ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్య గాడి తప్పింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత దారుణంగా పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోయింది. ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే విద్య తిరోగమన దిశలో పయనిస్తోందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఒక్కరూ ఉత్తీర్ణత సాధించని ఆశ్రమ పాఠశాలలు నాలుగు, ఒక్కరు ఉత్తీర్ణత సాధించినవి ఏడు, ఇద్దరు ఉత్తీర్ణత సాధించినవి నాలుగు, ముగ్గురు ఉత్తీర్ణత సాధించినవి ఆరు, ఇక పది మంది లోపు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలలు 30.. ఇలాంటి ఫలితాలు గత పదేళ్ల కాలంలో గిరిజన సంక్షేమ శాఖ చూసి ఉండదు. ఫలితాలు పడిపోవడానికి కారణం ఎవరు.. ఆయా విద్యాలయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమా..?, విద్యాలయాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించకపోవడమా..?, విద్యార్థులు పుస్తకాలు ముట్టకపోవడమా..? కారణమేదైనా గిరిజన సంక్షేమ శాఖ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
పడిపోయిన ‘పది’ ఫలితాలు..
గతంతో పోల్చితే ఈ విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో ఈసారి 3,929 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 1,506 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 71 ఆశ్రమ పాఠశాలల నుంచి 3,046 మందికి గాను 1,083 మంది, 13 కస్తూరిబా గాంధీ పాఠశాలల నుంచి 316 మందికి గాను 106 మంది, నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 483మందికి గాను 292 మంది, ఆరు వసతి గృహాల నుంచి 84 మందికి గాను 25 మంది విద్యార్థుల చొప్పున ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి వరకు ఉన్న జామ్డా, మహాగాం, రాశిమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలల్లో, మార్లవాయి ఆశ్రమ పాఠశాలలో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం.
పర్డీ(బి), గూడమామడ, నార్నూర్, అర్జుని(బాలికల), దోర్డానా, కోహినూర్(కే), గుడిహత్నూర్, ఉమ్రి(బాలికల) ఆశ్రమ పాఠశాలల్లో ఒక్కరు చొప్పున, జైనూర్, గిన్నెధరి, మల్కెపల్లి, పాట్నాపూర్(బాలికల) ఆశ్రమ పాఠశాలల్లో ఇద్దరు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. మాన్కపూర్, పోచంలొద్ది, ఖానాపూర్(బాలికల), కుంటాల, జన్నారం, ఖానాపూర్ ఆశ్రమ పాఠశాలల్లో ముగ్గురు చొప్పున ఉత్తీర్ణులయ్యారు. స్వర్ణ, బోథ్(బాలికల), కోర్టికల్(కే) ఆశ్రమ పాఠశాలల్లో నలుగురు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఇక పది మంది లోపు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలలు 30 దాటలేదు. ఇక 13 కేజీబీవీల్లో నార్నూర్, మాణిక్యకపూర్ విద్యార్థులు ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. కుస్నపల్లి, కడెం, నార్నూర్, భీంపూర్ వసతి గృహాల్లో ఒక్కరు చొప్పున, భీమారంలో పది మంది, లక్సెట్టిపేటలో 11 మంది ఉత్తీర్ణులయ్యారు.
కారణాలు అనేకం..
2013-14 విద్యాసంవత్సరంలో గిరిజన సంక్షేమ శాఖలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఐటీడీఏ ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నెల తర్వాత అప్పటి డీడీటీడబ్ల్యూ రషీద్ అనారోగ్యం కారణంగా చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఉన్నతాధికారులే ఆయనను సెలవుపై పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి ఏపీవో(జనరల్) వెంకటేశ్వర్లుకు ఇన్‌చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించారు. ఆయ న ఉద్యోగ విరమణ సమయం దగ్గరలో ఉండడంతో పూర్తి స్థాయిలో గిరిజన విద్యపై దృష్టి సారించలేదు.
సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందగానే ఐటీడీఏ ఏవో భీమ్‌కు బాధ్యతలు అప్పగించినా ఆశించిన ఫలితం లేకుండాపోయింది. ఆశ్రమాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో గిరిజన విద్య గాడి తప్పు తూ వచ్చింది. నవంబర్ 28న సెలవుపై వెళ్లిన రషీద్ డీడీగా తిరిగి బాధ్యతలు స్వీకరించినా.. నెల తిరక్కుండానే డిసెంబర్ 21న ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ విద్యాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని విద్యాలయాలను పట్టించుకునే వారే లేకుండాపోయారు.
ఆశ్రమ పాఠశాలల్లో 577 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఐటీడీఏ విద్యా సంవత్సరం ఆరంభంలో సీఆర్టీలను నియమించకుండా విడతల వారీగా నియామకాలు చేపట్టింది. ఈ ప్రక్రియ ముగిసే స రికి ఆగస్టు దాటడంతో సిలబస్ పూర్తి కాలేదు. అదీగాక సీఆర్టీలను ఏటా తొల గిస్తూ నియామకాలు చేపట్టడంతో కొత్తగా వచ్చే సీఆర్టీలకు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన లేక విద్యార్థులకు బోధించలేకపోయారనే ఆరోపణలున్నాయి.
విద్యాసంవత్సరంలో సుమారు 20 మంది ఉపాధ్యాయులను ఐటీడీఏ పీవో సస్పెండ్ చేశారు. వీరికి నెలలు గడిచినా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో ఆశ్రమాల్లో పలు సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. పలువురికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు నిర్వహించడంతో పూర్తి స్థాయిలో తరగతుల బోధన లేక విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపింది.
అధికారుల మధ్య సమన్వయ లోపం, పూర్తి స్థాయి డీడీటీడబ్ల్యూగా బాధ్యతలు నిర్వర్తించే వారు లేకపోవడంతో ఆశ్రమాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కొందరు ఉపాధ్యాయులు అనుమతి లేకుండా రోజుల తరబడి విధులకు ఎగనామం పెట్టారు. దూర ప్రాంతాల నుంచి ఇష్టారీతిగా రాకపోకలు సాగించడం, సీఆర్టీలపై భారం వేయడంతో నాణ్యమైన విద్య అందకుండా పోయింది.
ప్రక్షాళన చేస్తేనే..
పదో తరగతి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచే గిరిజన సంక్షేమ శాఖలో ప్రక్షాళన చేస్తేనే గిరిజన విద్య గాడిలో పడే అవకాశ ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఆశ్రమాల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించని 50 మంది ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయి డీడీటీడబ్ల్యూను నియమించడం, పాఠశాలలు ప్రారంభానికి ముందే సీఆర్టీల నియామకం తదితర చర్యలు చేపడుతూ ప్రక్షాళన చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు గిరిజన గాడిలో పెడతారో లేదో వేచి చూడాల్సిందే.
గిరిజన విద్య.. ఫెయిల్..!
Published Sat, May 31 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement