
డ్యాన్స్ బార్లు తెరుచుకుంటాయా!
మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లు తిరిగి తెరుచుకునే దానికే సందిగ్ధత నెలకొంది. డ్యాన్స్ బార్లపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసి రెండు నెలలు దాటినా ఇంకా అవి తెరుచుకోలేదు. దాంతో ఒక్క ముంబైలోనే దాదాపు 200 బార్లు పోలీసుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. వెంటనే అనుమతులు ఇవ్వాలని బార్ల యజమానులు కోరుతున్నారు. ఒకవేళ అనుమతి రాకుంటే మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు.
ఇటీవలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బార్లలో డ్యాన్సులు చేసే యువతుల్లో, ఇటు యజమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. తీర్పు అనంతరం డ్యాన్సర్లు, బార్ యజమానులు సంతోషంలో వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో పునరాలోచనలో పడింది. నిజానికి డ్యాన్స్ బార్లకు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇష్టంలేదు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండడంతో నిషేధాన్ని ఎత్తివేస్తారని అందరూ భావించారు. అయితే నిషేధాన్ని కొనసాగిస్తామని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్ పాటిల్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించటంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది.
2005లో మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్‌బార్లను నిషేధించింది. ఆ మేరకు బాంబే పోలీస్ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని సవాల్ చేస్తూ రెస్టారెంట్లు, బార్ల సంఘం ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం 2006లో బాంబే హైకోర్టు.. మహారాష్ట్ర సర్కారు జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
దీన్ని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. తొలుత హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అనంతరం వాదనల సందర్భంగా.. డ్యాన్స్‌బార్ల పేరుతో అక్కడ విశృంఖలంగా, అసభ్యరీతితో నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయని, అంతేకాకుండా పెద్ద ఎత్తున వ్యభిచారం కూడా జరుగుతోందని మహారాష్ట్ర సర్కారు నివేదించింది. రాష్ట్రంలో కేవలం 345 డ్యాన్స్ బార్లకు మాత్రమే అనుమతి ఉండగా, ఏకంగా 2,500 బార్లలో ఇలాంటి కార్యకలాపాలు అక్రమంగా సాగుతున్నాయని కోర్టుకు తెలిపింది. అయితే డ్యాన్స్‌బార్లను నిషేధిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని రెస్టారెంట్లు, బార్ల సంఘం వాదించింది.
దాదాపు 70 వేల మంది మహిళలు డ్యాన్స్‌బార్లలో పనిచేసేవారని, సర్కారు నిర్ణయంతో ఉపాధి కోల్పోవడంతో వారిలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లు న్యాయస్థానం అనుమతి ఇచ్చినా .... ప్రభుత్వం మోకాలడ్డుతుండటంతో బార్ల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు.