
డాన్స్ బార్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్రంలో డాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో డాన్స్ బార్లను తెరిపించేందుకు లైన్ క్లియరైంది. 2005లో తొలిసారిగా డాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించగా, 2013లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ -ఎన్సీపీ ప్రభుత్వం మళ్లీ మహారాష్ట్ర పోలీసు చట్టాన్ని సవరించడం ద్వారా డాన్స్ బార్లను నిషేధించింది.
దీనిపై ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవలం వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోడానికే ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కాదని ఈ నిషేధం విధించారని ఆ పిటిషన్లో ఆరోపించారు. కేవలం కొందరు రాజకీయ నాయకులు దీన్ని పరువు సమస్యగా తీసుకుని పెద్దది చేస్తున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు డాన్స్ బార్లపై ఉన్న నిషేధం మీద స్టే విధించడంతో వాటి యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.