begging on streets
-
భిక్షాటనపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బిక్షాటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలమైన పక్షపాత ధోరణిని ప్రదర్శించలేమంటూ స్పష్టం చేసింది. ఉపాధి లేకపోవడం వల్లే చాలామంది బిచ్చమెత్తుకోవడానికి వీథుల్లోకి వస్తున్నారని పేర్కొంది. ఇది సాంఘిక, ఆర్థిక సమస్య అని తెలిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ నేపథ్యంలో వీథుల్లో తిరిగే బిచ్చగాళ్ళకు, నిరాశ్రయులకు వ్యాక్సిన్లు వేయించాలనే అంశంపై కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ట్రాఫిక్ కూడళ్లు, మార్కెట్లు, బహిరంగ స్థలాల్లో భిక్షాటనను నిరోధించాలని అడ్వకేట్ కుశ్ కల్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జరగిన వాదనల్లో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ చిన్మయ్ శర్మను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. వీథుల్లోకి వచ్చి బిచ్చమెత్తుకోవాలని ఎవరూ కోరుకోరని, పేదరికం వల్లే వారు ఈ పని చేస్తున్నారని అన్నారు. అత్యున్నత న్యాయస్థానంగా తాము పక్షపాతంతో ఉన్నత వర్గాలకు అనుకూలంగా వ్యవహరించలేమని తెలిపారు. వీథులు, బహిరంగ స్థలాలు, ట్రాఫిక్ జంక్షన్ల నుంచి బిచ్చగాళ్ళను తొలగించాలని తాము ఆదేశించలేమని తేల్చి చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉందని, దీన్ని పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నాయో వివరించాలని ఆదేశించారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
కార్మికుల భిక్షాటన.. అధికారుల విందు
ప్రొద్దుటూరు టౌన్ : అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూ ల్ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేశామని మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ బండి శేషన్నతోపాటు అన్ని సెక్షన్ల సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ ఉత్సవాలకు వారం ముందే ఇతర జిల్లాల నుంచి మున్సిపాలిటీకి వచ్చిన కార్మికులు తిరిగి వెళ్లేటప్పుడు చార్జీలకు తగినంత డబ్బు ఇవ్వలేదని.. వారు రోడ్ల వెంట భిక్షాటన చేసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏదో సాధించామని విందును మున్సిపల్ కార్యాలయంలోనే అధికారులు ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కడప కార్పొరేషన్, నంద్యాల, తాడిపత్రి మున్సిపాలిటీల నుంచి 160 మంది కార్మికులను ఆరు రోజుల ముందుగానే ఇక్కడికి పిలిపించారు. ఉప రాష్ట్రపతి సభ ముగియగానే ఈ నెల 10న కార్మికులకు తాడిపత్రికి వెళ్లే వారికి చార్జీలకు రూ.100, కడపకు వెళ్లే వారికి రూ.80 ఇవ్వడంతో వివాదం జరిగింది. ఇంత తక్కువ ఇస్తే ఎలా అని కార్మికులు పేర్కొన్నారు. కడప కార్మికులు డబ్బు తీసుకోకుండా గాంధీ రోడ్డులో పలు దుకాణాలు, గృహాల వద్దకు వెళ్లి మున్సిపల్ అధికారులు పనులు చేయించుకొని చార్జీలకు డబ్బు ఇవ్వలేదని భిక్షాటన చేశారు. జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలు శ్రీనివాసులరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి అధికారుల నిర్వాకాన్ని ఆయన దృష్టికి కెళ్లారు. దీంతో ఆయన స్పందించిన రూ.2000 ఇచ్చారు. -
అడుక్కోవడం కంటే డాన్సులే నయం: సుప్రీం
వీధుల్లో అడుక్కోవడం కంటే.. డాన్స్ బార్లలో నృత్యం చేయడం ఎంతో నయమని సుప్రీంకోర్టు చెప్పింది. డాన్స్ బార్లకు లైసెన్సులు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంపై మండిపడింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దని హెచ్చరించింది. విద్యాసంస్థలకు కిలోమీటరు దూరంలో డాన్స్ బార్లు తెరవడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కూడా సుప్రీం విమర్శించింది. డాన్స్ అనేది ఒక వృత్తి అని, ఒకవేళ అందులో అసభ్యత ఉంటే.. అప్పుడు చట్టబద్ధమైన హక్కు కోల్పోతుందని.. అయితే ప్రభుత్వం దానిపై నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు గానీ నిషేధించకూడదని స్పష్టం చేసింది. వీధుల్లో అడుక్కోవడం లేదా ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలో చేరడం కంటే డాన్స్ బార్లలో నృత్యం చేయడమే నయమని సుప్రీం తెలిపింది. డాన్స్ బార్ల నియంత్రణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ ఏప్రిల్ 12న ఒక ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అందులో నిబంధనలను డాన్స్ బార్ల ఆపరేటర్లు, యజమానులు ఉల్లంఘిస్తే అందుకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25వేల వరకు జరిమానా కూడా పడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం డాన్స్ బార్లు సాయంత్రం 6 గంటల నుంచి 11.30 వరకు మాత్రమే పనిచేయాలి, అలాగే విద్యాసంస్థలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కనీసం ఒక కిలోమీటరు దూరంలో ఉండాలి. డాన్సులు చేసే ప్రాంతానికి దగ్గర్లో మద్యం సరఫరా చేయకూడదు. ఈ కొత్త నిబంధనలపై ఆపరేటర్లు, యజమానులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.