సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని పక్షంలో గిరిజన విశ్వ విద్యాలయం ఇతర జిల్లాకు తరలిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ యూనివర్సిటీని ముందుగా ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించింది. తాజాగా దీన్ని వరంగల్ జిల్లాకు తరలించేందుకు ప్రస్తుత సర్కారు సమాయత్తమవుతుండటం ఇక్కడి విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
గోండు, కొలాం, తోటి, మన్నేవార్.. వంటి గిరిజన తెగలున్న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆదివాసీల సంసృ్కతి, సంప్రదాయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా అటవినే నమ్ముకుని జీవ నం కొనసాగిస్తున్న ఈ గిరిజన తెగలకు చెందిన యువతకు ఉన్నత విద్యావకాశాలు చేరువవుతాయి. ఈ ప్రత్యేక యూనివర్సిటీ జిల్లాకు తలమానికం కానుంది.
ఉట్నూర్‌లో స్థలం గుర్తింపు..
గత యూపీఏ సర్కారు రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని ఉట్నూర్‌లో ఏ ర్పాటు చేయాలనే డిమాండ్ గతంలో వెల్లువెత్తింది. గిరిజ న సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిం చాయి. ఓ గిరిజన సంఘం నేత ఉట్నూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి, గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో ఈ యూనివర్సిటీని ఉట్నూర్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చింది.
దీని ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం రెండేళ్ల కిత్రం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సుమారు 300 ఎకరాల సర్కారు భూమిని గుర్తించారు. ఇందులో యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని తేల్చా రు. 44వ నెంబర్ జాతీయ రహదారికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అప్పటి కలెక్టర్ అశోక్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు.
గత యూపీఏ ప్రభుత్వం లో మంత్రిగా బలరాం నాయక్ దీన్ని వరంగల్ జిల్లాకు తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కారు కూడా దీన్ని వరంగల్ జిల్లాకు తరలించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ యూని వర్సిటీ ఏర్పాటుకు సాధ్య అసాధ్యాలు పరిశీలించాలని వరంగల్ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలందడంతో జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది.
అభివృద్ధికి నోచుకోని జిల్లా..
ఇక్కడి ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా జిల్లా ఎంతో కాలంగా వెనుకబడిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సరైన ప్రాతినిథ్యం దక్కకపోవడం.. తదితర కారణాలతో జిల్లా అభివృద్ధికి బాటలు పడలేదు. ఇప్పుడు తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కారులో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి కీలకంగా మారారు. ఈ ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే నెలకొల్పేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గిరిజన యూనివర్సిటీపై గిల్లికజ్జాలు
Published Wed, Jul 23 2014 12:38 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement