
డ్యాన్స్ బార్లో నృత్యాలు , హుక్కా బార్
మసక మసక చీకటి, ఇంపుగా సంగీతం, హుక్కా పొగలు, మద్యం గ్లాసుల గలగలల మధ్య యువతుల నృత్యాలు. గతంలో ఉన్న లైవ్ బ్యాండ్ కుసంస్కృతి మళ్లీ జడలు విప్పుతోంది. అనేక రకాల అక్రమాలకు నెలవైన ఇలాంటి వినోద గృహాల వల్ల నాయకులు, ఖాకీలు తదితరులకు కాసు వర్షం కురుస్తోంటే అరికట్టేదెవరనే ప్రశ్న వినిపిస్తోంది.
బెంగళూరు: నగరంలో మళ్లీ డ్యాన్స్ బార్లు ప్రత్యక్షమవుతున్నాయి. రిక్రియేషన్ క్లబ్బుల ముసుగులో జూదానికి ఆలవాలమైన స్కిల్ గేమ్, వీడియో గేమ్‌లు పుట్టగొడు గుల్లా వెలుస్తున్నాయి. వీటిలో అనధికారిక డ్యాన్స్ బార్లను వెంటనే మూసి వేయించాల్సిందిగా నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ గత వారంలో అన్ని పోలీసు స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాజకీయ పలుకుబడితో బార్ల యాజమాన్యాలు వీటిని నడిపిస్తున్నాయి.
గతంలో గట్టి చర్యలు
గత ప్రభుత్వంలో అప్పటి హోంమంత్రి రామలింగారెడ్డి ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా పోలీసు శాఖకు స్పష్టంచేశారు. ఫలితంగా డ్యాన్స్ బార్లు, స్కిల్ గేమ్, వీడియో గేమ్‌లతో పాటు హుక్కా బార్లు, గంజాయి విక్రయాలను పోలీసులు సమర్థంగా అడ్డుకున్నారు. శాసనసభ ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వం కాస్త ఆపద్ధర్మంగా మారడంతో అక్రమార్కుల సాయంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఎవరి పాత్ర ఎంతుంది?
ఈ నేపథ్యంలో కేవలం అక్రమ డ్యాన్స్ బార్ల భరతం పట్టాల్సిందిగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే సాకుతో ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులపై వేటు పడబోతోందని సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ బార్ల వ్యవహారంలో ఉన్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని, కనుక వారిపై కూడా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఎటువంటి స్కిల్ గేమ్‌లు లేదా డ్యాన్స్ బార్లను నిర్వహించే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. కనుక అలాంటి అధికారులపై కూడా చర్యలు చేపడితే, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు భవిష్యత్తులో కూడా ఆస్కారం ఉండబోదని వారు చెబుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎలాంటి డ్యాన్స్ బార్లకైనా కమిషనరేట్ స్థాయి అధికారి మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఇప్పటికే అక్రమంగా నడుస్తున్న అలాంటి బార్లకు ఆ స్థాయి అధికారుల ఆశీస్సులు తప్పక ఉంటాయనేది దిగువ స్థాయి సిబ్బంది వాదన. డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల వద్ద అలాంటి అక్రమ బార్ల సమాచారం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా
ప్రస్తుతం నగరంలోని మెజిస్టిక్, ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, కోరమంగల, ఇందిరా నగర, వైట్‌ఫీల్డ్‌లలో అక్రమ డ్యాన్స్ బార్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పలువురు లేడీస్ బార్ల పేరిట సుప్రీం కోర్టు ఆదేశాలను చూపిస్తూ, నగర పోలీసు కమిషనర్ నుంచి లైసెన్సులు పొందారు. గాంధీ బజారు, బ్యాంకు కాలనీ, కోరమంగల, ఇందిరా నగర, శేషాద్రిపురం సహా రిక్రియేషన్ క్లబ్ పేరిట నగరంలో 200కు పైగా కేంద్రాలు నడుస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో మహిళలతో నృత్యాలు, హుక్కా వినియోగాలు వంటివి సాగుతుంటాయి. సంపన్న యువత, అధికాదాయ వ్యక్తులు వీటిలో జల్సాలు సాగిస్తుంటారు. వారిని అనుకరించలని మధ్యతరగతి మనుషులూ ప్రయత్నించి అప్పుల పాలవుతుంటారు. ఈ బార్ల చాటును జరిగే అక్రమాలూ అనేకమనే విమర్శలున్నాయి. ప్రస్తుతం వీటిని అరికట్టేందుకు సరైన విధానమంటూ లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment