Tribal education
-
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
గిరిజన విద్యకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: గిరిజనులను నూరు శాతం అక్షరాస్యులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రణాళికను అమలు చేస్తోంది. గిరిజనుల కోసం ఇప్పటికే వివిధ రకాల విద్యాసంస్థల్ని ఏర్పాటు చేసి ప్రాథమిక, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వరకు ప్రతి గిరిజన విద్యార్థి విధిగా చదువుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ స్థాయిల్లో 2,682 గిరిజన విద్యాలయాలు నడుస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు గిరిజనులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో వైఎస్సార్ గిరిజన మెడికల్ కాలేజీ, విజయనగరం వద్ద గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణాలు పూర్తి కాగానే వాటిలోనూ అడ్మిషన్లు మొదలవుతాయి. ఇప్పటికే గిరిజనుల కోసం అరకులో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాలు కల్పించారు. మంచి ఆట వస్తువులు కొనుగోలు చేసి అనుభవజు్ఞలైన క్రీడా ఉపాధ్యాయుల చేత శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రాథమిక దశ నుంచీ ప్రత్యేక శ్రద్ధ గిరిజన విద్యార్థులపై ప్రాథమిక దశ నుంచీ ప్రత్యేక శ్రద్ధ వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో గల 2,682 గిరిజన విద్యాలయాల్లో మొత్తం 2,04,588 మంది గిరిజన చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఒక్కొక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్యను బట్టి మరో ఉపాధ్యాయుడిని నియమించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారిని ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో చేర్చుకుంటారు. ప్రాథమిక పాఠశాలలతోపాటు అన్ని స్థాయిల్లోని గిరిజన విద్యాలయాల్లో సకల సౌకర్యాలు కల్పించారు. వారికి పాఠశాలల్లోనే భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. -
ఇదీ చంద్రన్న ఏలుబడి!
బుట్టాయగూడెం: గిరిజన విద్యకు పెద్దపీట వేస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉత్తిదే అని తేలిపోతోంది. గిరిజన అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ అధికారులు చెప్పే మాటలు నీటి మీద రాతలని రుజువవుతోంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో 23 పాఠశాలలు మూతపడడమే దీనికి నిదర్శనం. ఫలితంగా 300మందికి పైగా విద్యార్థులు బడిబయట తిరుగుతున్నారు. ఏటా బడిబాట కార్యక్రమం చేపడుతున్నా.. వీరు పాఠశాలల్లో చేరడం లేదు. దీనిని బట్టి బడిబాట కార్యక్రమం ఎంత తూతూమంత్రంగా జరుగుతోందో అర్థమవుతోంది. విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో.. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గిరిజన సంక్షేమశాఖ, మండల పరిషత్ పాఠశాలల్లో విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో సుమారు 23 పాఠశాలలను మూసివేశారు. బుట్టాయగూడెం మండలంలో కోర్సవారిగూడెం, కొమరవరం, గంగవరం, లక్షు్మడుగూడెం, కుమ్మరికుంట, లంకపాకల, పాతరాజానగరం, కన్నారప్పాడు, బుద్దులవారిగూడెం పాఠశాలలను విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో మూసి వేశారు. అయితే పునరావాస గ్రామమైన లక్ష్మీపురంలో అసలు పాఠశాలే లేదు. అలాగే పోలవరం మండలంలో సిరివాక, ఎర్రవరం, సరుగుడు, తానాలకుంట, బక్కబండార్లగూడెం, రామన్నపాలెం, గడ్డపల్లి, చింతపల్లి గ్రామాల్లో ఉన్న పాఠశాలలనూ మూసివేసినట్లు సమాచారం. అలాగే కుక్కునూరు మండలంలోని దాచారం, అమరవరం, గుంపెనపల్లి, వేలేరుపాడు మండలంలో కొర్రాజులగూడెం, చెరవుగొల్లగూడెం, గుళ్ళవాయి గ్రామాల్లో పాఠశాలలు కూడా మూతపడ్డాయి. అయితే బుట్టాయగూడెం మండలంలో లంకపాకల, కామవరం, కంగాలవారిగూడెం పాఠశాలల్లో అత్యధికంగా విద్యార్థులు చదువుకునేవారు. ఈ పాఠశాలలకు జిల్లాస్థాయిలో కూడా మంచిపేరు ఉండేది. ప్రస్తుతం ఇక్కడ ఒకటి, రెండు తరగతుల వారికి మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు. ఆదివాసీ అడవి బిడ్డల భవిత ప్రశ్నార్థకం బడులు మూతపడడం వల్ల ఆదివాసీ అడవి బిడ్డలు చదువులకు దూరమవుతున్నారు. సొంత గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో ఉంటేనే ఇక్కడి పిల్లలు బడికెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. దూరప్రాంతం వెళ్లాలంటే ఆసక్తి చూపడం లేదు. సుదూర ప్రాంతం పిల్లలను పంపడానికి తల్లిదండ్రులూ విముఖత చూపిస్తున్నారు. ఫలితంగా ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉండిపోతున్నారు. తానిగూడెం, మోతుగూడెం, అలివేరు, లంకపాకల, గడ్డపల్లి, చింతపల్లి గ్రామాలతో పాటు వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో సుమారు 300 మంది వరకూ డ్రాప్అవుట్లు ఉన్నట్లు ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి పి.మూర్తి మాట్లాడుతూ.. డ్రాప్‌అవుట్ పిల్లలను బడిలో చేర్చాలనే యత్నం చేసినప్పటికీ వారు అక్కడ ఉండలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం బడికి, గ్రామానికి దూరం ఎక్కువగా ఉండడమే. కోర్సవారిగూడెం గ్రామంలో పాఠశాల మూసివేయడం వల్ల దాదాపు 15 మంది చిన్నపిల్లలు 3 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో నడిచి గురుగుమిల్లి పాఠశాల, గవరంపేట అంగన్వాడీ కేంద్రంలో చదువుకునేందుకు వెళ్తున్నారు. మధ్యలో వాగులు, అధ్వానంగా ఉన్న రోడ్డుపై పిల్లలు నడచి వెళ్లడం చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవనాలు నిరుపయోగం లంకపాకల, కె.బొత్తప్పగూడెం, కంగాలవారిగూడెం, కామవరం, చింతపల్లి, గడ్డపల్లి, గ్రామాల్లో కోట్లాది రూపాయలతో పెద్దపెద్ద పాఠశాల భవనాలు విద్యార్థుల చదువుల కోసం నిర్మించారు. ప్రస్తుతం అవన్నీ మూతపడ్డాయి. దీంతో భవనాలన్నీ నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఒకనాడు పిల్లల పాఠ్యాంశ బోధన, ఆటపాటలు, అల్లర్లతో, ఆవరణలో అందమైన పూలమొక్కలు, గార్డెన్లతో ఆహ్లాదకరంగా కనిపించే భవనాలు నిరుపయోగంగా వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రస్తుతం పశువుల కాపరులుగా కొందరు మారారు. మరికొందరు కూలి పనులు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఇంటి దగ్గరే ఉంటూ డ్రాప్ అవుట్లుగా మిగిలిపోయారు. గిరిజన విద్యపై చిత్తశుద్ధి లేదు పాఠశాలలను మూసివేయడం వల్ల ఆదివాసీ గిరిజన పిల్లలు చదువులకు దూరమయ్యారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ అధికారులు, పాలకులు ప్రకటనలు చేయడమే తప్ప గిరిజన విద్యపై చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంతంలో 23 పాఠశాలలు మూతపడడం వల్ల వందల సంఖ్యలో గిరిజన విద్యార్థులు డ్రాప్అవుట్లుగా మిగిలిపోయారు. – సరియం రామ్మోహన్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బుట్టాయగూడెం పిల్లలు విద్యకు దూరమయ్యారు మా కొండరెడ్డి ప్రాంతాల్లోని పాఠశాలలు ఎక్కువగా మూతపడ్డాయి. దీనివల్ల అనేక మంది విద్యకు దూరమయ్యారు. విద్యతోనే అభివృద్ధి చెందుతారని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. బడులు మూతపడడం వల్ల మా పిల్లలు అడవుల్లోనే చెట్టు, పుట్టవైపు తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉన్నారు. – నడపల సోమరాజు, కొండరెడ్ల సంఘం రాష్ట్ర నాయకులు, అలివేరు -
నేటి ఇందిరాగాంధీ!
ఈమె అసలు పేరు లక్ష్మి. తన చిన్నతనంలో ఇందిరాగాంధీ ప్రసంగాన్ని రేడియోలో విన్నాక తన పేరును ఇందిరాగాంధీగా మార్చుకున్నారు. ఈమె నేడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుగాలీల జీవితాల్లో వెలుగుకోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు 12,632 మందిని పాఠశాలల్లో చేర్పించారు. వారిలో 86 మంది కళాశాల విద్య పూర్తిచేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మా నేనూ బడికి వెళ్తానంటూ మారాం చేసింది ఆ చిన్నారి.. రెండు పూసలల్లితే నాలుగు కాసులు వస్తాయ్.. బడి వద్దు మనకు అంత స్థోమత లేదంటూ బడి వైపు వెళ్లొద్దని షరతు పెట్టింది ఆమె తల్లి. అయితే తన కూతురే తమిళనాడులోని పది లక్షల మంది సుగాలీలకు ఓ ఇందిరాగాంధీలా మారుతుందని ఆ అమ్మకు తెలియదు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుగాలీల జీవితాల్లోవెలుగు కోసం పోరాడుతున్న ఇందిరాగాంధీ ఈ వారం మహిళామణి శీర్షికకు చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే. తిరువళ్లూరు: తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌లోని గువ్వళోళ్ల కాలనీ. ఉదయం ఏడు గంటల సమయం. 20 మంది చిన్నారులకు తలదువ్వడం, జడలు అల్లడం చేస్తోంది పోలీసు డ్రస్‌లో ఉన్న 53 ఏళ్ల మహిళ. ఎవరామె అని ఆరా తీయడానికి యత్నించేలోపే.. ఆమె స్పందిస్తూ ఈ కాలంలో చదువుకుంటేనే బతకగలం.. అందుకే గువ్వళోళ్ల కాలనీలోని పిల్లలందరిని బడికి పంపిస్తున్నా. ఓ పది నిమిషాలు ఆగండి అంటూ ఆ పిల్లలను తన పిల్లల్లా బడికి పంపించే పనిలో లీనమయ్యింది. అనంతరం తన స్వీయ చరిత్రను చెప్పడం ప్రారంభించారు ఇందిరాగాంధీ. సుగాలీల పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఇందిరాగాంధీ నేను పుట్టింది.. తమిళనాడు రాష్ట్రం, ఓరక్కాడు గ్రామంలో నేను పుట్టా. అక్కడే ఉన్న బస్టాండే నా శాశ్వత నివాసం. మూడేళ్ల వయస్సు రాగానే తల్లిదండ్రులు మమ్మల్ని ఇంటివద్దే వది లిపెట్టి పూసలు అమ్మడానికి బయ ట ప్రాంతాలకు వెళ్లేవారు. వారు వచ్చే వరకు బస్టాండులో బిచ్చమెత్తుకోవడం నా దినచర్య. ఒక రోజు బస్టాండులో బిచ్చమెత్తుకుంటుండగా కానిస్టేబుల్ పిలిచి బడిలో చేర్పిస్తా చదువుకుంటావా అన్నా రు. నేను పట్టించుకోలేదు. మరుసటి రోజు పాఠశాల ఆవరణలో నిలబడిన సమయంలో తమిళ ఉపాధ్యాయుడు(కర్కై నండ్రే కర్కై నండ్రే పిచ్చై పుగినుం కర్కై నండ్రే) అంటూ బోధిస్తున్నాడు. చదువుకుంటున్న వారిని ఎందుకు అడుక్కోవాలని బోధిస్తున్నాడో అనుకుని టీచర్నే అడిగేసా. ఆయన బిచ్చమెత్తయినా చదువు కోవాల ని చెప్పారు. ఆ మాటలతో నాలో చదువుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అమ్మానాన్నలకు చెప్పా. బడి వద్దూ పూసలు అమ్ముకోమన్నారు. అయినా ఆసక్తితో ఉపాధ్యాయుడిని కలవడంతో ఆయన మా అమ్మానాన్నతో మాట్లాడి పాఠశాలలో చేర్పించారని వివరించారు. పదేళ్లకే పెళ్లి నిర్ణయం.. ఆమ్మనాన్న నాకు పదేళ్లకే పెళ్లి చేయాలనుకున్నారు. నెల్లూరు నుంచి నాకన్నా 15 ఏళ్ల పెద్దవాడైన వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయిం చారు. పెళ్లికొడుకు చూడడానికి వచ్చాడని బం ధువులు ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలోనే అక్కడ జరుగుతున్న శవయాత్రలో పాల్గొని తప్పించుకున్నా. మా ఉపాధ్యాయుడికి చదువుకోవాలన్న నా కోరికను తెలిపా. టీచర్ గ్రామపెద్దను ఆశ్రయించమన్నారు. పంచాయతీ పెద్ద ఒరక్కాడు నాయుడును కలిసి నా బాధను చెప్పా. ఆయన సైకిల్‌పై ఎక్కించుకుని పొలం వద్దకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఎలాగో అతని నుంచి తప్పించుని సాయం చేస్తానన్న పోలీసును ఆశ్రయించా. ఆయన అ మ్మానాన్నలకు హెచ్చరించడంతో వారు నన్ను ఎనిమిదో తరగతి వరకు చదువుకోమన్నారు. ఆసలు పేరు లక్ష్మి.. నా అసలు పేరు లక్ష్మి. ఒక రోజు టీచర్ ఇంటికి వెళ్లా. అప్పడు బంగ్లాదేశ్‌పై జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించిందని, ఇందిరాగాంధీ ప్రసంగాన్ని రేడియోలో వింటూనే ఆమె పాలనాదక్షతనూ వివరించారు. ఆ మాటలు విన్నాక నా పేరును ఇందిరాగాంధీగా మార్చుకున్నా. అప్పుడే సుగాలీలకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఎంఏ వరకు చదివి అటవీశాఖలో గార్డు ఉద్యోగాన్ని సంపాదించి ప్రేమ వివాహం చేసుకున్నా. ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. నేను తక్కువ కులం అమ్మాయినని హేళన చేయడంతో ఆయన విడాకులు తీసుకున్నాడని(కంటతడి పెడుతూ) వివరించారామె. వారికి చదువుచెప్పించాలని.. సుగాలీల పిల్లలకు చదువుచెప్పించాలని 25 ఏళ్ల క్రితం నిర్ణయించా. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి సుగాలీల పిల్లలను బడికి పంపించడం, వారి తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించా. పిల్లల తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించేది కాదు. అయినా నా ప్రయత్నంలో వెనుకడుగు వేయలేదు. అప్పటికే దాదాపు 16 వేల మంది సుగాలీల పిల్లలు విద్యకు దూరంగా ఉన్నారని గుర్తించా. కనీసం ఐదు వేల మందిని బడికి పంపాలని నిర్ణయించి మొదటి ఏడాది 25 మందిని పాఠశాలలో చేర్పించా. ఇప్పటి వరకు 12,632 మందిని పాఠశాలల్లో చేర్పించగా, వారిలో 86 మంది కళాశాల విద్య పూర్తి చేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు వారంలో ఒక రోజు వెళ్లి విద్య ఆవశ్యకతను వివరిస్తున్నానన్నారు. ప్రభుత్వం ఒరక్కాడు ప్రాంతంలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే మాకు సాయం చేస్తానని రఘుపతి అనే వ్యక్తి మా భూములను ఆక్రమించుకున్నాడు. దీనిపై పది ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. భూములను వదలిపెట్టి వెళ్లాలని కొందరు బెదిరించారు. చివరికి నా ఒక్కగానొక్క కొడుకును(కన్నీటిని తుడుచుకుంటూ) చంపేసారని బోరున విలపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశదిమ్మరులుగా తిరుగుతున్న సుగాలీల జీవితాల్లో వెలుగును నింపాలి. వారిని ఆర్థికంగా బలో పేతం చేయాలి. సమాజంలో మాకు ఒక గుర్తింపు ఉండాలన్నదే తన అంతియ లక్ష్యమని వివరించారు. -
గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి
ఉమ్మడి జిల్లా రీజినల్ డైరెక్టర్ రమేశ్ ఇచ్చోడ : గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని గిరిజన గురుకుల పాఠశాలు, కళాశాలల ఉమ్మడి జిల్లా రీజినల్ డైరెక్టర్ టి.రమేశ్ అన్నారు. గురువారం ఇచ్చోడ గిరిజన బాలికల పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేజీ టు పీజీ నిర్బంధ విద్యలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు నూతన గిరిజన గురుకుల బాలికల పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంద్రవెల్లి, బోథ్, సిర్పూర్, తిర్యాణి, జైనూర్, ముథోల్ మండల కేంద్రాల్లోని ఈ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయల నియామకపు ప్రకియ కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లాలో ఆరు నూతన పాఠశాలలు, ఆరు పాత పాఠశాలల్లో ఐదో వతరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదో తరగతిలో ప్రవేశం కోసం ఎస్టీ విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రకియ ఫిబ్రవరి 16నుంచి మార్చి 16 వరకు కొనసాగుతుందని తెలిపారు. రూ.30 రుసుంతో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకున్నవారు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డివిజన్ స్థాయిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతీ పాఠశాలలో 80 మంది విద్యార్థుల చొప్పున 12 పాఠశాలల్లో 960 మందికి ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు గిరిజన గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్య, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 9న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 80శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్టీ విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్, ఇచ్చోడ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణ్‌నాయక్, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌స్వామి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మారుతిశర్మ, ఆదిలాబాద్ పాఠశాల ప్రిన్సిపాల్ సాయిరాం పాల్గొన్నారు. -
విద్యతోనే ఆదివాసీల అభివృద్ధి
ఎస్సీ, ఎస్టీ పోలీస్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు సీఐ విష్ణుమూర్తి కేయూ క్యాంపస్ : విద్య ద్వారానే ఆది వాసీల అభివృద్ధి జరుగుతుం దని, ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ పోలీస్ యూనియ న్ జాతీయ అధ్యక్షుడు సీఐ విష్ణుమూర్తి అన్నారు. ఆదివాసీ స్టూడెంట్స్ యూనియ న్(ఏఎస్యూ)ఆధ్వర్యంలో ఆదివారం కేయూ ఎస్డీఎల్సీఈ సెమినార్‌హాల్‌లో ‘రైట్టూ ఎడ్యూకేషన్ టూది ఆదివాసీస్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆది వాసీలు అనేకరంగాల్లో వెనకబాటులోనే ఉన్నారని, విద్య ద్వారానే నాగరిక సమాజంలో కలిసి తమ హక్కులను ఉనికిని కాపాడుకోగలుగుతామని చెప్పారు. కేయూ జూవాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ ఆదివాసీ 5వ షెడ్యూల్ ప్రాం తాన్ని నూతన జిల్లాల విషయంలో ముక్కలు చేసి ఆదివాసీలను విఛ్చిన్నం చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో ఏఎస్యూ బా ధ్యులు రేగ రమేష్, చుంచ విజయ్, రాము, మెస్త్రం మనోహర్, కె.జనార్దన్, ఉదయశ్రీ, అరుణశ్రీ, పాపారావు, వెంకట్ పాల్గొన్నారు. -
గిరిజనశాఖలో త్వరలో ఖాళీల భర్తీ
గిరిజన విద్యాసంస్థల్లో జనవరి 1 నుంచి సన్నబియ్యం మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యాసంస్థలు, గిరిజన కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ వెల్లడించారు. గిరిజన విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం జనవరి 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లోని గిరిజనసంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ, కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, శాఖ అధికారులు బాబూ భూక్యా, దశరథ్ నాయక్, సీతారాం నాయక్, వివిధ ఐటీడీఏల పీడీలు, డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజనసంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ తండాకు బస్సు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజనులకు వరప్రసాదంగా ఉన్న కల్యాణలక్ష్మీ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి నివారణకు ఇప్పట్నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు. -
పక్కాగా అమృతహస్తం
మాతా శిశు మరణాలను నిరోధించాలి క్షేత్రస్థాయిలోఅధికారుల పర్యటనలు తప్పనిసరి జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆదేశం పాడేరు: ఏజెన్సీలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని పక్కాగా అమలు చేసి పౌష్టికాహార సమస్య పరిష్కారంతోపాటు మాతా శిశు మరణాల నిరోధానికి అధికారులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆదేశించారు. కలెక్టర్‌గా తొలిసారి ఏజెన్సీకి వచ్చిన ఆయన స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమానికి చేపడుతున్న పథకాలపై శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా సమీక్షించారు. గిరిజన విద్య, వైద్యం, ఇంజినీరింగ్ పనులు, జీసీసీ, ఉపాధి హామీ పథకం, తాగునీటి సరఫరా,విద్యుత్శాఖలవారీ జిల్లా స్థాయి అధికారులతో చర్చించారు. చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మన్యంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను గిరిజనుల దరి చేర్చాలన్నారు. మారుమూల గూడేల్లోని అన్ని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకొని మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలన్నారు. ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ మాట్లాడుతూ ఏజెన్సీలోని 5.5 లక్షల మంది గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. వారపుసంతల్లో ప్రత్యేక వైద్యశిబిరాల ద్వారా 10 వేల మంది గిరిజనులకు ఉన్నత సేవలు అందించామన్నారు. 364 వైద్యశిబిరాలను గ్రామాల్లో నిర్వహించామన్నారు. 29,325 మంది గిరిజన విద్యార్థులకు వైద్యపరీక్షలు జరిపామన్నారు. ఏజెన్సీలోని 67 శాతం ఆస్పత్రి ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. గిరిజన రైతులకు ఆర్థిక ఆసరా కల్పించాలన్న లక్ష్యంతో కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ ఏడాది మరో 9 వేల ఎకరాల్లో కాఫీ తోటలను చేపడుతున్నామన్నారు. ఆర్డీఓ రాజకుమారి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, డీఎంహెచ్ఓ శ్యామల, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ కాంతనాధ్, ఈఈ రమణమూర్తి, డ్వామా పీడీ శ్రీరాములు నాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గిరిజన విద్య.. ఫెయిల్..!
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్య గాడి తప్పింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత దారుణంగా పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోయింది. ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే విద్య తిరోగమన దిశలో పయనిస్తోందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఒక్కరూ ఉత్తీర్ణత సాధించని ఆశ్రమ పాఠశాలలు నాలుగు, ఒక్కరు ఉత్తీర్ణత సాధించినవి ఏడు, ఇద్దరు ఉత్తీర్ణత సాధించినవి నాలుగు, ముగ్గురు ఉత్తీర్ణత సాధించినవి ఆరు, ఇక పది మంది లోపు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలలు 30.. ఇలాంటి ఫలితాలు గత పదేళ్ల కాలంలో గిరిజన సంక్షేమ శాఖ చూసి ఉండదు. ఫలితాలు పడిపోవడానికి కారణం ఎవరు.. ఆయా విద్యాలయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమా..?, విద్యాలయాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించకపోవడమా..?, విద్యార్థులు పుస్తకాలు ముట్టకపోవడమా..? కారణమేదైనా గిరిజన సంక్షేమ శాఖ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పడిపోయిన ‘పది’ ఫలితాలు.. గతంతో పోల్చితే ఈ విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో ఈసారి 3,929 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 1,506 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 71 ఆశ్రమ పాఠశాలల నుంచి 3,046 మందికి గాను 1,083 మంది, 13 కస్తూరిబా గాంధీ పాఠశాలల నుంచి 316 మందికి గాను 106 మంది, నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 483మందికి గాను 292 మంది, ఆరు వసతి గృహాల నుంచి 84 మందికి గాను 25 మంది విద్యార్థుల చొప్పున ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి వరకు ఉన్న జామ్డా, మహాగాం, రాశిమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలల్లో, మార్లవాయి ఆశ్రమ పాఠశాలలో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. పర్డీ(బి), గూడమామడ, నార్నూర్, అర్జుని(బాలికల), దోర్డానా, కోహినూర్(కే), గుడిహత్నూర్, ఉమ్రి(బాలికల) ఆశ్రమ పాఠశాలల్లో ఒక్కరు చొప్పున, జైనూర్, గిన్నెధరి, మల్కెపల్లి, పాట్నాపూర్(బాలికల) ఆశ్రమ పాఠశాలల్లో ఇద్దరు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. మాన్కపూర్, పోచంలొద్ది, ఖానాపూర్(బాలికల), కుంటాల, జన్నారం, ఖానాపూర్ ఆశ్రమ పాఠశాలల్లో ముగ్గురు చొప్పున ఉత్తీర్ణులయ్యారు. స్వర్ణ, బోథ్(బాలికల), కోర్టికల్(కే) ఆశ్రమ పాఠశాలల్లో నలుగురు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఇక పది మంది లోపు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలలు 30 దాటలేదు. ఇక 13 కేజీబీవీల్లో నార్నూర్, మాణిక్యకపూర్ విద్యార్థులు ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. కుస్నపల్లి, కడెం, నార్నూర్, భీంపూర్ వసతి గృహాల్లో ఒక్కరు చొప్పున, భీమారంలో పది మంది, లక్సెట్టిపేటలో 11 మంది ఉత్తీర్ణులయ్యారు. కారణాలు అనేకం.. 2013-14 విద్యాసంవత్సరంలో గిరిజన సంక్షేమ శాఖలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఐటీడీఏ ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నెల తర్వాత అప్పటి డీడీటీడబ్ల్యూ రషీద్ అనారోగ్యం కారణంగా చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఉన్నతాధికారులే ఆయనను సెలవుపై పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి ఏపీవో(జనరల్) వెంకటేశ్వర్లుకు ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించారు. ఆయ న ఉద్యోగ విరమణ సమయం దగ్గరలో ఉండడంతో పూర్తి స్థాయిలో గిరిజన విద్యపై దృష్టి సారించలేదు. సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందగానే ఐటీడీఏ ఏవో భీమ్‌కు బాధ్యతలు అప్పగించినా ఆశించిన ఫలితం లేకుండాపోయింది. ఆశ్రమాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో గిరిజన విద్య గాడి తప్పు తూ వచ్చింది. నవంబర్ 28న సెలవుపై వెళ్లిన రషీద్ డీడీగా తిరిగి బాధ్యతలు స్వీకరించినా.. నెల తిరక్కుండానే డిసెంబర్ 21న ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ విద్యాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని విద్యాలయాలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆశ్రమ పాఠశాలల్లో 577 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఐటీడీఏ విద్యా సంవత్సరం ఆరంభంలో సీఆర్టీలను నియమించకుండా విడతల వారీగా నియామకాలు చేపట్టింది. ఈ ప్రక్రియ ముగిసే స రికి ఆగస్టు దాటడంతో సిలబస్ పూర్తి కాలేదు. అదీగాక సీఆర్టీలను ఏటా తొల గిస్తూ నియామకాలు చేపట్టడంతో కొత్తగా వచ్చే సీఆర్టీలకు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన లేక విద్యార్థులకు బోధించలేకపోయారనే ఆరోపణలున్నాయి. విద్యాసంవత్సరంలో సుమారు 20 మంది ఉపాధ్యాయులను ఐటీడీఏ పీవో సస్పెండ్ చేశారు. వీరికి నెలలు గడిచినా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో ఆశ్రమాల్లో పలు సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. పలువురికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు నిర్వహించడంతో పూర్తి స్థాయిలో తరగతుల బోధన లేక విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపింది. అధికారుల మధ్య సమన్వయ లోపం, పూర్తి స్థాయి డీడీటీడబ్ల్యూగా బాధ్యతలు నిర్వర్తించే వారు లేకపోవడంతో ఆశ్రమాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కొందరు ఉపాధ్యాయులు అనుమతి లేకుండా రోజుల తరబడి విధులకు ఎగనామం పెట్టారు. దూర ప్రాంతాల నుంచి ఇష్టారీతిగా రాకపోకలు సాగించడం, సీఆర్టీలపై భారం వేయడంతో నాణ్యమైన విద్య అందకుండా పోయింది. ప్రక్షాళన చేస్తేనే.. పదో తరగతి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచే గిరిజన సంక్షేమ శాఖలో ప్రక్షాళన చేస్తేనే గిరిజన విద్య గాడిలో పడే అవకాశ ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఆశ్రమాల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించని 50 మంది ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయి డీడీటీడబ్ల్యూను నియమించడం, పాఠశాలలు ప్రారంభానికి ముందే సీఆర్టీల నియామకం తదితర చర్యలు చేపడుతూ ప్రక్షాళన చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు గిరిజన గాడిలో పెడతారో లేదో వేచి చూడాల్సిందే.