ఉట్నూర్, న్యూస్‌లైన్ : టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలో దేశం కోటకు బీటలు పడ్డాయి. సాధారణ ఎన్నికల్లో పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రితీశ్ రాథోడ్, ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ ఓటమి పాలు అవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. టీడీపీ నుంచి 1999లో రాథోడ్ రమేశ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గాన్ని పార్టీకి కంచు కోటలా మార్చాడు. 2004లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రాథోడ్ రమేశ్ ఓటమి పాలైనా మరుసటి ఏడాదిలో ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా జెడ్పీ పీఠం సాధించడం, అటు తర్వాత ఎంపీగా గెలుపొందడం, ఆయన సతీమణి రెండుసార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు.
కంచు కోట బద్దలు
పంచాయితీ, ప్రాదేశిక ఎన్నికలకు ముందు ఖానాపూర్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉండెది. తర్వాత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. పంచాయ ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని మూడు మేజర్ గ్రామ పంచాయతీలు ఉండగా రెండింట్లో టీడీపీ సర్పంచులు, ఒక పంచాయతీలో టీఆర్‌ఎస్ సర్పంచ్ అధికారంలో ఉండేవారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఒక మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఖానాపూర్, ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, పొన్కల్ పంచాయతీని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకుంది.
ప్రాదేశిక ఎన్నికలకు ముందు టీడీపీ మూడు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో బలంగా ఉండేది. అయితే మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో సైతం టీడీపీ అనుకున్న ఎంపీటీసీ స్థానాలు కూడా సాధించలేకపోయింది. నియోజకవర్గంలో 80 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 22 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలువగా ఐదు జెడ్పీటీసీ స్థానాలుండగా ఒక్క దానినీ దక్కించుకోలేక చతకిలపడింది. దీంతో టీడీపీ ప్రభావం తగ్గుతూ టీఆర్‌ఎస్ బలంగా పుంజుకుంది. ప్రస్తుతం జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో నియోజకవర్గంలో ఐదింటికి ఐదు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ సాధించనుంది. అదీ కాక సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రితీశ్ రాథోడ్, ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ ఓటమి చెందడంతో కంచుకోటకు బీటలు వారినట్లు అయ్యింది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పార్టీ తన బలాన్ని పెంచుకుందని చెప్పవచ్చు.
తెలంగాణ ఉద్యమ తీవ్రతతో..
2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఎంపీగా ఉన్న రాథోడ్ రమేశ్, టీడీపీ శ్రేణులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన లేకపోయారనే అపవాదును మూటకట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో టీఆర్‌ఎస్ నియోజకవర్గంలో క్రమక్రమంగా బలం పుంజుకోవడంతో పంచాయతీ, ప్రాదేశిక, సాధారణ ఎన్నికల్లో టీడీపీ అనుకున్న విజయం సాధించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తాడని పార్టీకి పునర్‌వైభవం వ స్తుందని శ్రేణులు అనుకున్నప్పటికీ ఆశలు గల్లంతు అవ్వడంతో పార్టీ కంచు కోటకు బీటలు వారినట్లు అయ్యింది.
‘దేశం’ కోటకు బీటలు
Published Mon, May 19 2014 1:18 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement