'డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు ఉండాల్సిందే'
న్యూఢిల్లీ: డ్యాన్స్ బార్లలో క్లోజ్ సర్క్యుట్ టెలివిజన్ (సీసీ టీవీ) కెమెరాలను ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంది. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల డ్యాన్స్ బార్లలో అశీల నృత్యాలను నిరోధించడమే కాకుండా, డ్యాన్స్ గర్ల్స్‌కు వ్యక్తిగత భద్రత కూడా కల్పించడానికి వీలు ఉంటుందని తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు పబిక్ ప్రదేశాలే అయినందున వీటిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల ఎవరి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కాబోదని న్యాయస్థానానికి నివేదించింది.
డ్యాన్స్ బార్ల లైసెన్సుల విషయంలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. ఈ వ్యవహారంలో సమీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. అయినప్పటికీ లైసెన్సుల జారీలో నిబంధనలను సడలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిరాకరించింది. డ్యాన్స్ బార్లలలో సీసీటీవీ లైవ్ ఫుటెజ్‌ను పోలీసులకు అనుసంధానించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన సమాధానాన్ని తెలిపింది.
'డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాల్సిన అవసరముంది. శాంతిభద్రతలు, ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని చూడాలి. ఏదైనా అవాంఛిత ఘటన జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాల వల్ల డ్యాన్స్ బార్ గర్ల్స్/కళాకారులకు వ్యక్తిగత భద్రత కల్పించే అవకాశముంటుంది. పోలీసులు సత్వరమే సంఘటన స్థలికి చేరుకునే అవకాశముంటుంది' అని సుప్రీంకోర్టుకు సమర్పించిన తన ప్రతిస్పందనలో ప్రభుత్వం తెలిపింది.