డాన్స్ బార్లపై ఆంక్షలు వద్దు: సుప్రీం | Donot put absurd rules on dance bars, says supreme court | Sakshi
Sakshi News home page

డాన్స్ బార్లపై ఆంక్షలు వద్దు: సుప్రీం

Published Thu, Feb 25 2016 10:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

డాన్స్ బార్లపై ఆంక్షలు వద్దు: సుప్రీం - Sakshi

డాన్స్ బార్లపై ఆంక్షలు వద్దు: సుప్రీం

హోటళ్లు, రెస్టారెంట్లు మళ్లీ డాన్స్ బార్లను తెరవకుండా ఉండేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వాటి మీద పనికిమాలిన, అర్థరహితమైన, కఠినమైన ఆంక్షలు విధిస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. డాన్స్ బార్లకు అనుమతిస్తూ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో చేసిన చట్టాన్ని గత సంవత్సరం అక్టోబర్ 15న కొట్టేసింది. అయితే, డాన్స్ బార్లను నిర్వహించాలంటే అధికారులు 26 నిబంధనలు పెడుతున్నారని, వాటిలో ఐదింటిని అమలుచేయడం అసాధ్యమని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానుల సంఘం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎస్‌కే సింగ్‌లతో కూడిన ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు ఒక్క డాన్స్ బార్‌కు కూడా అధికారులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అన్ని సీసీటీవీ కెమెరాల లైవ్‌ఫీడ్‌ను సమీపంలోని పోలీసు స్టేషన్లకు ఇవ్వాలని అంటున్నారని అసోసియేషన్ తరఫు న్యాయవాది జయంత్ భూషణ్ చెప్పారు. కేవలం నలుగురు డాన్సర్లే ఉండాలంటున్నారని, అలాగే డాన్స్ ఫ్లోర్‌కు, ప్రేక్షకులకు మధ్య బారికేడ్లు పెట్టాలన్నారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజిని నెలరోజుల పాటు దాచాలంటున్నారని, పోలీసులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వాలని చెబుతున్నారని అన్నారు.

దీంతో వ్యక్తి స్వేచ్ఛమీద దాడి చేసేలా ఈ నిబంధనలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. డాన్స్ బార్‌లో మద్యం తాగుతూ రిలాక్స్ అవ్వాలని ఎవరైనా అనుకుంటారని, అలాంటి సమయంలో తనను వీడియో తీయడాన్ని వాళ్లు ఇష్టపడకపోవచ్చని.. అలాంటి వాళ్లను ఎందుకు వీడియోలో చూపిస్తారని ప్రశ్నించింది. అలాగే తినే అలవాటు విభిన్నంగా ఉన్నవాళ్లు కూడా తమను వీడియో తీయడానికి అభ్యంతరం చెబుతారని స్పష్టం చేసింది. కాగా, లేనిపోని హింసను నివారించేందుకే ఈ నిబంధనలు పెట్టారని సమర్థించుకోడానికి అదనపు సాలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ ప్రయత్నించగా. సుప్రీంకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం మండిపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement