
డాన్స్ బార్లకు ఊరట
ముంబై: మహారాష్ట్రలోని డాన్స్ బార్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇప్పటివరకు పాటిస్తున్న పాత నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనల అమలు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. లైసెన్స్ కలిగిన డాన్స్ బార్లు పాత నిబంధనలనే కొనసాగించాలని స్పష్టం చేసింది. డాన్స్ బార్లను రాత్రి 11.30లకు మూసి వేయాలని, మద్యం విక్రయించరాదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
సర్కారు నిబంధనలను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్ లతో కూడిన బెంచ్ తప్పుబట్టింది. డాన్స్ బార్లలో మద్యం విక్రయించకూడదనుకుంటే రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించింది. బార్, డాన్స్ లైసెన్స్ కలిగినవారిని మద్యం అమ్మకూడదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. మహిళల గౌరవం కాపాడానికి ప్రయత్నం చేయాలని కోరింది. డాన్స్ బార్లలో సీసీ కెమెరాలు పెడితే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.