సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటర్ నుంచి వచ్చే ఏ సమాచారంపైనైనా నిఘా కొనసాగించి, దాన్ని మధ్యలో అడ్డుకోవడంతోపాటు సదరు సమాచారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేశంలోని పది ప్రభుత్వ సంస్థలకు అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర హోం శాఖ గురువారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌పైనా శుక్రవారం నాడు పార్లమెంట్‌లో తుపానే చెలరేగింది. స్వేచ్చా వ్యవస్థ స్వరూపమే సర్వ నాశనం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించగా, సుప్రీం కోర్టు సమర్థించిన రాజ్యాంగబద్ధ వ్యక్తిగత స్వేచ్ఛను ఈ నోటిఫికేషన్ హరిస్తోందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఘాటుగా విమర్శించారు. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొడవ చేయడంతో పార్లమెంట్ సమావేశం కూడా పలు సార్లు వాయిదా పడింది. (సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు)
ఇక పార్లమెంట్ వెలుపల ఈ నోటిఫికేషన్‌ను పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, సైబర్ భద్రతా నిపుణులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కంప్యూటర్‌లోని ఎవరి సమాచారమైనా, అది ఎలాంటి సమాచారమైన నిఘావేసి, అడ్డుకొని, తస్కరించే అధికారాలు అధికారులకు ఇప్పటికే ఉన్నాయన్న విషయాన్ని మరచిపోతున్నారు. 2000 నాటి సమాచార సాంకేతిక చట్టంలోనే ఈ ప్రత్యేకాధికారాలను సంస్థలు లేదా అధికారులకు కల్పిస్తూ 2008లో అప్పటి యూపీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. నాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సీపీఎం అప్పుడు మౌనం వహించి ఇప్పుడు గోల చేయడం విడ్డూరమే.
సమాచార సాంకేతిక చట్టంలోని 69 (1) సెక్షన్ ప్రకారం ‘దేశ సార్వభౌమా«ధికారానికి లేదా దేశ రక్షణకు లేదా రాష్ట్ర భద్రతకు ముప్పుందని భావించినట్లయితే, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం లేదా పాలనాపరమైన సంబంధాల కోసం అవసరమైతే, ఎలాంటి నేరాన్నైనా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని భావించినట్లయితే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిగల అధికారులు ఎవరి కంప్యూటర్ సమాచారంపైనైనా నిఘా పెట్టవచ్చు. ఆ సమాచారాన్ని మధ్యలోనే అడ్డుకొని, స్వాధీనం చేసుకోవచ్చు. అయితే దర్యాప్తు అధికారులు ఏ కారణంతోని సమాచారాన్ని సేకరిస్తున్నారో మాత్రం లిఖితపూర్వకంగా స్పష్టం చేయాల్సి ఉంటుంది’ అని చెబుతోంది చట్టం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం లేదా?
మాటి మాటికి లేదా కేసుబై కేసుకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర హోం మంత్రి అరుణ్ జైట్లీ దేశంలోని ‘ది ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, క్యాబినెట్ సెక్రటేరియట్, జమ్మూ కశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసు కమిషనర్’లకు అధికారాలను కట్టబెట్టారు. ఈ సంస్థలకు చెందిన అధికారులకు సమాచారాన్ని సేకరించడంలో సహకరించడానికి ఎవరు నిరాకరించినా చట్ట ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారన్న హెచ్చరిక కూడా ఉంది.
సమాచార సాంకేతిక చట్టంలోనే దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని సేకరించే వెసులుబాటు లేకపోయినట్లయితే నేడు అరుణ్ జైట్లీ జారీ చేసిన నోటిఫికేషనే చెల్లేదికాదు. ఇదంతా తెలిసే కాంగ్రెస్, సీపీఎం పార్టీలు రాద్ధాంతం చేయడం ఎందుకు? నిజంగా ఆ పార్టీలకు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా ‘వ్యక్తిగత గోప్యత’ భద్రతకు చట్టం తీసుకురావాలి. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది. అప్పుడు దొడ్డి దారిన కూడా వ్యక్తిగత గోప్యతకు ఎవరూ ఎసరు పెట్టలేరు!
Comments
Please login to add a commentAdd a comment