
ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లలో నోట్ల మార్పిడి కౌంటర్లు
ముంబై: ముంబై నగరంలోని ముఖ్యమైన ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే స్టేషన్‌లలో నోట్ల మార్పిడి కౌంటర్లు ప్రారంభం కానున్నాయి. పాత పెద్ద నోట్లు రద్దు కావడంతో చిల్లర కోసం నగర ప్రజలు పడుతున్న పాట్లను దృష్టిలో ఉంచుకుని చిల్లర మార్పిడి కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్యాంకులకు స్థలం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రైల్వే, ప్రభుత్వ ఆస్పత్రులను కోరింది. ఇందుకు సంబంధించిన అధికారులతో హోం శాఖ చర్చించింది.
కౌంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను కోరింది. కాగా, కౌంటర్లకు స్ధలం కేటాయించేందుకు ఆసుపత్రులు సిద్ధమవగా, రైల్వే స్టేషన్ల వద్ద కౌంటర్ల ఏర్పాటులో సందిగ్ధం నెలకొంది. ఇప్పటివరకూ ఈ విషయమై రైల్వే శాఖ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.