ఉట్నూర్ : ఖానాపూర్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. దీంతో వ్యాధులు ‘ముసురు’కుంటున్నాయి. ఏజెన్సీ మండలాలైన ఉట్నూర్, ఇంద్రవెల్లిలోని గ్రామాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. నియోజకవర్గంలోని మండలాల్లో జ్వరాలు, వ్యాధులతో ఈ ఏడాది ఇప్పటివరకు 22 మంది మృత్యువాతపడ్డారు. గ్రామాల్లోని నీటి పథకాలను వారానికోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉన్నా మారుమూల గ్రామాల్లో ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్‌పేషంట్ల సంఖ్య రోజు 60 నుంచి 100 వరకు ఉంటోందని వైద్యులు తెలిపారు. ఉట్నూర్ పీహెచ్‌సీలో ఔట్‌పేషంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారంటే.. జ్వరాల తీవ్రత ఎలా ఉందో తెలుస్తోంది. వ్యాధులు ప్రబలుతుండడంతో ఇప్పటికే కళాజాత బృందాలు గ్రామాల్లో ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉండగా.. అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పిన్ పాయింట్ కార్యక్రమం ద్వారా వైద్య సిబ్బంది గ్రామాలను సందర్శించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నా అమలు కావడం లేదు.
పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత
భైంసా : ముథోల్ నియోజకవర్గంలో వర్షాలు కురుస్తుండడంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. కుంటాల మండలం సేవాలాల్‌తండాలో రెండ్రోజులుగా ఆరుగురు విషజ్వరాల బారినపడ్డారు. సూర్యంతండాలో నలుగురు, ముథోల్ మండల వ్యాప్తంగా 40 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. కుభీర్‌కు చెందిన ఆశన్న చలి జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భైంసా పట్టణంలో జ్వరాల బారిన పడిన ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
విషజ్వరాలు సోకిన సూర్యంతండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. రాయపూర్‌కాండ్లిలో నలుగురు జ్వరాల బారినపడ్డారు. వ్యాధులకు కారణమైన పారిశుధ్య లోపంపై అధికారులు నామమాత్ర చర్యలు తీసుకుంటున్నారు. డ్రెయినేజీలు, పెంటకుప్పలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దోమలు వృద్ధి చెందుతున్నాయి. తాగునీటి పథకాలు, డ్రెయినేజీలు క్లోరినేషన్ చేయడం లేదు.
అన్నింటా ఖాళీలే..
ముథోల్, కుభీర్, కుంటాల, లోకేశ్వరం, తానూర్ పీహెచ్‌సీల్లో సిబ్బంది ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కుంటాల పీహెచ్‌సీ వైద్యురాలు వందన డెప్యూటేషన్‌పై ఏడాదిన్నర క్రితం ఆదిలాబాద్‌కు వెళ్లారు. ల్యాబ్‌టెక్నీషియన్‌నూ డెప్యూటేషన్‌పై పంపించడంతో ల్యాబ్‌కు తాళం పడింది. అప్పటి నుంచి వైద్య సేవలు అందడం లేదు. కాంట్రాక్టు వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
రక్త పరీక్షల కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి పంపిస్తున్నారు. తానూర్ పీహెచ్‌సీలో వైద్యులు, ఏఎన్‌ఎంల పోస్టులు నాలుగు చొప్పున ఖాళీగా ఉన్నాయి. లోకేశ్వరంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఖాళీగా ఉంది. ముథోల్ ప్రాంతీయ ఆస్పతిలో ఐదుగురు వైద్యుల, నలుగురు నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కుభీర్‌లో ఇద్దరు డాక్టర్లు, నలుగురు ఏఎన్‌ఎంలు, ఇద్దరు హెల్త్‌సూపర్‌వైజర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తాగునీరు కలుషితమై..
బెల్లంపల్లి : వర్షాలతో నీరు కలుషితమై, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల మండలాల్లోని పల్లెల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పక్షం రోజుల క్రితం భీమిని మండలం అక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి చంద్రమౌళి జ్వరంతో చనిపోయాడు. జ్వరాల తీవ్రత ఉన్న గ్రామాల్లో వైద్య సిబ్బంది ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
జ్వరాలతో బాధపడుతూ బెల్లంపల్లి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు 438 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా.. 200 మందికి టైఫాయిడ్ జ్వరం ఉన్నట్లు తేలింది. ఐదుగురికి మలేరియా, మరో 20 మందికి వైరల్ ఫీవర్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతూ రోజుకు ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆస్పత్రిలో ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. మరో 30 నుంచి 40 మంది ఔట్‌పేషంట్లుగా ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారు.
భీమిని మండలం ఖర్జీభీంపూర్, అక్కళ్లపల్లి, భీమిని(బారెవాడ)లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పది నుంచి పదిహేను మంది వరకు జ్వరంతో బాధపడుతున్నారు. అక్కళ్లపల్లిలో 15రోజుల క్రితం జ్వరాలు విజృంభించగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జ్వరాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. నెన్నెల మండలం ఘన్‌పూర్, జంగాల్‌పేట, నందుపల్లి గ్రామాల్లో ప్రజలు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. నిత్యం నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 నుంచి 30 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
నెన్నెల, జంగాల్‌పేట, ఘన్‌పూర్‌లో కొందరు కలుషిత నీరు తాగ డం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. తాండూరు మండ లం మాదారం-3 ఇంక్లైన్, అన్నారం, కాసిపేట, కొత్తపల్లి గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారినపడ్డారు. తాండూర్ పీహెచ్‌సీకి ప్రతిరోజు 50 మంది వైద్యం కోసం వస్తున్నారు. మాదారం-3 ఇంక్లైన్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందించారు.
మంచంపట్టిన ప్రజలు.. సకాలంలో అందని వైద్యం..
Published Thu, Jul 24 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement