dance bars
-
డ్యాన్స్‌బార్లపై పోలీసు దాడులు
బనశంకరి : చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా డ్యాన్స్ బార్లను నిర్వహిస్తున్న రెండు డ్యాన్స్ బార్లపై శనివారం రాత్రి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.4.25 లక్షల నగదు స్వాధీనం చేసుకుని 78 మంది మహిళలను కాపాడారు. అశోకనగర, కలాసీపాళ్య పోలీస్స్టేషన్లు పరిధిలో చట్టానికి విరుద్దంగా నిర్వహిస్తున్నట్లు సీసీబీ పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా శనివారం రాత్రి పోలీసులు అశోకనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రిగేడ్రోడ్డులో ఉన్న బ్రిగేడ్ హౌస్, బ్రిగేడ్నైట్–6 బార్ అండ్ రెస్టారెంట్, కలాసీపాళ్యలో ఉన్న నైట్‌క్వీన్ బార్ అండ్రెస్టారెంట్పై దాడులు చేశారు. ఈ సమయంలో బ్రీగేడ్Š నైట్–6 బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్ అశోక్‌శెట్టి, క్యాషియర్ సచిన్, నైట్‌క్వీన్ బార్ అండ్ రెస్టారెంట్ పీ.మోహన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్యాన్స్‌బార్ నిర్వాహకులకోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అదనపు పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్ తెలిపారు. -
డిస్కోలు,ఆర్కెస్ట్రాలకు సుప్రీంకోర్టు అనుమతి
-
మహారాష్ట్రలో మళ్లీ డాన్స్ బార్లు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో డాన్స్ బార్లు తిరిగి తెరుచుకునేందుకు మార్గం సుగమమైంది. వాటి పని విధానం, లైసెన్సుల మంజూరుపై కఠిన ఆంక్షలు విధిస్తూ 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని పలు నిబంధనల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొన్ని షరతులతో డాన్స్ బార్లు తెరుచుకునేందుకు గురువారం అనుమతిచ్చింది. డాన్స్ బార్లపై నియంత్రణలు ఉండొచ్చు కానీ పూర్తి నిషేధం అమలుచేయొద్దని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటరు దూరంలోపు డాన్స్ బార్లు ఏర్పాటుచేయొద్దన్న నిబంధనను కోర్టు తోసిపుచ్చింది. ముంబై లాంటి మహానగరాల్లో అనువైన చోట్ల స్థలం దొరకడం కష్టమేనని, కిలోమీటర్ నిబంధనను అమలుచేయలేమని స్పష్టతనిచ్చింది. పార్టీకి వచ్చిన వారు డాన్సర్లకు టిప్పులు ఇచ్చేందుకు అంగీకరించిన కోర్టు..వారిపై కరెన్సీ నోట్లు చల్లేందుకు నిరాకరించింది. డాన్స్ బార్లలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలన్న నిబంధనను కొట్టివేస్తూ..అలాంటి ఏర్పాట్ల వల్ల డాన్సర్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని పేర్కొంది. సంపూర్ణ నిషేధం వద్దు.. ‘2005 నుంచి మహారాష్ట్రలో ఒక్క డాన్స్ బార్‌కు కూడా లైసెన్స్ ఇవ్వలేదు. అలా జరగకూడదు. ఈ విషయంలో నియంత్రణలు ఉండొచ్చు కానీ సంపూర్ణ నిషేధం సరికాదు’ అని ధర్మాసనం పేర్కొంది. నైతిక ప్రమాణాలు కాలంతో పాటే మారతాయని, నైతికత పేరిట ప్రభుత్వం సామాజిక నియంత్రణ చెలాయించకూడదని సూచించింది. ఇకపై డాన్స్ బార్ల కోసం వచ్చే దరఖాస్తులను ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో అంగీకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. 2016 నాటి చట్టాన్ని సవాలుచేస్తూ హోటల్, రెస్టారెంట్ యజమానులు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టును తన తీర్పును గతేడాది ఆగస్టులోనే రిజర్వు చేసింది. గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల్ని బేఖాతరు చేసేందుకే మహారాష్ట్ర ప్రభుత్వం..డాన్స్ బార్ల లైసెన్సింగ్‌కు కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టం తెచ్చిందని పిటిషన్‌దారులు ఆరోపించారు. ప్రభుత్వ వాదన బలహీనం: ఎన్సీపీ బార్ యాజమాన్యాల అసోసియేషన్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయిందని ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆరోపించింది. అందుకే కేసులో ప్రభుత్వ వాదన చాలా బలహీనంగా ఉందని దుయ్యబట్టింది. రాష్ట్రంలో డాన్స్ బార్లు తిరిగి తెరుచుకోకుండా సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బార్ల నియంత్రణ చట్టాన్ని లోపరహితంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని శివసేన మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర హోం మంత్రి రంజిత్ పాటిల్ స్పందిస్తూ..