సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఘటన వెనుక అదృశ్యశక్తులు ఉన్నాయా? ఈ ఘటనకు మావోయిస్టు పార్టీకి సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు పోలీస్ శాఖలోని కొందరు సీనియర్ అధికారులు అవుననే సమాధానం చెప్తున్నారు. ఐదేళ్లుగా పెద్దగా కదలికలు లేని మావోయిస్టు తెలంగాణ కమిటీ మళ్లీ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. పోలీస్ శాఖ దానికి దీటుగా బదులిస్తూ సరిహద్దులోకి రాకుండా అడ్డుకుంటోంది. అయితే రిక్రూట్‌మెంట్‌లో తెలంగాణ కమిటీ చాలా బలహీనంగా ఉంది. వీటికి తోడు రాష్ట్రంలో ఏ ఉద్యమం పెద్ద ఎత్తున ఇప్పటి వరకు జరిగిందీ లేదు. అందువల్ల ప్రస్తుతం ఆదివాసీలు, లంబాడీ ఉద్యమంపై మావోయిస్టు పార్టీ దృష్టి సారించినట్టు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమానిస్తోంది. ఈ అనుమానానికి ఉట్నూర్‌లో జరిగిన విధ్వంసమే బలం చేకూర్చిందంటూ పోలీస్ శాఖ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆర్గనైజింగ్‌గా జరిగిందేనా?
ఆదివాసీలు, లంబాడీలు దాడులు చేసుకున్న పరిస్థితులను గమనిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రెండు వర్గాల్లో ఇంత ఆర్గనైజింగ్‌గా దాడులు చేయడం ఇప్పటివరకు జరగలేదని, దీని వెనుక అదృశ్య శక్తులు ఉండొచ్చని సీనియర్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఉట్నూర్, ఆసిఫాబాద్, కెరిమెరీ, ఇంద్రవెల్లి తదితర ప్రాంతాలు మావోయిస్టు పార్టీకి గతంలో కంచుకోటగా నిలిచాయి. అయితే ఇప్పుడు అంతగా ప్రభావం లేకున్నా.. ఇంతటి ఆర్గనైజింగ్‌గా దాడులు జరగడానికి మావోయిస్టు పార్టీ ప్రోద్బలమే కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు.
డివిజన్ కమిటీ కార్యదర్శిగా భాస్కర్
దీనికి బలం చేకూర్చేలా మావోయిస్టు పార్టీ ఇటీవల కేకేడబ్ల్యూ(కరీంనగర్, ఖమ్మం, వరంగల్) కమిటీనీ రద్దు చేసి, దాని స్థానంలో కొత్త డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎంఏ(మంచిర్యాల–ఆసిఫాబాద్) కేంద్రాలుగా పనిచేసేలా డివిజన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడైన మైలారపు ఆదేలు అలియాస్ భాస్కర్‌ను కార్యదర్శిగా నియమించింది. దీంతో ఆసిఫాబాద్‌లోనూ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు, నూతన నియమకాలు వేగవంతం చేసేందుకు సిద్ధమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది.
అందుకే ఆ అధికారులు..
మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేసే మావోయిస్టు పార్టీ కార్యాచరణలాగే ఉట్నూర్ ఘటన జరగడం పోలీస్ అధికారులను ఆందోళనలో పడేసింది. ఇలాంటి ఘటనలు ఇతర ప్రాంతాలకు పాకకుండా ముందస్తుగా భారీ బలగాల మోహరింపు.. 144 సెక్షన్ అమలు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఐజీలు, డీఐజీలను రంగంలోకి దించడం వెనుక కారణం ఇదే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం డీఐజీగా నియమించిన ప్రమోద్‌కుమార్ గతంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఐజీ దేవేంద్రసింగ్‌చౌహాన్ కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. ఐజీ అనిల్‌కుమార్ సైతం ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన వారే. వారు పనిచేసిన కాలంలో మావోయిస్టు పార్టీ ఆ జిల్లాల్లో పాల్పడిన ఘటనలు, వాటి వెనకున్న కార్యాచరణ, వాటి నియంత్రణపై పూర్తి పట్టు ఉన్న అధికారులుగా పేరు సాధించారు. దీంతో వీరిని అక్కడ నియమించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
మాజీలకు స్పెషల్ టాస్క్?
ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ గానీ, స్థానిక దళాలు గానీ లేవు. గతంలో మావోయిస్టు పార్టీ, స్థానిక దళాల్లో పనిచేసి లొంగిపోయిన కొంతమంది ఇంకా పార్టీతో టచ్‌లో ఉన్నట్టు పోలీస్ శాఖ గుర్తించింది. మావోయిస్టు పార్టీలో కొత్త నియామకాల కోసం మాజీలను సంప్రదించి ఉంటుందా? అన్న కోణంలోనూ ఆరా తీస్తోంది. అలాగే మావోయిస్టు పార్టీకి గతంలో అనుబంధంగా పనిచేసిన గ్రామ రక్షక దళాలు మళ్లీ జీవం పోసుకుంటున్నట్టు కనిపిస్తోందని పోలీస్ అధికారులు అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం పనిచేసి ఉండటం, పైగా మిలిటెంట్ పోరాటాలకు యువతను మళ్లించడంలో సిద్ధహస్తులు కావడంతో వీరికి పార్టీ ప్రత్యేక టాస్క్ ఏమైనా అప్పగించి ఉంటుందా? అన్న కోణంలోనూ ప్రత్యేక నిఘా బృందాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివాసీ, లంబాడీ ఉద్యమాన్ని ఉపయోగించుకుని భారీగా నియామకాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ, దాని అనుంబంధ సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకే పరిస్థితి చేయిదాటకముందే డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్, ఇతర అధికారులంతా ఘటనా స్థలికి వెళ్లారని, అక్కడి అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలుస్తోంది.
రాజకీయ నాయకులపై నజర్..
ఆదివాసీలు, లంబాడీల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులపై నిఘా వర్గాలు నజర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాబూరావు, ఆత్రం సక్కులపై నిఘా పెంచినట్టు తెలిసింది. వీరి ఆధ్వర్యంలోనే సభలు జరగడంతో వీరిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీల నాయకులు, వారి కదలికలపై జిల్లా పోలీసులు ఐడీ పార్టీలను ప్రయోగించినట్టు సమాచారం.
పసిగట్టలేకపోయారా?
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో ఆదివాసీ, లంబాడీల పోరాటం ఎటువైపు వెళ్తోంది? వారి ఉద్యమ కార్యాచరణ ఏంటి? ఆదివాసీలు, లంబాడీల ముసుగులో అదృశ్య శక్తులు చొరబడే ప్రమాదం ఉందా? అన్న అంశాలను రెండు జిల్లాల పోలీస్ అధికారులు పసిగట్టలేకపోయారన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. దీనివల్లే ఉట్నూర్ ఘటన జరిగిందని, ముందే పసిగట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అనుభవ లోపం, సరైన రీతిలో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించకపోవడం కూడా ఐపీఎస్ అధికారుల బదిలీకి కారణమైందన్న వాదన కూడా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment