కోకా సుబ్బారావు అప్పుడే చెప్పారు! | MP Sharma and Kharak Singh's case: 'Privacy not a Fundamental Right,' Supreme Court had held decades ago | Sakshi

కోకా సుబ్బారావు అప్పుడే చెప్పారు!

Aug 25 2017 9:27 AM | Updated on Sep 2 2018 5:24 PM

కోకా సుబ్బారావు అప్పుడే చెప్పారు! - Sakshi

కోకా సుబ్బారావు అప్పుడే చెప్పారు!

దేశంలో గోప్యత హక్కు అంశం మొదటిసారి 1954లోనే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎంపీ శర్మ వర్సెస్‌ సతీష్‌చంద్ర కేసుగా రికార్డయిన ఈ కేసులో గోప్యత అంశాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు.

దేశంలో గోప్యత హక్కు అంశం మొదటిసారి 1954లోనే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎంపీ శర్మ వర్సెస్‌ సతీష్‌చంద్ర కేసుగా రికార్డయిన ఈ కేసులో గోప్యత అంశాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు..అమెరికాలో మాదిరిగా ఇక్కడ గోప్యత హక్కు ప్రసాదించడం కుదరదని తేల్చిచెప్పింది.

1952 జూన్‌లో దివాలాతీసిన దాల్మియా జైన్‌ ఎయిర్‌వేస్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి సంబంధించిన రికార్డులు, ఫైళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ సదరు సంస్థ 1954లో సుప్రీం కోర్టుకెక్కింది. ప్రైవేటు ఆస్తులకు సంబంధించి ఇలాంటి సోదాలు జరిపి, దస్తావేజులు స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని దాల్మియా ఎయిర్‌వేస్‌ వాదించింది. కేసును విచారించిన అత్యున్నత ధర్మాసనం అమెరికా రాజ్యాంగంలోని నాలుగో సవరణ మాదిరిగా భారత రాజ్యాంగంలో గోప్యత హక్కుపై ప్రత్యేక నిబంధనలేవీ లేవని తీర్పు ఇచ్చింది.

అయితే గోప్యత హక్కు గురించి రాజ్యాంగంలో ప్రత్యేకించి చెప్పనప్పటికీ ఇది వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో అంతర్భాగమని 1964లో ఓ కేసుకు సంబంధించి మెజారిటీ అభిప్రాయంతో విభేదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోకా సుబ్బారావు స్పష్టం చేశారు. తర్వాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సుబ్బారావు ఇలా తొలిసారి ఈ విషయంపై సూటిగా మాట్లాడిన జడ్జీగా చరిత్రకెక్కారు.

తాను నేరస్తుడనే అనుమానంతో పోలీసులు ఎప్పుడుపడితే అప్పుడు తనను ఇంటి నుంచి బలవంతంగా తీసుకుపోవడంపై ఖరక్‌సింగ్‌ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ రెగ్యులేషన్‌ చట్టాన్ని సవాలు చేస్తూ 1963లో సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని ఆరుగురు జడ్జీలు కూడా వ్యక్తిగత గోప్యతను హక్కుగా పరిగణించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా మెజారిటీ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పుతో విభేదించిన జస్టిస్‌ కోకా సుబ్బారావు గోప్యత హక్కుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.  (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement