సుప్రీం తీర్పుపై సీఎం ఆశ్చర్యం
ముంబై: ఎనిమిది డాన్సు బార్లకు రెండురోజుల్లో అనుమతులు ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారును సుప్రీం కోర్టు ఆదేశించడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో కొత్త నిబంధనలు తెచ్చిందని నిబంధనలకు లోబడి ఉన్న బార్లకే అనుమతులు ఇస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
ముంబైలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాన్స్ బార్లపై రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించిందని, నిబంధనల ప్రకారమే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో మరోసారి తమ వాదనలు వినిపిస్తామని ఆయన తెలిపారు. నేర చరితుల జాబితాలోని వారిని బార్లలో నియమించడంపై బారు యాజమాన్యాలు హామీ ఇవ్వనందువల్లనే 8 బార్లకు అనుమతి నిరాకరించామని ప్రభుత్వం కోర్టులో తెలిపిన విషయం తెలిసిందే.