పోలీస్ స్టేషన్లలో 'డాన్సింగ్ బార్' ప్రసారాలు
చీకటి పడుతోందనగా అక్కడి పోలీస్ స్టేషన్లలోని టీవీ స్ర్కీన్ల చుట్టూ పోలీసులు మూగాలి. సమీప ప్రాంతాల్లోని డ్యాన్స్ బార్ల నుంచి ప్రత్యక్ష ప్రసారమయ్యే దృశ్యాలను రెప్పవేయకుండా వీక్షిస్తూ.. మత్తెక్కిన కస్టమర్ ఎవరైనా డాన్స్ గర్ల్ ను టచ్ చేస్తే వెంటనే వెళ్లి అరెస్టు చేయాలి. డాన్స్ బార్ల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మార్గదర్శకాల్లో ఇలాంటి నిబంధనలు మరెన్నింటినో పొందుపర్చారు.
ముంబై నగరంలో డాన్సింగ్ బార్లపై నిషేధం విధిస్తూ ఫడ్నవిస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్నితప్పుపట్టిన సుప్రీంకోర్టు.. వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోకుండా చర్యలు చేపట్టాలని, బార్లను తిరగి కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ఆమేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నూతన విధివిధానాలు రూపొందించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ సత్బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని అన్ని డాన్సింగ్ బార్లు ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది..
- ప్రతి డాన్సింగ్ బార్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలి.
- ఆ కెమెరాను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు అనుసాధానించాలి. తద్వారా బార్లలో జరుగుతున్న కార్యకలాపాలను పోలీసులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది.
- డాన్స్ ఫ్లోర్ పై ఒకేసారి ఆరుగురు డాన్సర్ల కంటే ఎక్కువ మంది నర్తించకూడదు. అది కూడా అనుమతించిన సమయంలోనే డాన్స్ చేయాలి
- వీక్షకులకు కాస్త దూరంగా డాన్స్ ఫ్లోర్లు ఉండాలి
- ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళా డాన్సర్లను తాకడానికి వీలులేదు. స్టేజి ఎక్కి వారితో కలిసి డాన్స్ చేసే అవకాశం అసలే లేదు
- గతంలోలాగా డాన్సర్లపై కరెన్సీ నోట్లు వెదజల్లడం నిషిద్ధం.
- 18 ఏళ్లలోపు బాలికలను డాన్స్ చేసేందుకు అనుమతించరాదు
- బార్లలో ధూమపానాన్ని నిషేధించాలి. వాటిని నో స్మోకింగ్ జోన్లుగా ప్రకటించాలి
అయితే ప్రభుత్వం రూపొందించిన నిబంధనలపై బార్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనలను అడ్డం పెట్టుకుని పోలీసులు తమ వద్ద నుంచి డబ్బు దండుకుంటారని బార్ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మన్ జీత్ సింగ్ సేథి అంటున్నారు. డాన్సింగ్ బార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలనడం మంచిదేనని, అయితే అదనంగా రూపొందించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని, పోలీసులు నిజాయితీగా పనిచేస్తారనే నమ్మకం తమకు లేదని సేథీ పేర్కొన్నారు.