వెలవెలబోతున్న డ్యాన్స్ బార్లు
వెలవెలబోతున్న డ్యాన్స్ బార్లు
Published Mon, Nov 14 2016 5:40 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం వివిధ వ్యాపార సంస్థలతో పాటు ముంబైలోని డ్యాన్స్ బార్లపై కూడా పడింది. రద్దయిన మొదటి, రెండు రోజులు అంతగా ప్రభావం చూపలేదు. కానీ గత మూడు రోజులుగా కస్టమర్లు లేక డ్యాన్స్ బార్లతో పాటు సాధారణ బార్లు వెలవెలబోతున్నాయి. అరకొరగా కొందరు వస్తున్నా.. బార్లలో డ్యాన్స్ గర్ల్స్ పై నోట్లు వెదజల్లే వాళ్లు కరువయ్యారు. దీంతో వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అదేవిధంగా కస్టమర్లు లేక బార్లలో పనిచేసే వెయిటర్లకు అదనపు ఆదాయం పోయింది. బార్ యజమానులు వెయిటర్లకు నెలకు చెల్లించే జీతాల కంటే కస్టమర్లు ఇచ్చే టిప్పు దాదాపు 50 రేట్లు ఎక్కువ ఉంటుంది. దీంతో వారిలో కూడా నిరుత్సాహం నెలకొంది. రోజువారి ఖర్చులకు జేబులో నుంచి తీయాల్సి వస్తోందంటున్నారు.
ముంబైలో సుమారు 250 బార్లు ఉన్నాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా రోజు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు కస్టమర్లు వస్తున్నారు. దీంతో చేసేదిలేక బార్లు మూసివేయడమే ఉత్తమమని అనేక మంది బార్ యజమానులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బార్లు మూసివేశారు. నగరంలో దాదాపు అందరి పరిస్థితి.. ఎకౌంట్‌లో డబ్బులుండి కూడా చేబులు ఖాళీగానే ఉన్నాయనే విధంగా ఉందని ఆహార్ బార్ అధ్యక్షుడు భారత్ ఠాకూర్ అన్నారు.
కౌంటర్‌లో చిల్లర డబ్బులు లేక బార్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక కస్టమర్లవద్ద కొత్తగా వచ్చిన రూ.500, రూ.2000 నోట్లు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నామని అన్నారు. కొందరు మధ్యం సేవించి, భోజనం తిన్న తరువాత బిల్లు చెల్లించే సమయంలో రద్దయిన పాత నోట్లు ఇస్తున్నారు. స్వీకరించేందుకు నిరాకరిస్తే తాగిన మత్తులో గొడవపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు నగరంలోని అనేక బార్లలో దర్శనమిస్తున్నాయని ఠాకూర్ తెలిపారు. దీంతో చేసేది లేక బార్లు మూసేయాల్సి వస్తుందన్నారు.
Advertisement