cctvs
-
నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజీలు
విజయనగరం క్రైమ్/పూసపాటిరేగ: పూసపాటిరేగ మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై మే 31న జరిగిన హిట్ అండ్ రన్ రహదారి ప్రమాద నిందితుడు పట్టుబడ్డాడు. సాంకేతిక సాక్ష్యాధారాలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణం గాజులకొల్లివలసకు చెందిన భార్యాభర్తలు రౌతు రోహిణి, యోగేశ్వరరావులు విశాఖపట్నానికి మోటారు సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడం, ఘటనా స్థలంలోనే మృతిచెందిన విష యం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పూసపాటిరేగ ఎస్ఐ ఆర్.జయంతి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలంలో దొరికిన సాంకేతిక సాక్ష్యాలు, ఎక్సేంజ్ ఆఫ్ మెటిరియల్లో బైక్‌కు అంటిన వైట్ పెయింట్, ఫాగ్ లైట్ కవర్లు ఆధారంగా ఢీకొట్టిన వాహనం తెలుపు రంగు ఎర్టిగా కారుగా గుర్తించారు. ప్రమాద స్థలానికి దగ్గరగా జాతీయ రహదారిపై ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాద సమయంలో నాలుగు ఎర్టిగా కార్లు వెళ్లడం గమనించారు. అరబిందో ఫార్మాకు, ప్రమాద స్థలానికి నాలుగు కిలోమీటర్లు దూరం. ఈ లెక్కన బైక్‌ను వేగంగా క్రాస్ చేసి ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. టోల్ గేట్ సిబ్బంది సహకారంతో కారు నంబర్ (ఏపీ 39బీవీ9909)ను సేకరించారు. ఈ చలానా యాప్ ద్వారా కారు నంబర్ అడ్రస్ విశాఖ పట్నానికి చెందిన నాయని శంకర రెడ్డిదిగా గుర్తించారు. వెంటనే ఎస్ఐ, సిబ్బంది విశాఖపట్నం వెళ్లారు. సీసీ ఫుటేజీలో కారు డ్రైవర్ వేసుకున్న మాస్క్ డిజైన్‌తో అక్కడ ఉన్న కారు డ్రైవర్ వేసుకున్న మాస్క్ డిజైన్ మ్యాచ్ కావడంతో విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. కారును సీజ్‌చేసి పూసపాటిరేగ స్టేష న్కు తరలించారు. కేసు ఛేదించిన ఎస్ఐ, సిబ్బందితో పాటు, వారికి మోనటరింగ్ చేసిన భోగాపురం సీఐ శ్రీధర్‌ను డీఎస్పీ అభినందించారు. చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది కులాంతర వివాహం చేసుకున్నాడని.. -
సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్ ఉండాల్సిందే : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: జైళ్లు, పోలీస్ స్టేషన్లు, లాకప్‌లు, ఇతర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. అరెస్టు చేసి, విచారణ జరిపే అధికారం ఉన్న సీబీఐ, ఈడీ,నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) తో సహా ఇతర దర్యాప్తు సంస్థల విచారణ గదుల్లో వీటిని విధిగా అమర్చాలని సుప్రీం స్పష్టం చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, మెయిన్ గేట్, లాకప్స్, కారిడార్లు, లాబీ, రిసెప్షన్ వద్ద వీటిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ) ఈ మేరకు చర్యలు తీసుకునేలా చూడాలని జస్టిస్ ఆర్ఎఫ్ నరిమన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 3, 2018నాటి ఉత్తర్వులకు అనుగుణంగా మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టేందుకు అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం తేల్చి చెప్పింది. నవంబర్ 24 వరకు 14 రాష్ట్రాలు నివేదికలను దాఖలు చేశాయని, వాటిలో ఎక్కువ భాగం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, తదితర వివరాలను వెల్లడించడంలో విఫలమయ్యాయని తన 12 పేజీల ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీ వ్యవస్థలు తప్పనిసరిగా నైట్ విజన్ కలిగి ఉండాని ఈ పుటేజ్ లేదా డేటాను కనీసం ఒక సంవత్సరం పాటు స్టోరేజ్ చేయాలని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. కేంద్రం, ఆయాలు రాష్ట్రాలు, యూటీలు దీనికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయాలని పేర్కొంది. -
ఇకపై స్కూల్ బస్సుల్లో సీసీటీవి,జీపీఎస్
-
సీసీటీవీలను వాడి పోలీసులకు షాకిచ్చారు!
