ఈ తీర్పు ప్రభావం తీవ్రం..!
పలు చట్టాల మూలాలను స్పృశించే అవకాశం
వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పు... దేశంలోని చట్టాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏది గోప్యత... ఏది కాదు అనే దాన్ని విస్పష్టంగా నిర్వచించాల్సి వస్తుంది. ఇప్పటివరకు గోప్యత విషయంలో ప్రభుత్వానికి, పౌరులకు మధ్యే ఎక్కువగా వివాదాలు నెలకొన్నాయి. ఇప్పుడిది ప్రాథమిక హక్కుగా సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పడంతో నేటి డిజిటల్ యుగంలో ప్రైవేటు సంస్థలు, పౌరులకు మధ్య లెక్కకు మిక్కిలి న్యాయ వివాదాలు నెలకొనే ప్రమాదముంది. గోప్యతకు భంగం కలిగిందనే కేసులు పెద్ద సంఖ్యలో వస్తాయి. గురువారం సుప్రీం తీర్పుతో... పెళ్లి, కుటుంబ వివరాలు, లైంగిక ఆసక్తులు... ఇలాంటి వివరాలన్నింటికీ రాజ్యాంగ రక్షణ ఏర్పడింది.
క్రెడిట్ కార్డులు, ఖాతాల కోసం బ్యాంకులతో పంచుకున్న వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు సదరు సంస్థలు గోప్యంగా ఉంచాల్సిందే. సామాజిక మాధ్యమాలకు ఇచ్చిన వివరాల విషయంలోనూ ఆ సంస్థలు గోప్యతను పాటించాల్సిందే. వ్యాపారాన్ని పెంచుకోవడానికి డాటాను నమ్ముకుంటున్న కంపెనీలకు, డాటాను అమ్ముకుంటున్న వారికీ ఇది పెద్ద ఎదురుదెబ్బ. తన వివరాలను మీకెవరు ఇచ్చారంటూ... కంపెనీలను కోర్డుకు ఈడ్చే శక్తిని సుప్రీం తీర్పు సామాన్యుడికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పు ప్రధానంగా వేటిపై ప్రభావం చూపుతుందనేది ఓసారి పరిశీలిద్దాం...
ఆధార్ కేసు
కేంద్ర ప్రభుత్వం ఆధార్ కోసం వేలిముద్రలు, ఐరిస్ తీసుకోవడం, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్లు తదితర వ్యక్తిగత వివరాలను సేకరించడాన్ని సవాల్ చేస్తూ... పలు కేసులు సుప్రీంకోర్టు ముందున్నాయి. వ్యక్తి శరీరంపై తనకే పూర్తి హక్కులుంటాయని, వేలిముద్రలు, ఐరిస్ ఇవ్వడానికి నిరాకరించే హక్కు పౌరులకు ఉంటుందనేది పిటిషనర్ల వాదన. అలాగే తమ వ్యక్తిగత సమాచారం ఏ మేరకు భద్రమనేది వీరి ఆందోళన. ఐటీ రిటర్న్ సహా పలు ప్రభుత్వ పథకాలకు, సేవలకు ఆధార్‌తో ముడిపెట్టడాన్ని కూడా సవాల్ చేస్తూ పిటిషన్లు ఉన్నాయి. ఆధార్‌కార్డు కోసం సమర్పించిన వివరాలు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతున్నాయని, అవి వాణిజ్య అవసరాల కోసం ఈ వివరాలను వాడుకుంటున్నాయి కాబట్టి... ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని పిటిషనర్ల వాదన. బయోమెట్రిక్ వివరాలు బహిర్గతమైతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని, వేలిముద్రలను కృత్రిమంగా తయారుచేసి... ఆ గ్లవ్స్‌తో నేరాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏమిటని పిటిషనర్లు ప్రశ్నించారు. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా తొమ్మిది మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పినందున... ఆధార్ కేసుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. గోప్యత ఇప్పుడు ప్రాథమిక హక్కు కాబట్టి ఆధార్ విధానం రాజ్యాంగానికి లోబడి ఉందా? లేదా? అనేది ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేలుస్తుంది.
సెక్షన్ 377
భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తుంది. గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు తేల్చిచెప్పినందున ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్) గ్రూపులు సెక్షన్ 377ను సవాల్ చేస్తాయి. ఇద్దరు మేజర్ల పరస్పర అంగీకారంతో ఒక గదిలో జరిగేదాన్ని ఎలా నేరంగా పరిగణిస్తారని, ఇది తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని వీరి వాదన. ఎలాంటి లైంగిక వాంఛలు ఉన్నాయనే ఆధారంగా సెక్షన్ 377 సమాజంలోని కొందరి పట్ల వివక్ష చూపుతోందని గతంలోనే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఈ సెక్షన్‌ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ... అది కోర్టు పని కాదని, పార్లమెంటు చేయాలని చెప్పింది. వ్యక్తిగత గోప్యత హక్కుగా మారినపుడు... స్వలింగ సంపర్కనేరానికి ఎవరినైనా అరెస్టు చేసి అభియోగాలు మోపడం కూడా సాధ్యమయ్యే పనికాదు. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని పోలీసులను కోర్టుకీడ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్షన్ 377 నిలబడదని నిపుణుల అభిప్రాయం.
మారిటల్ రేప్
భార్య సమ్మతి, ఇష్టం లేకుండా సంభోగానికి పాల్పడితే... పాశ్చాత్య దేశాల్లో దాన్ని రేప్‌గానే పరిగణిస్తున్నారు. అయితే భారత్‌లో మాత్రం ఇది నేరం కాదు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ వచ్చే సోమవారం ఢిల్లీ హైకోర్టు ముందుకు రానుంది. గోప్యత హక్కుకు రాజ్యాంగబద్ధత రావడం... స్త్రీ శరీరంపై ఆమెకే పూర్తి హక్కులుంటాయనే వాదనను బలపరుస్తుందని నిపుణుల అభిప్రాయం.
డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ బిల్లు
జాతీయ, ప్రాంతీయ స్థాయిలో పౌరుల జన్యు చిత్రపటాల (డీఎన్‌ఏ)తో డాటా బ్యాంకును ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. పలు కేసుల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. 2007 నుంచి పలుమార్లు ముసాయిదా బిల్లులో మార్పు చేర్పులు చోటుచేసుకున్నాయి. 2017 జూలైలో తాజా ముసాయిదాను లా కమిషన్ రూపొందించింది. గోప్యత, సమాచార భద్రత, శాంపిల్స్ రక్షణ, డీఎన్‌ఏ సమాచారంలో కచ్చితత్వం, ఎలా ఉపయోగిస్తారు, డీఎన్‌ఏ సమాచార మార్పిడి ఎలా ఉంటుంది, లోపభూయిష్ట సమాచారాన్ని తొలగించడం... తదితర అంశాలపై బిల్లులో స్పష్టత లేదు. చట్టసభలకే వీటిని వదిలేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అయిన నేపథ్యంలో ప్రతి పౌరుడి జన్యు చిత్రపటాన్ని భద్రపరిచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు అంత సులభంగా వెలుగు చూడకపోవచ్చు.
వాట్సాప్ డాటా షేరింగ్
సామాజిక మాధ్యమమైన వాట్సాప్ తమ ఖాతాదారుల (సభ్యులు) వివరాలను మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌తో పంచుకుంటోంది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తాము వాట్సాప్‌కు మాత్రమే తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చామని, మరొకరితో దీన్ని పంచుకోవడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని వాదించారు. దాంతో కొత్త ప్రైవసీ విధానాన్ని తీసుకొస్తామని వాట్సాప్ చెప్పగా హైకోర్టు అంగీకరించింది. దీన్ని పిటిషన్‌దారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గోప్యత ప్రాథమిక హక్కు అయిన నేపథ్యంలో వాట్సాప్‌కు ఇబ్బందులు తప్పవు. అలాగే ఇతర సామాజిక మాధ్యమాలు కూడా గోప్యత విషయంలో భారత చట్టాలకు లోబడి పనిచేయాల్సి వస్తుంది. చాట్ హిస్టరీని సామాజిక మాధ్యమ సంస్థలు స్టోర్ చేయవచ్చా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.
సెర్చ్ హిస్టరీ సంగతి?
మనం గూగుల్‌లో దేనిగురించైనా వెదికితే మన సెర్చ్ హిస్టరీని గూగుల్ స్టోర్ చేస్తోంది. మన ఆసక్తులేమిటో గుర్తించి మన ఐపీ అడ్రస్‌కు మన అభిరుచులకు తగినట్లుగా యాడ్స్‌ను పోస్ట్ చేస్తోంది. మనం ఏ సైటును ఓపెన్ చేసినా మన ఆసక్తులకు తగ్గట్టు∙యాడ్స్ వస్తాయి. ఇది గూగుల్‌కు అతిపెద్ద ఆదాయవనరు. తన సెర్చ్ హిస్టరీని వాణిజ్య అవసరాలకు వాడుకుంటూ గూగుల్ తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందని ఎవరైనా కోర్టుకు ఎక్కితే? ఇలాంటి లెక్కలేనన్ని ప్రశ్నలకు రేప్పొద్దున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు వెతకాల్సి ఉంటుంది.
అబార్షన్
‘పిండాన్ని మోసి బిడ్డను కనాలా, గర్భస్రావం చేయించుకోవాలా అనేది మహిళకుండాల్సిన స్వేచ్ఛ. ఇది కూడా రైట్ టు ప్రైవసీ కిందకు వస్తుంది’ అని చలమేశ్వర్ అన్నారు. మన ప్రస్తుత చట్టాల ప్రకారం గర్భం దాల్చిన 20 వారాల తర్వాత అబార్షన్‌కు చట్టాలు అంగీకరించవు. సదరు గర్భం వల్ల తల్లి ప్రాణానికి ముప్పుందని డాక్టర్ల బృందం సర్టిఫై చేస్తే మాత్రం మినహాయింపు ఉంటుంది. అత్యాచార బాధితురాళ్లు, పది పన్నెండేళ్ల వయసులో అసలు జరుగుతున్నదేమిటో కూడా తెలియని పసివయసులో ఈ నిబంధన కారణంగా తల్లులు కావాల్సి వస్తోంది. ఇటీవలే ఓ పదేళ్ల అత్యాచార బాధితురాలిని అనారోగ్యం కాబట్టి ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పి తీసుకెళ్లి కాన్పు జరిపించారు. చాలాకాలంగా భారతదేశంలో అబార్షన్ చట్టాలను మార్చాలనే డిమాండ్ ఉంది. జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యలు చట్టంలో మార్పు కోరుతున్న సంస్థల డిమాండ్లకు ఊతమిస్తాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్