అడుక్కోవడం కంటే డాన్సులే నయం: సుప్రీం
వీధుల్లో అడుక్కోవడం కంటే.. డాన్స్ బార్లలో నృత్యం చేయడం ఎంతో నయమని సుప్రీంకోర్టు చెప్పింది. డాన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంపై మండిపడింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దని హెచ్చరించింది. విద్యాసంస్థలకు కిలోమీటరు దూరంలో డాన్స్ బార్లు తెరవడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కూడా సుప్రీం విమర్శించింది. డాన్స్ అనేది ఒక వృత్తి అని, ఒకవేళ అందులో అసభ్యత ఉంటే.. అప్పుడు చట్టబద్ధమైన హక్కు కోల్పోతుందని.. అయితే ప్రభుత్వం దానిపై నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు గానీ నిషేధించకూడదని స్పష్టం చేసింది. వీధుల్లో అడుక్కోవడం లేదా ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలో చేరడం కంటే డాన్స్ బార్లలో నృత్యం చేయడమే నయమని సుప్రీం తెలిపింది.
డాన్స్ బార్ల నియంత్రణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ ఏప్రిల్ 12న ఒక ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అందులో నిబంధనలను డాన్స్ బార్ల ఆపరేటర్లు, యజమానులు ఉల్లంఘిస్తే అందుకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25వేల వరకు జరిమానా కూడా పడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం డాన్స్ బార్లు సాయంత్రం 6 గంటల నుంచి 11.30 వరకు మాత్రమే పనిచేయాలి, అలాగే విద్యాసంస్థలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కనీసం ఒక కిలోమీటరు దూరంలో ఉండాలి. డాన్సులు చేసే ప్రాంతానికి దగ్గర్లో మద్యం సరఫరా చేయకూడదు. ఈ కొత్త నిబంధనలపై ఆపరేటర్లు, యజమానులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.