డాన్స్ బార్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరగనీయమని హెచ్చరించారు. షరతులతో డాన్స్ బార్లు తిరిగి తెరుచుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడం పట్ల సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. బార్ డాన్సర్ల హక్కుల కోసం పోరాడుతున్న భారతీయ బార్ గరŠల్స్ యూనియన్ అధ్యక్షురాలు వర్ష కాలె..సుప్రీంకోర్టు తీర్పును గొప్ప విజయంగా అభివర్ణించారు. తాజా తీర్పు ప్రగతిశీలమైనదని మాజీ బ్యూరోక్రాట్, హక్కుల కార్యకర్త అభా సింగ్ అన్నారు. కోర్టు మొదటి నుంచీ నృత్యాన్ని ఒక వృత్తిగానే పరిగణించిందని, కానీ రాష్ట్ర సర్కారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి మహిళల జీవించే హక్కుకు భంగం వాటిల్లిందన్నారు. తీర్పు ముఖ్యాంశాలు ► డాన్సర్లకు టిప్పులు ఇవ్వొచ్చు కానీ నోట్లు వెదజల్లరాదు ► బార్ రూమ్, డాన్స్ ఫ్లోర్ మధ్య అడ్డుతెర తప్పనిసరి కాదు ► డాన్స్ బార్లలో సీసీటీవీలు అమర్చొద్దు ► సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్యే పనిచేయాలి ► విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలకు కిలోమీటరు దూరంలో బార్ డాన్స్‌లు ఉండొద్దన్న నిబంధన అమలు అసాధ్యం ► చివరి పదేళ్లుగా నేరచరిత్ర లేని వారికే లైసెన్స్ మంజూరు చేయాలని పేర్కొనడం నిర్దిష్టంగా లేదు. అది అధికారుల విచక్షణకు వదిలేసినట్లుగా ఉంది. నైట్ ‘లైఫ్’... డాన్స్ బార్స్! మెట్రో నైట్ లైఫ్‌లో డాన్స్ బార్స్ విడదీయలేని ఓ భాగం. ముంబై మహానగర సంస్కృతిలోకి చేరిన ఈ డాన్స్ బార్లు, వాటిలో చిందులు వేసే డాన్సర్ల చుట్టూ ఎన్నో విమర్శలు, మరెన్నో విషాదాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 1980 తొలినాళ్లలో ముంబైకి 75 కి.మీ. దూరంలో ఉన్న ఖలాల్పూర్లో బేవాచ్ అన్న పేరుతో మొట్టమొదటిసారిగా ఈ డాన్స్బార్ ప్రారంభమైంది. ఇక్కడ డాన్స్ చేసేందుకు 500–600 మంది డాన్సర్లను ముంబై, థానేల నుంచి బస్సుల్లో తీసుకొని వచ్చేవారు. రాత్రంతా తాగుతూ, అమ్మాయిలు డ్యాన్స్‌లు చేస్తుంటే వారిపై కరెన్సీ నోట్లు విసురుతూ ఎంజాయ్ చేసే ఈ కల్చర్ కార్చిచ్చులా మహారాష్ట్ర అంతటా వ్యాపించింది. కొన్ని బార్లను అధికారికంగా నిర్వహిస్తే, అనధికారికంగా నిర్వహించే వాటికి లెక్కే లేదు. ఈ బార్లలో చిందులేసే డాన్సర్లు కొందరు కోటికి పడగలెత్తారు. మరికొందరు గౌరవప్రద జీవితాన్ని కూడా నోచుకోక పూట గడవడానికి ఇబ్బంది పడ్డవారూ ఉన్నారు. తరన్నూమ్ అనే డాన్సర్ ఎంత సంపాదించారంటే, ఆదాయ పన్ను శాఖ ఆమె ఇంటిపై దాడులు కూడా చేసింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్ టబూ ప్రధాన పాత్రధారిగా చాందినీబార్ అనే సినిమాను బార్ డాన్సర్ ఇతివృత్తంతో రూపొందించారు. టబూ ఈ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సైతం కైవసం చేసుకున్నారు. 14 ఏళ్లుగా వివాదం డాన్స్ బార్లతో యువత నాశనమవుతున్నారని, ఆ బార్ల మాటున చీకటి వ్యాపారం జరుగుతోందని, అమ్మాయిలు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి వెళ్తున్నారనే∙కారణాలతో 2005లో డాన్స్ బార్లను మహారాష్ట్ర సర్కారు నిషేధించింది. దీంతో కొన్ని వేలమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. డాన్స్ బార్ల యజమానులు, డాన్స్ గర్ల్స్ కోర్టుకెక్కారు. 2006లో బొంబాయి హైకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిషేధాన్ని కొనసాగించింది. 2013లో డాన్స్ బార్లపై నిషేధాన్ని కొట్టేసింది. దాంతో, 2014 జూన్‌లో తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్ బార్లపై కొన్ని ఆంక్షలు విధిస్తూ చట్టానికి సవరణలు చేసింది. దానిపై బార్ల యజమానులు, డాన్స్ గర్ల్స్ మళ్లీ కోర్టుకు ఎక్కడంతో సుప్రీంకోర్టు బార్ల నిషేధంపై 2015, అక్టోబర్ 15న స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆంక్షలలో కొన్నింటిని సమర్థిస్తూ, మరికొన్నింటిని వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పింది. -
డ్యాన్స్ బార్లపై ఆంక్షలు ఎత్తివేత
న్యూడిల్లీ: మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించింది. హోటళ్లు, రెస్టారెంట్లలలో డ్యాన్స్‌లను నిషేధిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను కోర్టు తోసిపుచ్చింది. డ్యాన్స్ బార్లకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఆత్మగౌరం పేరిట 2016లో ఓ చట్టాన్ని చేసింది. దీంతో డిస్కో టెక్కులకు లైసెన్స్ విషయంలో నిషేధం విధించినట్టయింది. ఈ అంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను తప్పుబట్టింది. హోటళ్లు, రెస్టారెంట్లలో డిస్కోలు, ఆర్కెస్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారిచేసింది. డ్యాన్స్ బార్లలో మద్యం సేవించేందుకు కూడా కోర్టు అనుమతించింది. కానీ డ్యాన్సర్లపై డబ్బు వెదజల్లడంపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాకుండా ప్రార్థన మందిరాలకు కిలో మీటర్ దూరంలో డ్యాన్స్ బార్లను ఏర్పాటు చేయరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిబంధన.. ముంబైలాంటి మహానగరాల్లో సాధ్యపడదని తెలిపింది. బార్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని.. అలా చేయడం ప్రైవసీకి భంగం కలిగించడమేనని కోర్టు పేర్కొంది. డ్యాన్సు చేసేవారికి, బార్ ఓనర్లకు మధ్య తప్పకుండా కాంట్రాక్టు ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా రాత్రి 11.30 గంటల వరకు మాత్రమే డ్యాన్స్ బార్లను తెరచి ఉంచాలని స్పష్టం చేసింది. -
మసక మసక చీకటిలో..
మసక మసక చీకటి, ఇంపుగా సంగీతం, హుక్కా పొగలు, మద్యం గ్లాసుల గలగలల మధ్య యువతుల నృత్యాలు. గతంలో ఉన్న లైవ్ బ్యాండ్ కుసంస్కృతి మళ్లీ జడలు విప్పుతోంది. అనేక రకాల అక్రమాలకు నెలవైన ఇలాంటి వినోద గృహాల వల్ల నాయకులు, ఖాకీలు తదితరులకు కాసు వర్షం కురుస్తోంటే అరికట్టేదెవరనే ప్రశ్న వినిపిస్తోంది. బెంగళూరు: నగరంలో మళ్లీ డ్యాన్స్ బార్లు ప్రత్యక్షమవుతున్నాయి. రిక్రియేషన్ క్లబ్బుల ముసుగులో జూదానికి ఆలవాలమైన స్కిల్ గేమ్, వీడియో గేమ్‌లు పుట్టగొడు గుల్లా వెలుస్తున్నాయి. వీటిలో అనధికారిక డ్యాన్స్ బార్లను వెంటనే మూసి వేయించాల్సిందిగా నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ గత వారంలో అన్ని పోలీసు స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాజకీయ పలుకుబడితో బార్ల యాజమాన్యాలు వీటిని నడిపిస్తున్నాయి. గతంలో గట్టి చర్యలు గత ప్రభుత్వంలో అప్పటి హోంమంత్రి రామలింగారెడ్డి ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా పోలీసు శాఖకు స్పష్టంచేశారు. ఫలితంగా డ్యాన్స్ బార్లు, స్కిల్ గేమ్, వీడియో గేమ్‌లతో పాటు హుక్కా బార్లు, గంజాయి విక్రయాలను పోలీసులు సమర్థంగా అడ్డుకున్నారు. శాసనసభ ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వం కాస్త ఆపద్ధర్మంగా మారడంతో అక్రమార్కుల సాయంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎవరి పాత్ర ఎంతుంది? ఈ నేపథ్యంలో కేవలం అక్రమ డ్యాన్స్ బార్ల భరతం పట్టాల్సిందిగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే సాకుతో ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులపై వేటు పడబోతోందని సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ బార్ల వ్యవహారంలో ఉన్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని, కనుక వారిపై కూడా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఎటువంటి స్కిల్ గేమ్‌లు లేదా డ్యాన్స్ బార్లను నిర్వహించే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. కనుక అలాంటి అధికారులపై కూడా చర్యలు చేపడితే, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు భవిష్యత్తులో కూడా ఆస్కారం ఉండబోదని వారు చెబుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎలాంటి డ్యాన్స్ బార్లకైనా కమిషనరేట్ స్థాయి అధికారి మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఇప్పటికే అక్రమంగా నడుస్తున్న అలాంటి బార్లకు ఆ స్థాయి అధికారుల ఆశీస్సులు తప్పక ఉంటాయనేది దిగువ స్థాయి సిబ్బంది వాదన. డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల వద్ద అలాంటి అక్రమ బార్ల సమాచారం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రస్తుతం నగరంలోని మెజిస్టిక్, ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, కోరమంగల, ఇందిరా నగర, వైట్ఫీల్డ్లలో అక్రమ డ్యాన్స్ బార్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పలువురు లేడీస్ బార్ల పేరిట సుప్రీం కోర్టు ఆదేశాలను చూపిస్తూ, నగర పోలీసు కమిషనర్ నుంచి లైసెన్సులు పొందారు. గాంధీ బజారు, బ్యాంకు కాలనీ, కోరమంగల, ఇందిరా నగర, శేషాద్రిపురం సహా రిక్రియేషన్ క్లబ్ పేరిట నగరంలో 200కు పైగా కేంద్రాలు నడుస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో మహిళలతో నృత్యాలు, హుక్కా వినియోగాలు వంటివి సాగుతుంటాయి. సంపన్న యువత, అధికాదాయ వ్యక్తులు వీటిలో జల్సాలు సాగిస్తుంటారు. వారిని అనుకరించలని మధ్యతరగతి మనుషులూ ప్రయత్నించి అప్పుల పాలవుతుంటారు. ఈ బార్ల చాటును జరిగే అక్రమాలూ అనేకమనే విమర్శలున్నాయి. ప్రస్తుతం వీటిని అరికట్టేందుకు సరైన విధానమంటూ లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
అక్కడ 500, 1000 నోట్లు చెల్లుబాటు
ముంబై: ప్రస్తుతం 1000 రూపాయల నోటును బ్యాంకు ఖాతాలో జమచేసుకోవడం మినహా ఎక్కడా చెల్లుబాటు కాదు. ఇక పాత 500 రూపాయల నోటు పరిస్థితి కూడా దాదాపు ఇంతే. కాకపోతే పరిమితంగా అత్యవసర సేవలు, సేవా రంగాల్లో చెల్లించేందుకు మినహాయింపునిచ్చారు. పాత నోట్లు వాణిజ్యపరంగా చెల్లుబాటు కావడం లేదు. కాగా మహారాష్ట్ర, ముంబైలలోని డాన్స్ బార్స్‌లో మాత్రం ఈ నోట్లు చెలామణి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక చాలా రంగాలపై ప్రభావం పడగా, డాన్స్ బార్స్ మాత్రం మునుపటిలా వ్యాపారం సాగుతోంది. ముంబై సహా మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో అక్రమంగా డాన్స్ బార్స్ నడుపుతున్నారు. వీటికి తరచూ రాజకీయ నాయకులు, గ్యాంగ్స్టర్స్, వ్యాపారవేత్తలు వస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా బ్లాక్ మనీ చెలామణి అవుతుంటుంది. మహిళా డాన్సర్లపై పాత నోట్లను విసురుతుంటారని జాతీయ మీడియా వెల్లడించింది. అంతేగాక నకిలీ నోట్లు మారుస్తుంటారు. నోట్ల మార్పిడిలో డాన్సర్లది కీలక పాత్రని, డాన్స్ బార్స్ ఆపరేటర్లకూ ప్రమేయముందని పేర్కొంది. -
వెలవెలబోతున్న డ్యాన్స్ బార్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం వివిధ వ్యాపార సంస్థలతో పాటు ముంబైలోని డ్యాన్స్ బార్లపై కూడా పడింది. రద్దయిన మొదటి, రెండు రోజులు అంతగా ప్రభావం చూపలేదు. కానీ గత మూడు రోజులుగా కస్టమర్లు లేక డ్యాన్స్ బార్లతో పాటు సాధారణ బార్లు వెలవెలబోతున్నాయి. అరకొరగా కొందరు వస్తున్నా.. బార్లలో డ్యాన్స్ గర్ల్స్ పై నోట్లు వెదజల్లే వాళ్లు కరువయ్యారు. దీంతో వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అదేవిధంగా కస్టమర్లు లేక బార్లలో పనిచేసే వెయిటర్లకు అదనపు ఆదాయం పోయింది. బార్ యజమానులు వెయిటర్లకు నెలకు చెల్లించే జీతాల కంటే కస్టమర్లు ఇచ్చే టిప్పు దాదాపు 50 రేట్లు ఎక్కువ ఉంటుంది. దీంతో వారిలో కూడా నిరుత్సాహం నెలకొంది. రోజువారి ఖర్చులకు జేబులో నుంచి తీయాల్సి వస్తోందంటున్నారు. ముంబైలో సుమారు 250 బార్లు ఉన్నాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా రోజు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు కస్టమర్లు వస్తున్నారు. దీంతో చేసేదిలేక బార్లు మూసివేయడమే ఉత్తమమని అనేక మంది బార్ యజమానులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బార్లు మూసివేశారు. నగరంలో దాదాపు అందరి పరిస్థితి.. ఎకౌంట్లో డబ్బులుండి కూడా చేబులు ఖాళీగానే ఉన్నాయనే విధంగా ఉందని ఆహార్ బార్ అధ్యక్షుడు భారత్ ఠాకూర్ అన్నారు. కౌంటర్లో చిల్లర డబ్బులు లేక బార్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక కస్టమర్లవద్ద కొత్తగా వచ్చిన రూ.500, రూ.2000 నోట్లు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నామని అన్నారు. కొందరు మధ్యం సేవించి, భోజనం తిన్న తరువాత బిల్లు చెల్లించే సమయంలో రద్దయిన పాత నోట్లు ఇస్తున్నారు. స్వీకరించేందుకు నిరాకరిస్తే తాగిన మత్తులో గొడవపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు నగరంలోని అనేక బార్లలో దర్శనమిస్తున్నాయని ఠాకూర్ తెలిపారు. దీంతో చేసేది లేక బార్లు మూసేయాల్సి వస్తుందన్నారు. -
డాన్స్ బార్లకు ఊరట
ముంబై: మహారాష్ట్రలోని డాన్స్ బార్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇప్పటివరకు పాటిస్తున్న పాత నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనల అమలు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. లైసెన్స్ కలిగిన డాన్స్ బార్లు పాత నిబంధనలనే కొనసాగించాలని స్పష్టం చేసింది. డాన్స్ బార్లను రాత్రి 11.30లకు మూసి వేయాలని, మద్యం విక్రయించరాదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సర్కారు నిబంధనలను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్ లతో కూడిన బెంచ్ తప్పుబట్టింది. డాన్స్ బార్లలో మద్యం విక్రయించకూడదనుకుంటే రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించింది. బార్, డాన్స్ లైసెన్స్ కలిగినవారిని మద్యం అమ్మకూడదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. మహిళల గౌరవం కాపాడానికి ప్రయత్నం చేయాలని కోరింది. డాన్స్ బార్లలో సీసీ కెమెరాలు పెడితే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. -
సుప్రీం తీర్పుపై సీఎం ఆశ్చర్యం
ముంబై: ఎనిమిది డాన్సు బార్లకు రెండురోజుల్లో అనుమతులు ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారును సుప్రీం కోర్టు ఆదేశించడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో కొత్త నిబంధనలు తెచ్చిందని నిబంధనలకు లోబడి ఉన్న బార్లకే అనుమతులు ఇస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ముంబైలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాన్స్ బార్లపై రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించిందని, నిబంధనల ప్రకారమే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో మరోసారి తమ వాదనలు వినిపిస్తామని ఆయన తెలిపారు. నేర చరితుల జాబితాలోని వారిని బార్లలో నియమించడంపై బారు యాజమాన్యాలు హామీ ఇవ్వనందువల్లనే 8 బార్లకు అనుమతి నిరాకరించామని ప్రభుత్వం కోర్టులో తెలిపిన విషయం తెలిసిందే. -
అడుక్కోవడం కంటే డాన్సులే నయం: సుప్రీం
వీధుల్లో అడుక్కోవడం కంటే.. డాన్స్ బార్లలో నృత్యం చేయడం ఎంతో నయమని సుప్రీంకోర్టు చెప్పింది. డాన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంపై మండిపడింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దని హెచ్చరించింది. విద్యాసంస్థలకు కిలోమీటరు దూరంలో డాన్స్ బార్లు తెరవడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కూడా సుప్రీం విమర్శించింది. డాన్స్ అనేది ఒక వృత్తి అని, ఒకవేళ అందులో అసభ్యత ఉంటే.. అప్పుడు చట్టబద్ధమైన హక్కు కోల్పోతుందని.. అయితే ప్రభుత్వం దానిపై నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు గానీ నిషేధించకూడదని స్పష్టం చేసింది. వీధుల్లో అడుక్కోవడం లేదా ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలో చేరడం కంటే డాన్స్ బార్లలో నృత్యం చేయడమే నయమని సుప్రీం తెలిపింది. డాన్స్ బార్ల నియంత్రణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ ఏప్రిల్ 12న ఒక ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అందులో నిబంధనలను డాన్స్ బార్ల ఆపరేటర్లు, యజమానులు ఉల్లంఘిస్తే అందుకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25వేల వరకు జరిమానా కూడా పడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం డాన్స్ బార్లు సాయంత్రం 6 గంటల నుంచి 11.30 వరకు మాత్రమే పనిచేయాలి, అలాగే విద్యాసంస్థలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కనీసం ఒక కిలోమీటరు దూరంలో ఉండాలి. డాన్సులు చేసే ప్రాంతానికి దగ్గర్లో మద్యం సరఫరా చేయకూడదు. ఈ కొత్త నిబంధనలపై ఆపరేటర్లు, యజమానులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. -
'డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు ఉండాల్సిందే'
న్యూఢిల్లీ: డ్యాన్స్ బార్లలో క్లోజ్ సర్క్యుట్ టెలివిజన్ (సీసీ టీవీ) కెమెరాలను ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంది. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల డ్యాన్స్ బార్లలో అశీల నృత్యాలను నిరోధించడమే కాకుండా, డ్యాన్స్ గర్ల్స్‌కు వ్యక్తిగత భద్రత కూడా కల్పించడానికి వీలు ఉంటుందని తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు పబిక్ ప్రదేశాలే అయినందున వీటిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల ఎవరి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కాబోదని న్యాయస్థానానికి నివేదించింది. డ్యాన్స్ బార్ల లైసెన్సుల విషయంలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. ఈ వ్యవహారంలో సమీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. అయినప్పటికీ లైసెన్సుల జారీలో నిబంధనలను సడలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిరాకరించింది. డ్యాన్స్ బార్లలలో సీసీటీవీ లైవ్ ఫుటెజ్‌ను పోలీసులకు అనుసంధానించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన సమాధానాన్ని తెలిపింది. 'డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాల్సిన అవసరముంది. శాంతిభద్రతలు, ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని చూడాలి. ఏదైనా అవాంఛిత ఘటన జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాల వల్ల డ్యాన్స్ బార్ గర్ల్స్/కళాకారులకు వ్యక్తిగత భద్రత కల్పించే అవకాశముంటుంది. పోలీసులు సత్వరమే సంఘటన స్థలికి చేరుకునే అవకాశముంటుంది' అని సుప్రీంకోర్టుకు సమర్పించిన తన ప్రతిస్పందనలో ప్రభుత్వం తెలిపింది. -
డాన్స్ బార్లపై ఆంక్షలు వద్దు: సుప్రీం
హోటళ్లు, రెస్టారెంట్లు మళ్లీ డాన్స్ బార్లను తెరవకుండా ఉండేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వాటి మీద పనికిమాలిన, అర్థరహితమైన, కఠినమైన ఆంక్షలు విధిస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. డాన్స్ బార్లకు అనుమతిస్తూ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో చేసిన చట్టాన్ని గత సంవత్సరం అక్టోబర్ 15న కొట్టేసింది. అయితే, డాన్స్ బార్లను నిర్వహించాలంటే అధికారులు 26 నిబంధనలు పెడుతున్నారని, వాటిలో ఐదింటిని అమలుచేయడం అసాధ్యమని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానుల సంఘం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎస్కే సింగ్‌లతో కూడిన ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు ఒక్క డాన్స్ బార్‌కు కూడా అధికారులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అన్ని సీసీటీవీ కెమెరాల లైవ్ఫీడ్ను సమీపంలోని పోలీసు స్టేషన్లకు ఇవ్వాలని అంటున్నారని అసోసియేషన్ తరఫు న్యాయవాది జయంత్ భూషణ్ చెప్పారు. కేవలం నలుగురు డాన్సర్లే ఉండాలంటున్నారని, అలాగే డాన్స్ ఫ్లోర్‌కు, ప్రేక్షకులకు మధ్య బారికేడ్లు పెట్టాలన్నారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజిని నెలరోజుల పాటు దాచాలంటున్నారని, పోలీసులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వాలని చెబుతున్నారని అన్నారు. దీంతో వ్యక్తి స్వేచ్ఛమీద దాడి చేసేలా ఈ నిబంధనలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. డాన్స్ బార్లో మద్యం తాగుతూ రిలాక్స్ అవ్వాలని ఎవరైనా అనుకుంటారని, అలాంటి సమయంలో తనను వీడియో తీయడాన్ని వాళ్లు ఇష్టపడకపోవచ్చని.. అలాంటి వాళ్లను ఎందుకు వీడియోలో చూపిస్తారని ప్రశ్నించింది. అలాగే తినే అలవాటు విభిన్నంగా ఉన్నవాళ్లు కూడా తమను వీడియో తీయడానికి అభ్యంతరం చెబుతారని స్పష్టం చేసింది. కాగా, లేనిపోని హింసను నివారించేందుకే ఈ నిబంధనలు పెట్టారని సమర్థించుకోడానికి అదనపు సాలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ ప్రయత్నించగా. సుప్రీంకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం మండిపడింది. -
పోలీస్ స్టేషన్లలో 'డాన్సింగ్ బార్' ప్రసారాలు
చీకటి పడుతోందనగా అక్కడి పోలీస్ స్టేషన్లలోని టీవీ స్ర్కీన్ల చుట్టూ పోలీసులు మూగాలి. సమీప ప్రాంతాల్లోని డ్యాన్స్ బార్ల నుంచి ప్రత్యక్ష ప్రసారమయ్యే దృశ్యాలను రెప్పవేయకుండా వీక్షిస్తూ.. మత్తెక్కిన కస్టమర్ ఎవరైనా డాన్స్ గర్ల్ ను టచ్ చేస్తే వెంటనే వెళ్లి అరెస్టు చేయాలి. డాన్స్ బార్ల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మార్గదర్శకాల్లో ఇలాంటి నిబంధనలు మరెన్నింటినో పొందుపర్చారు. ముంబై నగరంలో డాన్సింగ్ బార్లపై నిషేధం విధిస్తూ ఫడ్నవిస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్నితప్పుపట్టిన సుప్రీంకోర్టు.. వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోకుండా చర్యలు చేపట్టాలని, బార్లను తిరగి కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ఆమేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నూతన విధివిధానాలు రూపొందించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ సత్బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని అన్ని డాన్సింగ్ బార్లు ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.. ప్రతి డాన్సింగ్ బార్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలి. ఆ కెమెరాను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు అనుసాధానించాలి. తద్వారా బార్లలో జరుగుతున్న కార్యకలాపాలను పోలీసులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. డాన్స్ ఫ్లోర్ పై ఒకేసారి ఆరుగురు డాన్సర్ల కంటే ఎక్కువ మంది నర్తించకూడదు. అది కూడా అనుమతించిన సమయంలోనే డాన్స్ చేయాలి వీక్షకులకు కాస్త దూరంగా డాన్స్ ఫ్లోర్లు ఉండాలి ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళా డాన్సర్లను తాకడానికి వీలులేదు. స్టేజి ఎక్కి వారితో కలిసి డాన్స్ చేసే అవకాశం అసలే లేదు గతంలోలాగా డాన్సర్లపై కరెన్సీ నోట్లు వెదజల్లడం నిషిద్ధం. 18 ఏళ్లలోపు బాలికలను డాన్స్ చేసేందుకు అనుమతించరాదు బార్లలో ధూమపానాన్ని నిషేధించాలి. వాటిని నో స్మోకింగ్ జోన్లుగా ప్రకటించాలి అయితే ప్రభుత్వం రూపొందించిన నిబంధనలపై బార్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనలను అడ్డం పెట్టుకుని పోలీసులు తమ వద్ద నుంచి డబ్బు దండుకుంటారని బార్ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మన్ జీత్ సింగ్ సేథి అంటున్నారు. డాన్సింగ్ బార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలనడం మంచిదేనని, అయితే అదనంగా రూపొందించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని, పోలీసులు నిజాయితీగా పనిచేస్తారనే నమ్మకం తమకు లేదని సేథీ పేర్కొన్నారు. -
డ్యాన్స్ బార్ల లైసెన్సులు ఆలస్యం ఎందుకు?