న్యూఢిల్లీ: నేటి హైటెక్ యుగంలో నేరం జరిగితే సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పసిగట్టి నేరస్థుడిని అరెస్టు చేయడం తెలిసిందే. కానీ, ఇందుకు భిన్నంగా ఢిల్లీకి చెందిన ఓ గ్యాంబ్లింగ్ ముఠా ఏకంగా పోలీసుల మీద నిఘా పెట్టేసింది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ గావ్ ఏరియా లో అక్రమంగా గ్యాంబ్లింగ్ నడుపుతున్న ఓ ఇంటిపై పక్క సమాచారంతో ఎన్నిసార్లు సర్-ప్రైజ్ విజిట్ లు చేసినా.. ఎవరూ దొరకలేదు. దీంతో విచారించిన పోలీసులకు ఆ ఇంటి పరిసరప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని అందుకనే ఎవరూ దొరకడం లేదని తెలుసుకున్నారు. ముఠాను పట్టుకునేందుకు పకడ్బందీ వ్యుహం రచించారు. ఇందుకోసం ఆ ఇంటి వద్దకు వెళ్లగా ఇంటి ఓనర్ ఓ మహిళ పోలీసులను అడ్డుకోవడమే కాకుండా తనను వేధిస్తున్నారంటూ ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజ్ లు కూడా ఉన్నాయని బెదిరించడంతో వెనుదిరిగిన పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో మహిళలతో పోలీసులను బెదిరించడమే కాకుండా అక్రమంగా మద్యం, డ్రగ్స్ ను అమ్ముతున్న వారిని ఎట్టకేలకు ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాటిపై నిఘాను పెంచెందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. -
'డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు ఉండాల్సిందే'
న్యూఢిల్లీ: డ్యాన్స్ బార్లలో క్లోజ్ సర్క్యుట్ టెలివిజన్ (సీసీ టీవీ) కెమెరాలను ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంది. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల డ్యాన్స్ బార్లలో అశీల నృత్యాలను నిరోధించడమే కాకుండా, డ్యాన్స్ గర్ల్స్‌కు వ్యక్తిగత భద్రత కూడా కల్పించడానికి వీలు ఉంటుందని తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు పబిక్ ప్రదేశాలే అయినందున వీటిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల ఎవరి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కాబోదని న్యాయస్థానానికి నివేదించింది. డ్యాన్స్ బార్ల లైసెన్సుల విషయంలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. ఈ వ్యవహారంలో సమీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. అయినప్పటికీ లైసెన్సుల జారీలో నిబంధనలను సడలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిరాకరించింది. డ్యాన్స్ బార్లలలో సీసీటీవీ లైవ్ ఫుటెజ్‌ను పోలీసులకు అనుసంధానించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన సమాధానాన్ని తెలిపింది. 'డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాల్సిన అవసరముంది. శాంతిభద్రతలు, ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని చూడాలి. ఏదైనా అవాంఛిత ఘటన జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాల వల్ల డ్యాన్స్ బార్ గర్ల్స్/కళాకారులకు వ్యక్తిగత భద్రత కల్పించే అవకాశముంటుంది. పోలీసులు సత్వరమే సంఘటన స్థలికి చేరుకునే అవకాశముంటుంది' అని సుప్రీంకోర్టుకు సమర్పించిన తన ప్రతిస్పందనలో ప్రభుత్వం తెలిపింది. -
'రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం'
ఆర్కేపురం (రంగారెడ్డి): రైతు, వినియోగదారుల కోసమే మార్కెటింగ్‌శాఖ పనిచేస్తుందని, రైతు లేనిదే మార్కెట్, కమిషన్ ఏజెంట్లు ఉండరని, రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వ్యవసాయ మార్కెట్లోని గడ్డిఅన్నారం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్లో రూ. 2.60కోట్లతో నిర్మించిన ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ భవనాన్ని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 'రైతులకు, ఏజెంట్లకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మార్కెటింగ్ శాఖ పని చేస్తుంది. ఏదైనా సమస్యలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకువస్తే విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటాం. మార్కెట్లో ఫిర్యాదుల కోసం బాక్సు, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. మార్కెట్లో తెల్లచిట్టీలతో వ్యాపారం చేయవద్దు. ఎలక్ట్రానిక్ వే మిషన్స్ వెంటనే ఏర్పాటు చేయాలి. మార్కెట్లో ఇంకా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్నగర్ మార్కెట్లో చిరు వ్యాపారులకు షెడ్లు కట్టిస్తాం. మార్కెట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలి' అని సూచించారు. రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధర ఎంత ఉన్న ప్రభుత్వం భరిస్తుందని, రూ. 20లకు కిలో ఉల్లిగడ్డలు అందిస్తామని పేర్కొన్నారు. నగరంలో 46సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్లోని పలు కార్మిక సంఘాలు ఏఐటీయూసీ ఇతర సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. -
నిఘా నేత్రం జర భద్రం
హైదరాబాద్: రోడ్డుపై వాహనదారుల ఆగడాలను అరికట్టడానికి హైదరాబాద్ మహానగర పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు మెడలో అధునాతన వీడియో కెమెరాలు ధరించారు. ఈ వీడియో కెమెరాల సహాయంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు పారదర్శకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాహనదారులు, పోలీస్ సిబ్బందికి మధ్య జరిగే సంభాషణలు మొత్తం కెమెరాలో రికార్డ్ అవుతుంది. కాగా, ఈ వ్యవస్థ ద్వారా పోలీసులు.. మైనర్ వాహనదారులను గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. -
'నిఘా అవసరమే'
విజయవాడ: విజయవాడ పడమట పరిధిలోని టీచర్స్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం నగర పోలీస్ కమిషనర్ ఎబి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మారిపోతున్న జీవన విధానంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం కోసం సీసీ కెమెరాల నిఘా అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాదిరిగానే అన్నికాలనీలు సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
అంతా మీ కళ్ల ముందే..!
పారదర్శకతకు పెద్దపీట వేసిన వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా తన చాంబర్లో సీసీ కెమెరా ఏర్పాటు.. ఇంటర్నెట్తో అనుసంధానం ఎవరిని కలిసినా, ఏం మాట్లాడినా అంతా నిక్షిప్తం ఇంటర్నెట్ ద్వారా ఎక్కడినుంచైనా గమనించొచ్చు హైదరాబాద్: సురేశ్‌చందా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి. సచివాలయంలోని ‘డి’ బ్లాక్ రెండో అంతస్తులోని ఆయన చాంబర్లోకి ప్రవేశించగానే కొట్టొచ్చినట్లుగా సీసీ కెమెరా కనిపిస్తుంది. ఆయన వద్దకు ఎవరు వెళ్లినా ఆ కెమెరాలో రికార్డయిపోతుంది. అంతేకాదు ఎప్పుడైనా, ఎవరైనా ఆ కెమెరాలోంచి ఆ చాంబర్‌ను పరిశీలించే ఏర్పాటూ ఉంటుంది. ఇది ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసిన కెమెరా కాదు. పాలనలో పారదర్శకత కోసం స్వచ్ఛం దంగా సురేశ్‌చందానే ఆ సీసీ కెమెరాను ఏర్పాటు చేయించుకున్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఇలా తన చాంబర్లోనే సీసీ కెమెరా ఏర్పాటు చేయించుకోవడం చర్చనీయాంశమైంది. సురేశ్‌చందా దీని గురించి చెబుతూ.. ‘‘కేరళ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒకరు తన చాంబర్లో ఇలాగే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనే నాకు ఆదర్శం. అవినీతి అక్రమాల నిరోధానికి పారదర్శకత ప్రాణం వంటిది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఎవరు వచ్చి ఏం మాట్లాడినా రహస్యమంటూ ఏదీ ఉండకూడదనే ఈ ఏర్పాటు..’’ అని చెప్పడం గమనార్హం. ఆయన చాంబర్‌కు వచ్చే వారందరితోనూ ఆయన జరిపే చర్చలు, సమావేశాలు అన్నీ ఆ కెమెరాలో నిక్షిప్తమై ఉంటాయి. ఎవరైనా చూడొచ్చు.. సురేశ్‌చందా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ కలిగి ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటుంది. కెమె రా, సంబంధిత సాఫ్ట్వేర్ ధర దాదాపు రూ.7 వేలు. అన్ని కోణాల్లో తిరిగేలా కెమెరా ఏర్పాటు ఉంటుంది. ఆయన చాంబర్లో ఏం జరుగుతుందనే దానిని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కలిగి ఉన్నవారు తమ కంప్యూటర్ లేదా సెల్‌ఫోన్ ద్వారా చూడొచ్చు. 24 గంటల పాటు సీసీ కెమెరా దృశ్యాలను నిల్వచేయడానికి ఒక జీబీ సామర్థ్యం ఉంటే సరిపోతుంది. ‘‘ఎనిమిదేళ్లుగా నేను ఎక్కడ పనిచేసినా ఇటువంటి ఏర్పాటు చేసుకునేవాడిని..’’ అని సురేశ్ చందా చెప్పారు. అంతేకాదు తాను నోట్‌ఫైల్ చేసిన ఫైళ్లను కూడా తక్షణమే ఇంటర్నెట్లో పెడుతుంటారు. ‘‘ఆర్టీఐ చట్టం వచ్చాక ఏదీ రహస్యం కాదు. ఎవరు ఎప్పుడు ఏది అడిగినా నిర్ణీత కాలంలో సమాచారం ఇస్తు న్న నేపథ్యంలో ఎవరూ అడగకుండానే సమాచారం అం దరికీ అందుబాటులో ఉంచ డం మరింత పారదర్శకత అవుతుంది..’’ అని చెబుతున్నారాయన. గాంధీ ఆసుపత్రిలో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోనూ 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సురేశ్‌చందా రంగం సిద్ధం చేశారు. ఆ ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన యోచిస్తున్నారు. పారిశుద్ధ్యం, వైద్యుల రాకపోకలు, వైద్య సేవలు సక్రమంగా అందించడం కోసం రూ.30 లక్షలతో ఐపీ కలిగిన 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా టెండర్లు పిలవాల్సిందిగా ఆదేశించారు కూడా. ‘‘అక్కడికి వెళ్లి రోజూ పర్యవేక్షించడం కష్టం. అదే సీసీ కెమెరాలు ఉంటే సచివాలయంలోని నా కంప్యూటర్, మొబైల్ ద్వారా కూడా పర్యవేక్షించవచ్చు. తద్వార ఆస్పత్రిలో వైద్యసేవలు మరింత మెరుగ్గా అందుతాయి..’’ అని సురేశ్‌చందా పేర్కొన్నారు. ఇలా వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లోనూ, కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్యవిద్యా విభాగం వంటి వాటిల్లోనూ సీసీ కెమెరాలు పెట్టే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.