DIG Ravi Varma
-
ఉట్నూరులో వాట్సాప్ మంట
ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్టు చేసిన యువకుడు ► చర్యలు తీసుకోవాలంటూ మరో వర్గం ఆందోళన ► ఇరువర్గాల మధ్య రాళ్లదాడులు.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం ఉట్నూర్/ఉట్నూర్‌రూరల్ (ఖానాపూర్): ఓ వర్గాన్ని కించపరుస్తూ ఓ యువకుడు వాట్సాప్‌లో చేసిన పోస్టు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో మంటపెట్టింది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు, రాళ్ల దాడులకు దారితీసింది. శనివారం రాత్రి నుంచి మొదలైన ఈ ఆందోళన ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న ఇరువర్గాలు దుకాణాలు, వాహనాల ధ్వంసానికీ దిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 144 సెక్షన్ విధించారు. సమీపంలోని నాలుగు జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను రప్పించి.. భారీ స్థాయిలో మోహరించారు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. లాఠీచార్జి.. రబ్బరు బులెట్ల ప్రయోగం ఉట్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వారిని కించపరుస్తూ వాట్సప్‌లో వీడియోను పోస్టు చేశాడు. దీంతో ఆ వర్గానికి చెందిన వారు సదరు యువకుడిని అరెస్టు చేయాలంటూ శనివారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రహదారి వెంట పలు దుకాణాలను ధ్వంసం చేశారు. ఆదివారం ఉట్నూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కూడా ఆ యువకుడిని అరెస్టు చేయాలంటూ పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎస్పీ ఎం.శ్రీనివాస్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అయితే బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓ దుకాణ సముదాయం వద్ద చోటు చేసుకున్న ఘర్షణ.. ఇరువర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దుకాణా లు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు పలుసార్లు లాఠీచార్జీ చేశారు. బాష్పవాయు గోళాలను, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. ఎక్కడిక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాళ్ల దాడిలో ఎస్పీ శ్రీనివాస్, ఉట్నూర్ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మీనారా యణ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. శాంతి చర్యలు చేపట్టిన కలెక్టర్ కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ, కలెక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, అధికారులు ఉట్నూర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. తరతరాలుగా కలసి మెలసి జీవిస్తున్నవారంతా ఓ వ్యక్తి చేసిన అనుచిత పని కారణంగా ఘర్షణలకు దిగడం సరికాదని సూచించారు. వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఇరువర్గాల పెద్దలు కోరారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రతి ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో వార సంత కొనసాగుతంది. దీంతో ఆదివారం పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి చేరుకున్నారు. ఘర్షణలు చెలరేగడంతో భయాందోళనతో తిరుగుముఖం పట్టారు. నాలుగు జిల్లాల నుంచి పోలీసులు ఉట్నూరులో ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆదిలాబా ద్‌తో పాటు కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని సమీప మండలాల నుంచి పోలీసు సిబ్బందిని.. ఏపీఎస్పీ బెటాలియన్ ప్రత్యేక బృందాన్ని హుటాహుటిన ఉట్నూరు రప్పించారు. సుమారు 500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐదు కేసులు నమోదు వాట్సప్‌లో అనుచిత వాఖ్యలు చేస్తూ పోస్టు చేసిన యువకుడిపై కేసులు నమోదు చేశామని కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణ సముదాయాలను ధ్వంసం చేసిన వారిపై, ఆందోళనకారులపై ఐదు కేసులు నమోదు చేశామని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. -
భక్తులతో కిక్కిరిసిన మేడారం
తాడ్వాయి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెలించారు. ఇప్పటి వరకు 30వేల మంది భక్తులు దేవతలను దర్శించుకునట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మినీ మేడారం జాతర ఈ బుధవారం ప్రారంభమైంది. దీన్నే మండ మెలిగే పండగ అంటారు. నేటి (శుక్రవారం) మధ్యాహ్నం డీఐజీ రవివర్మ, ఎస్పీ భాస్కరన్, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడి అధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మినీ మేడారం మేడారం వచ్చే భక్తులంతా తిరిగి వెళ్లే సమయంలో గట్టమ్మ ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు. -
బాధితులకు బాసటగా నిలవాలి
సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి నేర సమీక్ష సమావేశంలో డీఐజీ రవివర్మ వరంగల్ : న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసు అధికారు లు, సిబ్బంది బాసటగా నిలవాలని వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝూ ఆధ్వ ర్యంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేష న్ కు వచ్చేవారితో స్నేహపూరితంగా వ్య వహరించి సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. పేదల జీవి తాలతో చెలగాటమాడుతున్న గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్ ఓపె న్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉద్యోగులను తాత్కాలికంగానే వివిధ జిల్లాలకు కేటాయించనున్నుట్ల వివరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు శాశ్వతంగా ప్రతి పోలీసును ఆయా జిల్లాల్లో నియమిస్తామన్నారు. రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ మాట్లాడుతూ పోలీసు అధికారులు పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ల వారిగా నమోదైన, దర్యాప్తు జరుగుతున్న కేసులు, జరుగుతున్న ఆలస్యానికి కారణాలపై ఆరా తీశారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్కంపాటీ, డీటీసీ, మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్పంపేట డీఎస్పీలు సత్యనారాయణరెడ్డి, రాజమహేంద్రనాయక్, పద్మనాభరెడ్డి, సుధీంద్ర, మురళీధర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ బాలరాజు, రూరల్‌లోని సీఐలు పాల్గొన్నారు. ఆఖరు సమీక్ష సమావేశమేనా...! జిల్లాల పునర్విభజనతో బుధవారం రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఉమ్మ డి వరంగల్ జిల్లా నేర సమీక్ష సమావేశం అఖరు అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడుతున్నందున నలుగురు ఎస్పీలు ఉండనున్నారు. దీంతో భవిష్యత్‌లో జరరగనున్న నేర సమీక్ష సమావేశాలు కొత్త ఎస్పీల ఆధ్వర్యంలో జరుగనున్నాయి. జిల్లాల విభజనతో ఎవరు ఏ జిల్లాకు పోతారో తెలియని పరిస్థితి, మళ్లీ అందరు కలసి సమీక్ష సమావేశంలో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల పోలీసు అధికారులంతా ఉన్నతాధికారులతో గ్రూప్ ఫొటో తీసుకున్నట్లు సమాచారం. -
అప్రమత్తంగా ఉండాలి
రవివర్మ, డిఐజీ, క్రైమ్ నాంపల్లి: రాష్ట్రంలో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని క్రైమ్స్ డీఐజీ రవి వర్మ అన్నారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ఫ్యాప్సీ, సీసీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సైబర్ క్రైమ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధే సైబర్ నేరాల పెరుగుదలకు కారణమని, ప్రతి రోజూ 20 మంది బాధితులు సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్తో చెడే ఎక్కువగా జరుగుతున్నదని, వ్యాపారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్ఫోన్లకు వచ్చే లాటరీ ఎస్ఎంఎస్లపై ఎట్టి పరిస్థితుల్లో స్పందించరాదని సూచించారు. నైజీరియన్లే సైబర్ నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు చెప్పారు. ఆన్లైన్ షాపింగ్, హోటల్స్, పెట్రోలు బంకుల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు అకౌంట్ నంబరు, క్రెడిట్‌కార్డు, డిబిట్ కార్డులను విచ్చలవిడిగా వినియోగించరదని సూచించారు. ఫ్యాప్సీ అధ్యక్షులు వెన్నం అనీల్రె డ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు బ్యాంకులతో జరిపే లావాదేవీల పట్ల నిర్లక్ష్యం వ హించవద్దని, ఎప్పటికప్పుడు మీ అకౌంట్లలో నిల్వ ఉన్న మొత్తాలను సరిచూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్సీ బ్యాంకింగ్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ గౌర శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.