న్యూఢిల్లీ: ముంబయిలో డ్యాన్స్ బార్ల ఓపెనింగ్ కోసం సంబంధిత యజమానులు దాఖలు చేసిన దరఖాస్తులపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత అక్టోబర్ 15న మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్ బార్లపై విధించిన నిషేధంపై సుప్రీకోర్టు స్టే ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. దాంతో డ్యాన్స్ బార్ల ఓపెనింగ్ సందడి మరోసారి ప్రారంభమైనట్లయింది. అయితే, వీటి ఓపెనింగ్ కోసం బార్ల యజమానులు దరఖాస్తులు చేసుకున్న ఇప్పటి వరకు మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014 జూన్ నెలలో ముంబయిలోని డ్యాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక సవరణను తీసుకొచ్చి ఏకగ్రీవంగా ఆమోదించి వాటిన్ బ్యాన్ చేసింది. దీనిపై గతంలో సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లగా బ్యాన్ పై స్టే విధించింది. -
డాన్స్ బార్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
డాన్స్ బార్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్రంలో డాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో డాన్స్ బార్లను తెరిపించేందుకు లైన్ క్లియరైంది. 2005లో తొలిసారిగా డాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించగా, 2013లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ -ఎన్సీపీ ప్రభుత్వం మళ్లీ మహారాష్ట్ర పోలీసు చట్టాన్ని సవరించడం ద్వారా డాన్స్ బార్లను నిషేధించింది. దీనిపై ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవలం వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోడానికే ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కాదని ఈ నిషేధం విధించారని ఆ పిటిషన్లో ఆరోపించారు. కేవలం కొందరు రాజకీయ నాయకులు దీన్ని పరువు సమస్యగా తీసుకుని పెద్దది చేస్తున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు డాన్స్ బార్లపై ఉన్న నిషేధం మీద స్టే విధించడంతో వాటి యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'గోవా బీచ్‌ల్లో డాన్స్ బార్లు మూసేయండి'
గోవా బీచ్‌ల్లో డ్యాన్సింగ్ బార్లు మూసివేయాలని బీజేపీ పార్టీ సీనియర్ నేత మైఖేల్ లోబో సోమవారం నిరాహార దీక్షకు దిగారు. ముఖ్యంగా కలాంగుటె బాగా బీచ్ వెంట డ్యాన్స్ క్లబ్బులన్నీ మూతపడేయాలని ఆయన డిమాండ్ చేశారు. పురుషులు బాగా తాగేసి ఈ పబ్బుల్లో చిందులేస్తున్న కారణంగా దాని చుట్టుపక్కల ఉన్న మహిళలంతా బాధపడాల్సి వస్తుందని, అంతేకాకుండా మహిళలు అభద్రతకు గురి అవుతున్నారని మైఖేల్ లోబో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఇలాంటి పబ్బులను నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. బాగా బీచు సర్కిల్ వద్ద మైఖేల్ లోబో తన మద్దతు దారులతో దీక్షకు దిగారు. -
డ్యాన్స్ బార్లు తెరుచుకుంటాయా!
మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లు తిరిగి తెరుచుకునే దానికే సందిగ్ధత నెలకొంది. డ్యాన్స్ బార్లపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసి రెండు నెలలు దాటినా ఇంకా అవి తెరుచుకోలేదు. దాంతో ఒక్క ముంబైలోనే దాదాపు 200 బార్లు పోలీసుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. వెంటనే అనుమతులు ఇవ్వాలని బార్ల యజమానులు కోరుతున్నారు. ఒకవేళ అనుమతి రాకుంటే మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బార్లలో డ్యాన్సులు చేసే యువతుల్లో, ఇటు యజమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. తీర్పు అనంతరం డ్యాన్సర్లు, బార్ యజమానులు సంతోషంలో వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో పునరాలోచనలో పడింది. నిజానికి డ్యాన్స్ బార్లకు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇష్టంలేదు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండడంతో నిషేధాన్ని ఎత్తివేస్తారని అందరూ భావించారు. అయితే నిషేధాన్ని కొనసాగిస్తామని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించటంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. 2005లో మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్‌బార్లను నిషేధించింది. ఆ మేరకు బాంబే పోలీస్ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని సవాల్ చేస్తూ రెస్టారెంట్లు, బార్ల సంఘం ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం 2006లో బాంబే హైకోర్టు.. మహారాష్ట్ర సర్కారు జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీన్ని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. తొలుత హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అనంతరం వాదనల సందర్భంగా.. డ్యాన్స్‌బార్ల పేరుతో అక్కడ విశృంఖలంగా, అసభ్యరీతితో నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయని, అంతేకాకుండా పెద్ద ఎత్తున వ్యభిచారం కూడా జరుగుతోందని మహారాష్ట్ర సర్కారు నివేదించింది. రాష్ట్రంలో కేవలం 345 డ్యాన్స్ బార్లకు మాత్రమే అనుమతి ఉండగా, ఏకంగా 2,500 బార్లలో ఇలాంటి కార్యకలాపాలు అక్రమంగా సాగుతున్నాయని కోర్టుకు తెలిపింది. అయితే డ్యాన్స్‌బార్లను నిషేధిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని రెస్టారెంట్లు, బార్ల సంఘం వాదించింది. దాదాపు 70 వేల మంది మహిళలు డ్యాన్స్బార్లలో పనిచేసేవారని, సర్కారు నిర్ణయంతో ఉపాధి కోల్పోవడంతో వారిలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లు న్యాయస్థానం అనుమతి ఇచ్చినా .... ప్రభుత్వం మోకాలడ్డుతుండటంతో బార్ల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు.