర్ నిర్ణయం తీసుకున్నారు. జూలై 18: ఈ ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అన్న విషయాన్ని నిర్ణయించేందుకు 9 మందితో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ ఫాలీ నారిమన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఏర్పాటైంది. జూలై 19: వ్యక్తిగత గోప్యత అన్నది నిరపేక్ష హక్కు కాదని..దాన్ని నియంత్రించవచ్చని సుప్రీం అభిప్రాయపడింది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు కాదని కేంద్రం వాదించింది. జూలై 26: గోప్యత హక్కుకు అనుకూలంగా కర్ణాటక, పశ్చిమబెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. జూలై 26: వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే అందుకు సంబంధించిన అన్ని పాƇ్శా్వలను ప్రాథమిక హక్కు పరిధిలో చేర్చలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై 27: గోప్యత అన్నది స్వతంత్ర హక్కు కాదని, అది కేవలం భావన మాత్రమేనని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు విన్నవించింది. ఆగస్టు 1: ప్రజా బాహుళ్యంలో ఉన్న పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించడానికి మరింత విస్తృతమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీం అభిప్రాయపడింది. ఆగస్టు 2: ప్రస్తుత సాంకేతిక యుగంలో గోప్యత అన్నది ఓడిపోతున్న యుద్ధంగా మారిందన్న అత్యున్నత ధర్మాసనం, తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 24: రాజ్యాంగం ప్రకారం గోప్యత అన్నది ప్రాథమిక హక్కేనని సుప్రీం చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. గోప్యత అంటే! వ్యక్తిగత అన్యోన్యత, కుటుంబ జీవితం, వివాహం, సంతానం, ఇల్లు, లింగ నేపథ్యం వంటి అంశాలన్నీ గోప్యత కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ‘తన జీవితం ఎలా ఉండాలో కోరుకోవటం గోప్యత అవుతుంది. భిన్నత్వాన్ని కాపాడుతూ.. మన సంస్కృతిలోని బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని గోప్యత సూచిస్తుంది. గోప్యతపై న్యాయపరమైన అంచనాలు సన్నిహితం నుంచి వ్యక్తిగతంలో, వ్యక్తిగతం నుంచి బహిరంగ అంశాల్లో వేర్వేరుగా ఉంటాయి. అయితే బహిరంగ వేదికపై వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకుండా చేయటం చాలా ముఖ్యం’ అని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థ కావాలి రాజ్యాంగంలో సాధారణ, ప్రాథమిక హక్కులంటూ వేర్వేరుగా ఉండవన్న ప్రభుత్వ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అయితే..ప్రభుత్వానికి మరో అవకాశాన్ని కల్పిస్తూ.. ‘ఆధునిక యుగంలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు పటిష్టమైన వ్యవస్థను నిర్మించండి. ఇది ప్రజల వ్యక్తిగత ప్రయోజనాలను, ప్రభుత్వం న్యాయపరమైన అవసరాలను సమతుల్యం చేసేలా ఉండాలి. జాతీయ భద్రత, నేరాలను తగ్గించటం, సృజనాత్మకతను ప్రోత్సహించటం, సామాజిక సంక్షేమ పథకాల ఫలితాలు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవటమే ప్రభుత్వ అవసరం కావాలి’ అని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తుల అభిప్రాయాలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల తరఫున కూడా జస్టిస్ చంద్రచూడ్ ఈ తీర్పు రాశారు. ‘రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల నుంచి గోప్యత హక్కు ఉద్భవిస్తుంది. ఓ వ్యక్తి స్వతంత్రతను గోప్యత కాపాడుతుంది. ఆ వ్యక్తి జీవితంలోని ముఖ్య ఘట్టాలను నియంత్రిచుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. అయితే ఇతర ప్రాథమిక హక్కుల్లాగా ఇది సంపూర్ణమైన హక్కు కాదు. సమాచార సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలి. రాజ్యాంగం.. అది అమల్లోకి వచ్చిన రోజుల్లో ఎలా ఉందో అలానే మిగిలిపోకూడదు. సవాళ్లను ఎదుర్కొనేందుకు కాలానికి, అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగం తప్పక పరిణామం చెందాలి. 70 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికి సాంకేతికతపరంగా ఎంతో మార్పు వచ్చింది. రాజ్యాంగం మూల విలువల ఆధారంగానే భవిష్యత్తు తరాలకు సరిపోయేలా మారుతుండాలి. అలాగే అసాధారణ లైంగిక ధోరణి కారణంగా ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గానికి గోప్యత హక్కును నిరాకరించరాదు. వ్యక్తుల లైంగిక అభిలాషల ఆధారంగా వివక్ష చూపిస్తే వారి వ్యక్తిత్వం తీవ్రంగా దెబ్బతింటుంది. ఎల్జీబీటీలు తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణలు గోప్యతతో పాటు వ్యక్తిగత లైంగిక అంశాలకు కూడా రక్షణ ఇస్తున్నాయి. ప్రస్తుతం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377 విషయమై సుప్రీం కోర్టులోని ఓ బెంచ్ విచారణ జరుపుతున్నందున, దాని రాజ్యాంగ చెల్లుబాటుపై సదరు ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుంది. జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ నజీర్ ‘నేటి డిజిటల్ యుగంలో పిల్లల గోప్యతను పరిరక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. పిల్లలు సాంకేతికత, సామాజిక మాధ్యమాలకు బాగా అలవాటుపడుతున్నారు. ఏ అంటే యాపిల్, బీ అంటే బ్లూటూత్, సీ అంటే చాట్ అని నేర్చుకుంటున్నారు. తెలిసీ తెలియక చేసే తప్పులకు వారు బలికాకుండా చూడాలి. గోప్యత హక్కును ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యక్తులు, సంస్థల నుంచి కాపాడుకోవాలి. సాంకేతికత విస్తృతంగా అభివృద్ధి చెందడంతో ప్రభుత్వం మన వ్యక్తిగత జీవితంలోకి చొరబడేందుకు అవకాశాలు పెరిగాయి. ఓ వ్యక్తి తన ఇంట్లోకి రావడానికి ఒకరిని అనుమతించడం అంటే ఎవరైనా లోనికి రావొచ్చని అర్థం కాదు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కే. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ఇతరులు వ్యక్తుల ఆంతరంగిక వ్యవహారాల్లోకి చొరబడకుండా అది కాపాడుతుంది.’ – జస్టిస్ కిషన్ కౌల్ ‘ఓ రోగి తనకు జీవితాంతం కొనసాగాల్సిన వైద్య చికిత్సను వద్దని చెప్పి జీవితాన్ని ముగించడం అనేది గోప్యత హక్కు కిందకు వస్తుంది. బిడ్డను కనాలా, గర్భస్రావం చేయించుకోవాలా అనేది సదరు గర్భిణి గోప్యత హక్కు పరిధిలో ఉంటుంది. ప్రజలు ఏం తినాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎవరితో కలసి ఉండాలి అనే విషయాలను ప్రభుత్వం నిర్దేశించడాన్ని ఎవరూ ఒప్పుకోరు. గోప్యత కావాలనుకుంటారు’ – జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ‘నా అభిప్రాయంలో ఏ వ్యక్తికైనా గోప్యత అనేది పుట్టుకతోనే సహజంగా లభించే హక్కే. ఆ వ్యక్తి చివరి శ్వాస వరకు గోప్యత హక్కు ఉంటుంది. అది వాస్తవానికి వ్యక్తి నుంచి వేరు చేయలేని, మార్చలేని హక్కు. మనిషితోపాటే పుట్టి, మనిషితోపాటే పోతుంది. అయితే ఈ హక్కుపై ప్రభుత్వాలు సామాజిక, నైతిక కోణంలో ప్రజాహితార్థం కొన్ని న్యాయమైన పరిమితులు విధించొచ్చు’ – జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ‘దేశంలో ప్రభుత్వాలు వస్తూ, పోతున్నప్పటికీ ప్రాథమిక హక్కులు శాశ్వతంగా ఉంటాయి. పాలక పార్టీలు పార్లమెంటులో తమకున్న మెజారిటీతో చట్టాలు చేయగలవు. అవసరం లేదనుకుంటే చట్టాలను రద్దు చేయగలవు. కానీ తాము ఎన్నుకున్న ప్రభుత్వాలతో సంబంధం లేకుండా రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కుల్ని పౌరులు అనుభవించవచ్చు. ఎందుకంటే ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగా ఉన్న గోప్యత హక్కు శాశ్వతమైనది. ఒకవేళ ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగకరంగా మారితే సుప్రీం కోర్టు వాటిని చెల్లనివిగా ప్రకటిస్తుంది’ – జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ‘పురాణాల్లోనూ వ్యక్తిగత గోప్యత ప్రస్తావన ఉంది. స్త్రీని పరపురుషుడు చూడకూడదని రామాయణంలో ఉంది. అలాగే ఇస్లాం ప్రకారం ఇతరుల ఇళ్లలోకి తొంగిచూడటం నిషిద్ధం. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా జీవించాలని బైబిల్ చెబుతుంది. ప్రాథమిక హక్కులను పొందాలంటే ముందుగా గోప్యత హక్కు ఉండాల్సిందే. మానవుల స్వేచ్ఛ నుంచి వ్యక్తిగత గోప్యత హక్కును విడదీయలేం’ – జస్టిస్ ఎస్ఏ బాబ్డే -
సుప్రీం తీర్పు: ఆధార్ కాన్సెప్ట్‌లో లోపం లేదు!
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ పథకంలో ఎలాంటి లోపం లేదని, వ్యక్తిగత గోప్యతకు ఇది విరుద్ధం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వమే వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా ఆధార్‌ను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 'ప్రైవసీ హక్కుకు అనుగుణంగా ఆధార్ పథకాన్ని తీసుకొచ్చాం. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టికల్ 21కి ఇచ్చిన నిర్వచనమే వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిస్తోంది. ఆధార్ కాన్సెప్ట్‌లో ఎలాంటి లోపమూ లేదు. ఆధార్‌ను ఒక సాధనంగా వాడుకోవాలన్న, దుర్వినియోగం చేయాలన్న మోదీ ప్రభుత్వం ఆలోచనలోనే లోపముంది' అని చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. సుప్రీంకోర్టు నిర్ణయం ఫాసిస్టు శక్తులకు ఎదురుదెబ్బ అని, నిఘా వేసి అణచివేయాలన్న బీజేపీ భావజాలానికి ఇది తిరస్కృతి అని ఆయన ట్వీట్ చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజాబాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని గతంలో పేర్కొంది. వ్యక్తిగత గోప్యత కూడా రాజ్యంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) కిందకు వస్తుందని సుప్రీంకోర్టు తాజాగా చరిత్రాత్మక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆధార్ పథకంపై నీలినీడలు కమ్ముకునే అవకాశముంది. ఆదాయపన్ను, పాన్ కార్డు సహా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం వంటి నిర్ణయాలు ప్రభావితం కానున్నాయి. -
గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
- తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోపత్య ప్రాథమిక హక్కేనంటూ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. వ్యక్తిగత గోప్యత కూడా రాజ్యంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) కిందకు వస్తుందని చెప్పింది. గోప్యతపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సీజేఐ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జే చలమేశ్వర్, రోహింటన్ నారీమన్, ఆర్కే అగర్వాల్, సంజయ్ కిషన్ కౌల్, ఎస్ఏ బొబ్డే, ఎస్ అబ్దుల్ నజీర్, ఏఎమ్ సప్రేలు ఉన్నారు. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగష్టు 2న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆగస్టు 2న పేర్కొంది. తీర్పు ప్రభావం ఏంటి? ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలను తెలుపుతుంది కనుక సుప్రీం కోర్టు తీర్పుతో ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును జతచేయాలా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఆధార్ వివరాల ద్వారా వ్యక్తులపై నిఘా పెట్టడం సాంకేతికంగా సాధ్యం కాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సుప్రీం కోర్టుకు గతంలో చెప్పింది. ఈ పీటముడిపై సంగ్ధితను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై విచారణ జరిపి తీర్పు చెప్పనుంది. -
'డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు ఉండాల్సిందే'
న్యూఢిల్లీ: డ్యాన్స్ బార్లలో క్లోజ్ సర్క్యుట్ టెలివిజన్ (సీసీ టీవీ) కెమెరాలను ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంది. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల డ్యాన్స్ బార్లలో అశీల నృత్యాలను నిరోధించడమే కాకుండా, డ్యాన్స్ గర్ల్స్‌కు వ్యక్తిగత భద్రత కూడా కల్పించడానికి వీలు ఉంటుందని తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు పబిక్ ప్రదేశాలే అయినందున వీటిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల ఎవరి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కాబోదని న్యాయస్థానానికి నివేదించింది. డ్యాన్స్ బార్ల లైసెన్సుల విషయంలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. ఈ వ్యవహారంలో సమీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. అయినప్పటికీ లైసెన్సుల జారీలో నిబంధనలను సడలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిరాకరించింది. డ్యాన్స్ బార్లలలో సీసీటీవీ లైవ్ ఫుటెజ్‌ను పోలీసులకు అనుసంధానించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన సమాధానాన్ని తెలిపింది. 'డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాల్సిన అవసరముంది. శాంతిభద్రతలు, ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని చూడాలి. ఏదైనా అవాంఛిత ఘటన జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాల వల్ల డ్యాన్స్ బార్ గర్ల్స్/కళాకారులకు వ్యక్తిగత భద్రత కల్పించే అవకాశముంటుంది. పోలీసులు సత్వరమే సంఘటన స్థలికి చేరుకునే అవకాశముంటుంది' అని సుప్రీంకోర్టుకు సమర్పించిన తన ప్రతిస్పందనలో ప్రభుత్వం తెలిపింది.