గోప్యత ప్రాథమిక హక్కే | Right to Privacy is a fundamental right, it is intrinsic to right to life: Supreme Court | Sakshi
Sakshi News home page

గోప్యత ప్రాథమిక హక్కే

Published Fri, Aug 25 2017 1:37 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

గోప్యత ప్రాథమిక హక్కే - Sakshi

గోప్యత ప్రాథమిక హక్కే

పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛలో గోప్యత అంతర్భాగం
ఆర్టికల్‌ 21, రాజ్యాంగంలోని మూడో భాగం ఇదే చెబుతున్నాయి
9 మంది సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక, ఏకగ్రీవ తీర్పు
దీనిపై గతంలో వెలువరించిన తీర్పుల రద్దు
సంస్కృతిలో బహుళత్వాన్ని గోప్యత ప్రతిఫలిస్తుందని వ్యాఖ్య
ఆధార్‌పై ప్రత్యేక భద్రతావ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్రానికి సూచన
సుప్రీం తీర్పును స్వాగతించిన కేంద్రం, న్యాయనిపుణులు  


భారతీయుల మౌలిక జీవన విధానంపై విస్తృత ప్రభావం చూపగల చరిత్రాత్మక తీర్పును గురువారం సుప్రీంకోర్టు వెలువరించింది. వ్యక్తిగత గోప్యత(ప్రైవసీ) ప్రాథమిక హక్కేనని తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో వ్యక్తిగత గోప్యత కూడా విడదీయలేని భాగమేనని.. రాజ్యాంగంలోని  3వ భాగం, ఆర్టికల్‌ 21ల్లో పేర్కొన్న జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల్లో గోప్యత కూడా అంతర్భాగమని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అయితే, మిగతా ప్రాథమిక హక్కుల్లా.. ఇది నిరపేక్ష హక్కు కాదని, దీనికి పరిమితులు, నియంత్రణలుంటాయని వివరణ ఇచ్చింది. భారతీయుల ఆహార అలవాట్లు, లైంగిక విధానాలు, సామాజిక నిబంధనలు, అమల్లో ఉన్న పలు చట్టాలు, తదితర కీలక అంశాలపై  ప్రభావం చూపనున్న ఈ తీర్పును పార్టీలకతీతంగా స్వాగతించారు.

న్యూఢిల్లీ: భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచే విషయంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. రాజ్యాంగ నియమాల ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న గోప్యత ప్రాథమిక హక్కు కాదనే నిర్ణయాన్ని కొట్టివేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, మూడో భాగం ప్రకారం గోప్యత అనేది.. ప్రజల జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల్లో అంతర్గతంగా సమ్మిళితమై ఉంటుంది’ అని పేర్కొంది. గోప్యత.. వ్యక్తిగత గౌరవానికి రాజ్యాంగ మూలమని స్పష్టం చేసింది.

వివిధ సంక్షేమ పథకాల లాభాలను అందుకునేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 547 పేజీల తీర్పును వెలువరించింది. అయితే.. తాము గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అనే అంశానికే పరిమితమయ్యామని.. ఆధార్‌ వల్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందా లేదా అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనమే విచారిస్తుందని స్పష్టం చేసింది. ఆధార్‌ వివరాలను కాపాడేందుకు ప్రత్యేక భద్రతావ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్రానికి సూచించింది. కాగా సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తోపాటుగా సోలీ సొరాబ్జీ వంటి న్యాయ నిపుణుల స్వాగతించారు. ‘ఏ ప్రాథమిక హక్కు కూడా సంపూర్ణం కాదు. ప్రతి హక్కూ పరిమితులు, నియంత్రణలతో కూడుకున్నదే’ అని సోరాబ్జీ పేర్కొన్నారు.

పాత తీర్పులు రద్దు: సీజేఐ ఖేహర్‌
తీర్పు అమలు భాగాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ చదివి వినిపించారు. గతంలో ఎంపీ శర్మ (1952), ఖరక్‌ సింగ్‌ (1960) కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను రద్దుచేసినట్లు వెల్లడించారు. వ్యక్తిగత గౌరవం, ప్రజల మధ్య సమానత్వం, స్వేచ్ఛగా జీవించాలని కోరుకోవటం భారత రాజ్యాంగ మూల స్తంభాల వంటివి. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలను రాజ్యాంగం సృష్టించలేదు. ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా, అవిభాజ్యంగా ఉండే అంశాలను రాజ్యాంగం గుర్తించింది. గోప్యత రాజ్యాంగం పరిరక్షించే హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించటం, వ్యక్తిగత స్వేచ్ఛనుంచే గోప్యత పుట్టుకొచ్చి ంది. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ, గౌరవంలోనూ గోప్యత అంతర్భాగమే’ అని తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఆర్కే అగర్వాల్, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్, జస్టిస్‌ ఏఎం సప్రే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లు ఈ తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో ఉన్నారు. ఈ తొమ్మిది మంది గతంలో సుప్రీంకోర్టు రెండు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ‘గోప్యతను కాపాడటం రాజ్యాంగ బాధ్యత కాద’నే నిర్ణయాన్ని ఏకగ్రీవంగా కొట్టేశారు.  

కోర్టు హాల్లో ఉత్కంఠ
కేసు విచారణ సందర్భంగా మూడు వారాల్లో ఆరు రోజుల పాటు సుప్రీంకోర్టులో గోప్యతకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. గురువారం గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అనే అంశంపై ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో కోర్టు హాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అరవింద్‌ దతార్, కపిల్‌ సిబల్, గోపాల్‌ సుబ్రమణ్యం, ఆనంద్‌ గ్రోవర్, సీఏ సుందరం, రాకేశ్‌ ద్వివేదీ వంటి సీనియర్‌ న్యాయవాదులు  తీర్పు కోసం ఎదురుచూశారు. పిటిషనర్లలో ఒకరైన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కేఎస్‌ పుట్టస్వామి, మెగసెసె అవార్డు గ్రహీత శాంతా సిన్హా తదితరులు ఆధార్‌ ప్రజల గోప్యత హక్కును హరిస్తుందని వాదించిన సంగతి తెలిసిందే.

ముందు గోప్యత.. తర్వాత ఆధార్‌!
జూలై 7న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు పిటిషనర్లు  ఆధార్‌పై తమ వాదనలు వినిపించారు. అయితే ఆధార్‌పై సమస్యలపై సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తే నిర్ణయం తీసుకుని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తారని నాడు కోర్టు పేర్కొంది. అనంతరం దీనిపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని సీజేఐ ఖేహర్‌ ఏర్పాటుచేశారు. అయితే, వాదనల సందర్భంగా అసలు గోప్యత రాజ్యాంగ ప్రకారం ప్రాథమిక హక్కేనా కాదా? అనే అంశాన్ని తేల్చేందుకు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలని బెంచ్‌ సూచించింది. అయితే.. ఖరక్‌ సింగ్‌ (1960), ఎంపీ శర్మ (1950) కేసుల్లో ‘గోప్యత’పై సుప్రీంకోర్టు నిర్ణయాలను పున:పరిశీలించాలన్న నిర్ణయంతో సీజేఐ జస్టిస్‌ ఖేహర్‌.. 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటుచేశారు.

దీనిపై విచారణ జరిపిన ఈ ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేస్తూ.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్స్‌లో ఉంచటం ద్వారా ఆ సమాచారం తప్పుగా వినియోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక యుగంలో గోప్యతను కాపాడటం అంత సులువేం కాదని అభిప్రాయపడింది. గోప్యత సంపూర్ణమైన హక్కు కాదని.. దీనిపై కొన్ని న్యాయపరమైన నియంత్రణలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని కేంద్రం తన వాదనలను వినిపించింది. గోప్యత ఎంతమాత్రమూ ప్రాథమిక హక్కు కాదని అటార్నీ జనరల్‌ పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, పేద ప్రజలకుండే జీవించే హక్కు, కూడు, గూడు హక్కుల కన్నా గోప్యత హక్కు గొప్పదేం కాదని కేంద్రం పేర్కొంది.

విచారణ సాగిందిలా..
జూలై 7:
ఆధార్‌ను పలు పథకాలకు అనుసంధానించడంపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుందని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.

జూలై 12:
ఆధార్‌ గోప్యతపై విచారణకు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్‌ను ఏర్పాటు చేస్తూ సీజేఐ జస్టిస్‌ ఖేహర్‌ నిర్ణయం తీసుకున్నారు.

జూలై 18:
ఈ ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్‌ గోప్యత ప్రాథమిక హక్కా? కాదా? అన్న విషయాన్ని నిర్ణయించేందుకు 9 మందితో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఆర్కే అగర్వాల్, జస్టిస్‌ ఫాలీ నారిమన్, జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ల బెంచ్‌ ఏర్పాటైంది.

జూలై 19:
వ్యక్తిగత గోప్యత అన్నది నిరపేక్ష హక్కు కాదని..దాన్ని నియంత్రించవచ్చని సుప్రీం అభిప్రాయపడింది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు కాదని కేంద్రం వాదించింది.

జూలై 26:
గోప్యత హక్కుకు అనుకూలంగా కర్ణాటక, పశ్చిమబెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి.

జూలై 26:
వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే అందుకు సంబంధించిన అన్ని పాƇ్శా్వలను ప్రాథమిక హక్కు పరిధిలో చేర్చలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

జూలై 27:
గోప్యత అన్నది స్వతంత్ర హక్కు కాదని, అది కేవలం భావన మాత్రమేనని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు విన్నవించింది.

ఆగస్టు 1:  
ప్రజా బాహుళ్యంలో ఉన్న పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించడానికి మరింత విస్తృతమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీం అభిప్రాయపడింది.

ఆగస్టు 2:
ప్రస్తుత సాంకేతిక యుగంలో గోప్యత అన్నది ఓడిపోతున్న యుద్ధంగా మారిందన్న అత్యున్నత ధర్మాసనం, తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఆగస్టు 24:
రాజ్యాంగం ప్రకారం గోప్యత అన్నది ప్రాథమిక హక్కేనని సుప్రీం చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది.   

గోప్యత అంటే!
వ్యక్తిగత అన్యోన్యత, కుటుంబ జీవితం, వివాహం, సంతానం, ఇల్లు, లింగ నేపథ్యం వంటి అంశాలన్నీ గోప్యత కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ‘తన జీవితం ఎలా ఉండాలో కోరుకోవటం గోప్యత అవుతుంది. భిన్నత్వాన్ని కాపాడుతూ.. మన సంస్కృతిలోని బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని గోప్యత సూచిస్తుంది. గోప్యతపై న్యాయపరమైన అంచనాలు సన్నిహితం నుంచి వ్యక్తిగతంలో, వ్యక్తిగతం నుంచి బహిరంగ అంశాల్లో వేర్వేరుగా ఉంటాయి. అయితే బహిరంగ వేదికపై వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకుండా చేయటం చాలా ముఖ్యం’ అని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

పటిష్టమైన భద్రతా వ్యవస్థ కావాలి
రాజ్యాంగంలో సాధారణ, ప్రాథమిక హక్కులంటూ వేర్వేరుగా ఉండవన్న ప్రభుత్వ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అయితే..ప్రభుత్వానికి మరో అవకాశాన్ని కల్పిస్తూ.. ‘ఆధునిక యుగంలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు పటిష్టమైన వ్యవస్థను నిర్మించండి. ఇది ప్రజల వ్యక్తిగత ప్రయోజనాలను, ప్రభుత్వం న్యాయపరమైన అవసరాలను సమతుల్యం చేసేలా ఉండాలి. జాతీయ భద్రత, నేరాలను తగ్గించటం, సృజనాత్మకతను ప్రోత్సహించటం, సామాజిక సంక్షేమ పథకాల ఫలితాలు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవటమే ప్రభుత్వ అవసరం కావాలి’ అని కోర్టు పేర్కొంది.

న్యాయమూర్తుల అభిప్రాయాలు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్, జస్టిస్‌ ఆర్కే అగర్వాల్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ల తరఫున కూడా జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ తీర్పు రాశారు. ‘రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల నుంచి గోప్యత హక్కు ఉద్భవిస్తుంది. ఓ వ్యక్తి స్వతంత్రతను గోప్యత కాపాడుతుంది. ఆ వ్యక్తి జీవితంలోని ముఖ్య ఘట్టాలను నియంత్రిచుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. అయితే ఇతర ప్రాథమిక హక్కుల్లాగా ఇది సంపూర్ణమైన హక్కు కాదు. సమాచార సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలి. రాజ్యాంగం.. అది అమల్లోకి వచ్చిన రోజుల్లో ఎలా ఉందో అలానే మిగిలిపోకూడదు. సవాళ్లను ఎదుర్కొనేందుకు కాలానికి, అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగం తప్పక పరిణామం చెందాలి. 70 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికి సాంకేతికతపరంగా ఎంతో మార్పు వచ్చింది. రాజ్యాంగం మూల విలువల ఆధారంగానే భవిష్యత్తు తరాలకు సరిపోయేలా మారుతుండాలి.

అలాగే అసాధారణ లైంగిక ధోరణి కారణంగా ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) వర్గానికి గోప్యత హక్కును నిరాకరించరాదు. వ్యక్తుల లైంగిక అభిలాషల ఆధారంగా వివక్ష చూపిస్తే వారి వ్యక్తిత్వం తీవ్రంగా దెబ్బతింటుంది. ఎల్జీబీటీలు తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణలు గోప్యతతో పాటు వ్యక్తిగత లైంగిక అంశాలకు కూడా రక్షణ ఇస్తున్నాయి. ప్రస్తుతం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్‌ 377 విషయమై సుప్రీం కోర్టులోని ఓ బెంచ్‌ విచారణ జరుపుతున్నందున, దాని రాజ్యాంగ చెల్లుబాటుపై సదరు ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుంది.
జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఆర్కే అగర్వాల్, జస్టిస్‌ నజీర్‌

‘నేటి డిజిటల్‌ యుగంలో పిల్లల గోప్యతను పరిరక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. పిల్లలు సాంకేతికత, సామాజిక మాధ్యమాలకు బాగా అలవాటుపడుతున్నారు. ఏ అంటే యాపిల్, బీ అంటే బ్లూటూత్, సీ అంటే చాట్‌ అని నేర్చుకుంటున్నారు. తెలిసీ తెలియక చేసే తప్పులకు వారు బలికాకుండా చూడాలి. గోప్యత హక్కును ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యక్తులు, సంస్థల నుంచి కాపాడుకోవాలి. సాంకేతికత విస్తృతంగా అభివృద్ధి చెందడంతో ప్రభుత్వం మన వ్యక్తిగత జీవితంలోకి చొరబడేందుకు అవకాశాలు పెరిగాయి.  ఓ వ్యక్తి తన ఇంట్లోకి రావడానికి ఒకరిని అనుమతించడం అంటే ఎవరైనా లోనికి రావొచ్చని అర్థం కాదు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కే. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ఇతరులు వ్యక్తుల ఆంతరంగిక వ్యవహారాల్లోకి చొరబడకుండా అది కాపాడుతుంది.’
– జస్టిస్‌ కిషన్‌ కౌల్‌

‘ఓ రోగి తనకు జీవితాంతం కొనసాగాల్సిన వైద్య చికిత్సను వద్దని చెప్పి జీవితాన్ని ముగించడం అనేది గోప్యత హక్కు కిందకు వస్తుంది. బిడ్డను కనాలా, గర్భస్రావం చేయించుకోవాలా అనేది సదరు గర్భిణి గోప్యత హక్కు పరిధిలో ఉంటుంది. ప్రజలు ఏం తినాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎవరితో కలసి ఉండాలి అనే విషయాలను ప్రభుత్వం నిర్దేశించడాన్ని ఎవరూ ఒప్పుకోరు. గోప్యత కావాలనుకుంటారు’    
– జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌   

‘నా అభిప్రాయంలో ఏ వ్యక్తికైనా గోప్యత అనేది పుట్టుకతోనే సహజంగా లభించే హక్కే. ఆ వ్యక్తి చివరి శ్వాస వరకు గోప్యత హక్కు ఉంటుంది. అది వాస్తవానికి వ్యక్తి నుంచి వేరు చేయలేని, మార్చలేని హక్కు. మనిషితోపాటే పుట్టి, మనిషితోపాటే పోతుంది. అయితే ఈ హక్కుపై ప్రభుత్వాలు సామాజిక, నైతిక కోణంలో ప్రజాహితార్థం కొన్ని న్యాయమైన పరిమితులు విధించొచ్చు’
– జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సప్రే

‘దేశంలో ప్రభుత్వాలు వస్తూ, పోతున్నప్పటికీ ప్రాథమిక హక్కులు శాశ్వతంగా ఉంటాయి. పాలక పార్టీలు పార్లమెంటులో తమకున్న మెజారిటీతో చట్టాలు చేయగలవు. అవసరం లేదనుకుంటే చట్టాలను రద్దు చేయగలవు. కానీ తాము ఎన్నుకున్న ప్రభుత్వాలతో సంబంధం లేకుండా రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కుల్ని పౌరులు అనుభవించవచ్చు. ఎందుకంటే ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగా ఉన్న గోప్యత హక్కు శాశ్వతమైనది. ఒకవేళ ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగకరంగా మారితే సుప్రీం కోర్టు వాటిని చెల్లనివిగా ప్రకటిస్తుంది’  
– జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌

‘పురాణాల్లోనూ వ్యక్తిగత గోప్యత ప్రస్తావన ఉంది. స్త్రీని పరపురుషుడు చూడకూడదని రామాయణంలో ఉంది. అలాగే ఇస్లాం ప్రకారం ఇతరుల ఇళ్లలోకి తొంగిచూడటం నిషిద్ధం. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా జీవించాలని బైబిల్‌ చెబుతుంది. ప్రాథమిక హక్కులను పొందాలంటే ముందుగా గోప్యత హక్కు ఉండాల్సిందే. మానవుల స్వేచ్ఛ నుంచి వ్యక్తిగత గోప్యత హక్కును
విడదీయలేం’
– జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement